Pharma City | ఫార్మా సిటీ ప్రాంతంలో ఏం జరుగుతోంది..? అఖిలపక్ష సమావేశానికి పిలుపు..!
Pharma City | ఫార్మా సిటీ రద్దు చేస్తాం.. అధికారంలోకి రాగానే రైతులకు ఫార్మా సిటీ భూములపై హక్కులు కల్పిస్తాం అని నాడు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి.. నేడు సీఎం స్థాయిలో ఫార్మా సిటీని రద్దు చేయాల్సింది పోయి.. అవే భూములను దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
Pharma City | త్రినేత్ర.న్యూస్ : ఫార్మా సిటీ రద్దు చేస్తాం.. అధికారంలోకి రాగానే రైతులకు ఫార్మా సిటీ భూములపై హక్కులు కల్పిస్తాం అని నాడు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి.. నేడు సీఎం స్థాయిలో ఫార్మా సిటీని రద్దు చేయాల్సింది పోయి.. అవే భూములను దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంలో.. డబ్బులు తీసుకొని, భూములు ఇవ్వాల్సిందే.. ఇదే ఆగేపని కాదు అని సీఎం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఫార్మా సిటీ ప్రాంతంలో ఏం జరుగుతోంది..? అనే అంశంపై ఈనెల 7వ తేదీన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించనున్నారు.
పత్రికా ప్రకటన సారాంశం ఇదే..
2014-2023 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్ మండలాల్లో 19,333 ఎకరాల్లో ఫార్మా సిటీ ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీని కోసం యాచారం మండలంలో దాదాపు పదివేల ఎకరాలు, కందుకూర్ మండలంలో మూడు వేల ఐదు వందల ఎకరాల భూమికి భూసేకరణ ప్రక్రియలు అమలు చేశారు.
వీటిలో అధిక భాగం అసైన్మెంట్, గవర్నమెంట్, భూములు. ఈ భూములు జీవో 45 ప్రకారం తీసుకున్నారు, అయితే ఆ జీవో చట్ట ప్రకారం చెల్లదని గౌరవ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఈ కోర్టు తీర్పు తరువాత జీవో 123 ప్రకారం ఇంకొంత అసైన్మెంట్ భూమిని, కొంత పట్టా భూమిని తీసుకున్నారు. ఈ జీవోను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టానికి సవరణ చట్టం తీసుకువచ్చి 2017 చట్టం ప్రకారం పట్టా భూముల సేకరణ కూడా మొదలు పెట్టారు.
యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, కుర్మిద్ద తండాల రైతులు దాదాపు ఎనిమిది వందల మంది ఈ భూ సేకరణకు వ్యతిరేకంగా 2018, 2020, 2021, 2022 సంవత్సరాల్లో గౌరవ హైకోర్టులో కేసులు వేశారు. ఈ గ్రామాలకు చెందిన దాదాపు 2500 ఎకరాల భూమిని సేకరించకుండా స్టేలు తెచ్చుకున్నారు. కొన్ని కేసుల్లో 2023లో ఇచ్చిన అవార్డులు, డిక్లరేషన్‌లను కూడా రద్దు చేశారు. తిరిగి మొదటి నుంచి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వం మరలా ఆ భూసేకరణ ప్రక్రియ అమలు చేయలేదు.
ఈ తీర్పు ప్రకారం నిజానికి ఆ కేసులకి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు రద్దయ్యాయి. ఈ నాలుగు గ్రామాలకు చెందిన రైతు కూలీలు కూడా 2021, 2022, 2024 సంవత్సరాల్లో రాష్ట్ర హై కోర్టులో కేసులు వేశారు. భూ సేకరణలో కూలీలకు పూర్తి పునరావాసం కల్పించకుండా, మొత్తం ఊరిలో ఏ భూమినైనా సరే భూమి స్వాధీన పర్చుకోవద్దని, ఎటువంటి పనులు చేయొద్దని, కోర్టు స్టే విధించింది. అంటే అసైన్మెంట్ భూమి అయినా, పట్టా భూమి అయినా సరే, చివరికి రైతుల ఆమోదం తెలిపిన భూముల్లో కూడా ఎటువంటి పనులు చేయకూడదని హై కోర్టు స్టే ఆర్డర్స్ ఉన్నాయి. ఆ స్టే ఆర్డర్స్ 2021 నుంచీ ఇప్పటి వరకూ వర్తిస్తాయి. కానీ గత ప్రభుత్వ హయాంలోనే కోర్టు స్టే ఉన్న పట్టా రైతుల భూములను ఆన్‌లైన్ రికార్డు (ధరణి) నుంచి తొలగించారు.
కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యపై రైతులు మళ్ళీ కోర్టుకి వెళ్లారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన నోటీసులకు జవాబు ఇస్తూ, అప్పటి ఆర్డీవో మా వల్ల తప్పు జరిగింది. పొరపాటున రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో తొలగించాం, అందరి పేర్లూ మళ్ళీ ఆన్‌లైన్‌లో ఎక్కిస్తామని కోర్టుకు తెలియజేశారు. కానీ ఆ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు.
ఆ సమయంలో రైతులు, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు కోదండ రెడ్డి గారు, శాసన సభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చాల అన్యాయమనీ, వెంటనే తొలగించిన రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో ఎక్కించాలనీ, వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలనీ డిమాండ్ చేశారు.
2017 నుంచి 2023 వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండ రెడ్డి, భట్టి విక్రమార్క, మల్‌రెడ్డి రంగారెడ్డి గార్లు- "మీరు ఫార్మా సిటీ కోసం భూములు ఇయ్యకండి, మా ప్రభుత్వం వచ్చాక ఫార్మా సిటీ రద్దు చేసి, మీ భుములకు పూర్తి హక్కులు కల్పిస్తాం" అని హామీ ఇచ్చారు.
2023 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఫార్మా సిటీ జీవో 31 రద్దు చెయ్యలేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా "తమ పేర్లు ఆన్‌లైన్‌లో ఎక్కించి, మా భుములకు అన్ని హక్కులు కల్పించండి" అని రైతులు కోరితే, " అది కుదరదు, మీరు మీ భూములు ప్రభుత్వానికి ఇయ్యాల్సిందే, ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాము" అంటున్నారు.
2023 ఎలక్షన్ మేనిఫెస్టోలో 2013 భూసేకరణ చట్టం పునరుద్దరిస్తాం అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆ చట్టం పునరుద్దరించలేదు. బీఆర్ఎస్ తెచ్చిన 2017 చట్టాన్ని రద్దు చేయ లేదు. బీఆర్ఎస్ తెచ్చిన 2017 చట్టం అక్రమమైనది, రైతులకు అన్యాయం చేస్తోంది అని నాడు కాంగ్రెస్ నాయకులు అనే వారు. కానీ ఇప్పుడు అదే 2017 తెలంగాణ భూ సేకరణ చట్టం ఆధారంగా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డుకి నోటిఫికేషన్ వేశారు. ఇతర గ్రామాలలో కూడా ఫ్యూచర్ సిటీ కోసం అంటూ కేసీఆర్ తెచ్చిన 2017 సవరణ చట్టాన్నే భూ సేకరణ కోసం ఉపయోగిస్తున్నారు.
ఏ భూములనైతే అప్పుడు కాపాడుతాం అని హామీ ఇచ్చారో, అవే భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మీరు ఇయ్యాల్సిందే అని కుర్మిద్ద తండా గిరిజిన రైతులను బెదిరిస్తున్నారు. ఆ గ్రామాల రైతులు గత 50 రోజులుగా రిలే నిరసన దీక్ష చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం నుంచి ఏ స్పందనా లేదు. భూ సేకరణపై కోర్టులో స్టే ఆర్డర్స్ ఉండగానే, చట్ట వ్యతిరేకంగా, టెండర్లు వేసి, రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, L& T కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా స్టే ఉన్న రైతుల భూముల్లోకి వచ్చి భూమిని చదును చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే పోలీసులని పెట్టించి బెదిరిస్తున్నారు. ప్రతి ఊరిలో రెండు మూడు బెటాలియన్ల పోలీసులను పెట్టించి, దౌర్జన్యంగా రైతుల భూములను స్వాధీన పర్చుకుంటున్నారు.
ఇది చట్ట వ్యతిరేకం, కోర్టు ధిక్కరణ అని రైతులు చెప్పినా కూడా వినకుండా పోలీసులు (ACP, CI వంటి ఆఫీసర్లు) పెడచెవిన పెట్టి, "మీరు కంటెంప్ట్ వేసుకుంటే వేస్కోండి పొండి" అని రైతులను భయపెడుతున్నారు. అందువల్ల, ఈ అత్యవసర పరిస్థితిలో మేము ఈ అఖిలపక్ష సమావేశం పిలిచాము. అన్ని పార్టీల, ప్రజా సంఘాల ప్రతినిధులూ రైతుల ఆవేదన, ఆందోళన వినాలని కోరుతున్నాం. రైతులు సాగిస్తున్న ఈ పోరాటానికి సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నాం. రైతుల డిమాండ్లపై, ప్రభుత్వ చర్యలపై మీ అభిప్రాయాలు కూడా తెలియచేయాలని, ఈ సమావేశం తరఫున ముఖ్యమంత్రి గారికి ఉమ్మడిగా ఒక మెమోరాండం ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తున్నాము.
అభినందనలతో,
ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ,
తెలంగాణా పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC)
మరిన్ని వివరాలకు : సరస్వతి కవుల (7995792102)
కన్నెగంటి రవి (9912928422)
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





