త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti | భ‌వ‌నాలన్నీ ఒకే డిజైన్‌లో ఉండాలే.. సోలార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలే

Ponguleti | రాష్ట్రంలో నిర్మించే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల భవనాల‌న్నీ ఒకే డిజైన్‌లో ఉండాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సూచించారు. క్యూర్ ప‌రిధిలో భ‌వ‌నాల నిర్మాణంపై శ‌నివారం స‌చివాలయంలో అధికారుల‌తో ఆయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

S

Telangana | Published On Jul 4, 2026, 6.41 pm IST

Ponguleti | భ‌వ‌నాలన్నీ ఒకే డిజైన్‌లో ఉండాలే.. సోలార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలే
Advertisement
  • క్యూర్ ప‌రిధిలో అర్భ‌న్ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
  • రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు శాశ్వత భవనాలు నిర్మిద్దాం
  • అధికారుల‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి దిశానిర్ధేశం

Ponguleti | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో నిర్మించే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల భవనాల‌న్నీ ఒకే డిజైన్‌లో ఉండాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సూచించారు. 10 ఆర్డీవో, 107 త‌హ‌శీల్దార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించి రెండు డీఐజీ, నాలుగు జిల్లా స‌బ్ రిజిస్ట్రార్, 52 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాలు నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ఈ భ‌వ‌నాల‌న్నీ ఆధునిక సదుపాయాలతో, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల‌న్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో సోలార్ పార్కింగ్ సదుపాయాలు కల్పించాల‌ని చెప్పారు. క్యూర్ ప‌రిధిలో భ‌వ‌నాల నిర్మాణంపై శ‌నివారం స‌చివాలయంలో అధికారుల‌తో ఆయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ది కార్య‌క్ర‌మాల‌లో వేగం పెంచాలన్నారు. ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం విజ‌య‌వంత‌మైంద‌న్నారు. ఇది దేశానికే ఆద‌ర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇదే స్పూర్తిని క్యూర్ ప‌రిధిలో చేప‌ట్ట‌బోయే అఫ‌ర్డ్‌బుల్ ఎల్ఐజీ అర్బ‌న్ హౌసింగ్‌లో కొన‌సాగించాల‌ని సూచించారు. క్యూర్ ప‌రిధిలో నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేద‌లు ప్ర‌స్తుతం నివ‌సిస్తున్న ప్రాంతాల‌కు స‌మీపంలో ఇండ్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ఇందుకోసం రెవెన్యూ, హౌసింగ్ విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలని ఆదేశించారు.

స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఇప్ప‌టికే ఖ‌రారైన స్థ‌లాల్లో పొజిష‌న్ తీసుకొని ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణను రూపొందించాల‌న్నారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థ‌లాల‌ను గుర్తించి త‌క్ష‌ణ‌మే ఖ‌రారు చేయాలని చెప్పారు. క్యూర్ ప‌రిధిలోని ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో తొలి విడ‌త‌లో 500 ఇళ్లు నిర్మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ ఇళ్ల‌కు సంబంధించి టెండ‌ర్ల‌ను కూడా త్వ‌ర‌లో ఖ‌రారు చేస్తామ‌ని వివ‌రించారు.

ఈ స‌మావేశంలో హౌసింగ్ కార్య‌ద‌ర్శి వి.పి. గౌత‌మ్‌, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేష‌న్ ఐజీ రాజీవ్ గాంధీ హ‌నుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement