త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pavitrotsavam | తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్ర‌ సమర్పణ

Pavitrotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.

P

Devotional | Published On Aug 24, 2026, 7.09 pm IST

Pavitrotsavam | తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్ర‌ సమర్పణ
Advertisement

Pavitrotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకం చేశారు. తర్వాత వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులు, జయవిజయులు, గరుడాళ్వారు, వరదరాజస్వామివారు, వకుళమాత అమ్మవారు, ఆనందనిలయం, యాగశాల, విష్వక్సేనులవారు, యోగనరసింహస్వామివారు, భాష్యకార్లు, పోటు తాయారు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామివారు, శ్రీబేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరుమలలో పవిత్రోత్సవాలు 15, 16వ శతాబ్దాల వరకు జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1962లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను తిరిగి ప్రారంభించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీవారి ఉత్సవమూర్తులకు సమర్పించే పవిత్రాల కోసం ఉపయోగించే పత్తిని ప్రత్యేకంగా పెంచేవారు. అత్యంత పవిత్రమైన తులసి మొక్కలను పెంచే పెరటి భూమిలోనే శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను సాగు చేయడం ఆనవాయితీగా ఉండేది. పవిత్రాల తయారీకి 20 మూరల పట్టుదారం లేదా 200 మూరల నూలుదారం వినియోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దుతారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement