త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంట‌ల వ్యవ‌ధిలో న‌లుగురి మృతి

Accident | త‌ల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద వార్త విన్న‌ కొడుకు, కోడ‌లు, అల్లుడు బ‌రువెక్కిన గుండెల‌తో వెంట‌నే బ‌య‌లుదేరారు. బాధ‌లో బ‌య‌లెళ్లిన వారిపై విధికి కూడా జాలి క‌ల‌గ‌లేదు. మార్గ‌మ‌ధ్య‌లోనే రోడ్డు ప్ర‌మాద రూపంలో వారిని మింగేసింది.

S

Telangana | Published On Aug 24, 2026, 7.30 pm IST

Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంట‌ల వ్యవ‌ధిలో న‌లుగురి మృతి
Advertisement
  • త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు బ‌య‌లుదేరిన కొడుకు, కోడ‌లు, అల్లుడిని క‌బ‌ళించిన మృత్యువు
  • నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా రాయ‌వ‌రంలో విషాదఛాయ‌లు

Accident | త్రినేత్ర‌.న్యూస్: త‌ల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద వార్త విన్న‌ కొడుకు, కోడ‌లు, అల్లుడు బ‌రువెక్కిన గుండెల‌తో వెంట‌నే బ‌య‌లుదేరారు. బాధ‌లో బ‌య‌లెళ్లిన వారిపై విధికి కూడా జాలి క‌ల‌గ‌లేదు. మార్గ‌మ‌ధ్య‌లోనే రోడ్డు ప్ర‌మాద రూపంలో వారిని మింగేసింది. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగిన ఈ మ‌ర‌ణ వార్త‌ల‌తో కుటుంబ స‌భ్యులు, బంధువులు, గ్రామ‌స్తులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా డిండి మండ‌ల కేంద్ర స‌మీపంలో సోమ‌వారం చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన లలితమ్మ అంగన్వాడీ టీచర్‌గా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం అచ్చంపేట పట్టణంలోని తన నివాసంలో ఉంటున్నారు. ఉన్న‌ట్టుండి సోమ‌వారం ఆమె గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం హైదరాబాద్‌లో ఉన్న ఆమె కుమారుడు శ్రీకాంత్‌కు తెలియడంతో అత‌ని భార్య చంద్రకళ (29), అల్లుడు నాగరాజు (25)తో కలిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ‌మ‌ధ్య‌లో నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంకు సమీపంలో ఎదురుగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రకళ, నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు, పోలీసులు క‌లిసి హుటాహుటిన‌ హైద‌రాబాద్‌కు త‌ర‌లించగా అత‌ను కూడా మృతి చెందారు. మృతుడు నాగరాజు స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం చిన్నరాజుపాలెం గ్రామమని కుటుంబ సభ్యులు తెలిపారు.

గ్రామంలో విషాద ఛాయలు..

ఒకే కుటుంబంలో గంట‌ల‌ వ్యవధిలోనే నలుగురు మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తల్లి అంత్యక్రియలకు వెళ్లాల్సిన కుటుంబంలోనే వరుసగా మూడు మరణాలు సంభవించడంతో రాయవరం గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కాగా ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement