త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhu Bharathi | ‘భూ భార‌తి’కి భారీ గండి..! రేవంత్ పూడ్చేనా..?

Bhu Bharathi | భూ భార‌తితో రైతుల‌కు లాభం దేవుడెరుగు కానీ.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాకు మాత్రం భారీ గండి ప‌డింది. భూముల‌ రిజిస్ట్రేష‌న్ల ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రావాల్సిన సొమ్మును కొంద‌రు అక్ర‌మంగా మ‌ళ్లించి కోట్ల రూపాయాల‌కు ప‌డ‌గ‌లెత్తిన‌ట్లు స‌మాచారం.

S

Telangana | Published On Jan 10, 2026, 2.16 pm IST

Bhu Bharathi | ‘భూ భార‌తి’కి భారీ గండి..! రేవంత్ పూడ్చేనా..?
Advertisement

Bhu Bharathi | త్రినేత్ర‌.న్యూస్ : భూ స‌మ‌స్య‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌ల్ల రైతులు అన్యాయానికి గుర‌వుతున్నార‌ని భావించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం దాని స్థానంలో భూ భార‌తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ భూ భార‌తితో రైతుల‌కు లాభం దేవుడెరుగు కానీ.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాకు మాత్రం భారీ గండి ప‌డింది. భూముల‌ రిజిస్ట్రేష‌న్ల ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రావాల్సిన సొమ్మును కొంద‌రు అక్ర‌మంగా మ‌ళ్లించి కోట్ల రూపాయాల‌కు ప‌డ‌గ‌లెత్తిన‌ట్లు స‌మాచారం.

జ‌న‌గామ జిల్లా వేదిక‌గా బ‌య‌ట‌ప‌డిన భూ భార‌తి రిజిస్ట్రేష‌న్ చార్జీల చెల్లింపుల అక్ర‌మాల‌పై లోకాయుక్త తీవ్రంగా స్పందించింది. ఈ కుంభ‌కోణాన్ని సుమోటోగా స్వీక‌రించిన లోకాయుక్త పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపి స‌మ‌గ్ర‌ నివేదిక స‌మ‌ర్పించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రెవెన్యూ భూ ప‌రిపాల‌న శాఖ చీఫ్ క‌మిష‌న‌ర్, స్టాంపులు రిజిస్ట్రేష‌న్ల శాఖ క‌మిష‌న‌ర్, మీ సేవా క‌మిష‌న‌ర్, జ‌న‌గామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేష‌న్ల శాఖ‌ల‌ను ఆదేశించింది.

అస‌లు క‌థ ఇదీ..!

రాష్ట్రంలో భూముల క్ర‌య‌విక్ర‌యాల‌కు సంబంధించి మొద‌ట‌గా భూభార‌తి పోర్ట‌ల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు. గ్రామీణ ప్రాంత రైతుల‌కు ఈ పోర్ట‌ల్‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో.. త‌మ‌కు స‌మీపంలోని మీ సేవా కేంద్రాలు, నెట్ సెంట‌ర్ల నిర్వాహ‌కుల‌ను లేదా త‌హ‌సీల్దార్ కార్యాలయాల వ‌ద్ద ఉండే డాక్యుమెంట్ రైట‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తారు. భూ భార‌తి పోర్ట‌ల్‌లో స్లాట్ బుక్ చేయాల‌ని చెప్పి వారికే డ‌బ్బులు చెల్లిస్తుంటారు. రైతుల అజ్ఞానాన్ని, అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకుని అక్ర‌మార్కులు దోపిడీకి తెర‌లేపి కోట్ల రూపాయాలు దండుకుంటున్నారు.

అయితే.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలాన్‌ రసీదులపై చెల్లించే మొత్తం సరిగానే ఉంటున్నా.. ప్రభుత్వ ఖ‌జానాలో మాత్రం అతి తక్కువగా జమ అవుతున్న‌ట్లు తేలింది. ఉదాహరణకు రూ.10,000 చెల్లిస్తే.. ఖజనాలో మాత్రం రూ.1000 మాత్రమే జమ అవుతున్నాయి. చెల్లించిన సొమ్ముకు సంబంధించిన సంఖ్య చివరి ఒకటి లేదా రెండు అంకెలను తొలగించి లేదా మార్ఫింగ్‌ చేస్తున్న మీ సేవ, స్లాట్‌ బుకింగ్‌ కేంద్రాల నిర్వాహకులు తక్కువ మొతాన్ని ట్రెజరీకి జమ చేసి ఎక్కువ మొత్తాన్ని తమ వ్యక్తిగత ఖాతాలోకి లేదా లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చిన సంబంధిత మోసగాడి ఖాతాకు మళ్లించుకుంటున్నారు.

ఇంటి దొంగ‌ల ప‌నేనా..?

అయితే ఈ కుంభ‌కోణం వెనుకాల ఎవ‌రు ఉన్నార‌నే దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. సైబర్ కేటుగాళ్లు దోపిడీకి పాల్ప‌డుతున్నారా..? లేదా ఇంటి దొంగ‌ల ప‌నా..? అనే కోణంలో సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌కు తెలియకుండానే ఈ తతంగం జరిగిందా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.

జ‌న‌గామ‌లో ఒక్క‌రోజే రూ. 8 ల‌క్ష‌లు స్వాహా..!

జనగామలో ఒకే రోజు 10 చలాన్లకు చెందిన రూ. 8,55,577ల‌ను దుండ‌గులు కాజేశారు. ఈ న‌గ‌దు అంతా అక్ర‌మార్కుల జేబుల్లోకి మ‌ళ్లిన‌ట్టు గుర్తించింది అధికార యంత్రాంగం. అయితే ప్ర‌భుత్వ ఖ‌జానాకు రావాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ల చ‌లాన్ల సొమ్ములో గ‌త కొద్ది రోజుల నుంచి భారీ తేడాల‌ను గ‌మ‌నించిన త‌హసీల్దార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇదే విష‌యాన్ని ఉన్న‌తాధికారుల‌కు కూడా చేర‌వేశారు.

ముగ్గురు అరెస్ట్..!

ఈ కేసులో వ‌రంగ‌ల్ సీసీఎస్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యాద‌గిరిగుట్ట‌కు చెందిన ఇంట‌ర్నెట్ నిర్వాహ‌కుడు, జ‌న‌గామ జిల్లాలోని మ‌రో ఇద్ద‌రు ఇంట‌ర్నెట్ నిర్వాహ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కుంభ‌కోణానికి సూత్ర‌ధారి యాద‌గిరిగుట్ట‌కు చెందిన ఇంట‌ర్నెట్ నిర్వాహ‌కుడు కాగా, అత‌నికి జ‌న‌గామ జిల్లాలోని ఇద్ద‌రు ఇంట‌ర్నెట్ కేంద్రాల నిర్వాహ‌కులు స‌హ‌క‌రించిన‌ట్లు తెలిసింది. ఈ ముగ్గురు గ‌త మూడు రోజుల్లోనే జ‌న‌గామ‌లోనే ఇలా 22 స్లాట్ల‌ను బుక్ చేసి త‌క్కువ మొత్తంలో చెల్లింపులు చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు.

ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతా ద్వారా..

యాద‌గిరిగుట్ట‌కు చెందిన ఇంట‌ర్నెట్ నిర్వాహ‌కుడు జ‌న‌గామ‌, యాదాద్రి భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, రంగారెడ్డి, సంగారెడ్డి త‌దిత‌ర జిల్లాల్లో మ‌రికొంద‌రు ఇంట‌ర్నెట్ నిర్వాహ‌కుల‌తో భూమి రిజిస్ట్రేష‌న్ స్లాట్లు బుక్ చేయిస్తూ తానే నెట్ బ్యాంకింగ్ ద్వారా స్లాట్ల‌కు డ‌బ్బులు చెల్లిస్తూ ఈ మోసాల‌కు పాల్పడిన‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలో రూ. ల‌క్ష‌ల్లో నెట్ బ్యాంకింగ్ చేస్తే ఐటీ ఇబ్బందులు ఉంటాయ‌ని భావించిన స‌ద‌రు ఇంట‌ర్నెట్ నిర్వాహ‌కుడు ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతా ద్వారా స్లాట్లు బుక్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement