త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Congress Govt | ఇది మీకు తెలుసా? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలెన్నో? ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 45 కమిటీలు. ఈ మూడేళ్ల పాలనలో మరి ఆ కమిటీలు ఏమైనా తేల్చాయా? అంటే.. సమాధానం నో. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం వంటి ఒకట్రెండు సామాజిక సాంస్కృతిక అంశాల్లో తప్ప.. ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై ఈ కమిటీలు తేల్చింది గుండు సున్నా.

S

Telangana | Published On Oct 4, 2026, 7.45 pm IST

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
Advertisement
  • మూడేళ్ల పాలనలో చీటికి మాటికి
  • కమిటీలు.. కమిషన్లు.. ఎంక్వైరీలు
  • సమస్యలు తేల్చేదెన్నడు?
  • పరిష్కారం చూపెదెప్పుడు?
  • అధ్యయనాలతో సరిపెడుతున్న కమిటీలు

Congress Govt | ఇది మీకు తెలుసా? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలెన్నో? ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 45 కమిటీలు. ఈ మూడేళ్ల పాలనలో మరి ఆ కమిటీలు ఏమైనా తేల్చాయా? అంటే.. సమాధానం నో. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం వంటి ఒకట్రెండు సామాజిక సాంస్కృతిక అంశాల్లో తప్ప.. ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై ఈ కమిటీలు తేల్చింది గుండు సున్నా. అంతేకాదు.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూడా కాళేశ్వరంపై కమిషన్, కరెంటు అక్రమాలపై కమిషన్, గొర్రెలు, చేపపిల్లల పంపిణీపై, ఫార్ములా రేసుకోర్స్‌పై ఏసీబీ విచారణ, ఫోన్ ట్యాపింగ్ వంటివి కూడా ఉన్నాయి. వీటిపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి తప్ప.. ఇప్పటి వరకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.

నిజాం ఫ్యాక్టరీపై సబ్ కమిటీ నుంచి..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే.. 2024 జనవరిలో మూతపడిన నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్‌ను తెరిపించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఈ కేబినెట్ సబ్ కమిటీ బోధన్, ముత్యంపేట ఫ్యాక్టరీల పరిధిలోని ఆర్థిక ఇబ్బందులు, పెండింగ్ బకాయిలు, చెరుకు రైతుల సమస్యలపై సుదీర్ఘంగా అధ్యయనం చేసింది. ఫ్యాక్టరీని నడపడంలో చిక్కులను, న్యాయ వివాదాలను ప్రస్తావిస్తూ.. కేవలం ప్రభుత్వం మాత్రమే నడపలేదని నివేదిక సమర్పించింది. మరికొన్ని అంశాలను సూచించింది. ఇదంతా జరిగి రెండేళ్లు పూర్తి కావొస్తున్నది. కమిటీ అధ్యయనం పూర్తైంది. కానీ నిజాం షుగర్స్ మాత్రం ఇంకా తెరుచుకోలేదు.. ఇలాంటి చాలా చాలా అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలు వేస్తూనే పోయింది కానీ.. ఎంచుకున్న సమస్యల్లో చాలా వరకు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఇలా 33 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 45 కమిటీలను నియమించింది. ఈ కమిటీలు దాదాపు 11 కీలక అంశాలపైన అధ్యయనం చేస్తున్నాయి. నివేదికలు సమర్పిస్తున్నాయి. తప్ప.. చివరికి పరిష్కారం మాత్రం దక్కలేదు.

ఆరు గ్యారంటీల నుంచి.. కాళేశ్వరం దాకా..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2026 సెప్టెంబరు 24 వరకు ముఖ్యంగా పది అంశాలపై కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో ముఖ్యంగా ఆరుగ్యారంటీల అమలు, కులగణన రిజర్వేషన్లు, రైతు సంక్షేమ కమిషన్, ఉద్యోగ నియామాకాల్లో మార్పులపై కమిటీ, విద్యా సంస్కరణల్లో మార్పులపై కమిటీ, మూసీ ప్రక్షాళనపై కమిటీ వంటివి పరిపాలనకు సంబంధించినవి. కాగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్, ధరణి భూ వ్యవహారాలపై, గొర్రెలు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ పై ఏసీబీ విచారణలు వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఆ కమిటీల వివరాలివి..

I. కేబినెట్‌ సబ్‌కమిటీలు

1. ఆరు గ్యారంటీలు – ప్రజాపాలన
(డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వం - ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన, అర్హుల గుర్తింపు, ఆరు గ్యారంటీల అమలు, అమలు ప్రక్రియకు మార్గదర్శకత్వం)
2. రాష్ట్ర చిహ్నం – తెలంగాణ తల్లి – రాష్ట్ర గీతం
(భట్టి విక్రమార్క నేతృత్వం - కొత్త రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం రూపకల్పన, సమావేశాలు; అనంతరం పలు అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు)
3. విద్యా వ్యవస్థ (శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ - పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు సంస్కరణలు, విద్యా కమిషన్‌తో పాటు విధాన ప్రక్రియ)
4. నిజాం షుగర్స్‌ పునరుద్ధరణ
(దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - బోధన్‌, ముత్యంపేట తదితర కర్మాగారాల పునరుద్ధరణ, అధ్యయనం/సిఫారసులు)
5. 317 జీవో
(దామోదర రాజనర్సింహ - స్థానిక కేడర్‌, ఉద్యోగుల కేటాయింపులు, స్పౌజ్‌, వైద్య, మ్యూచువల్‌ సమస్యలు, 20-10-2024న నివేదిక)
6. డీఎస్సీ – 2008
(మంత్రివర్గ ఉపసంఘం, 2008 డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కారం, 1,382 మందిని కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకునే నిర్ణయానికి సిఫారసులు)
7. కొత్త రేషన్‌ కార్డులు / ఆరోగ్య కార్డులు
(ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వం, అర్హత ప్రమాణాలు, కొత్త రేషన్‌ కార్డుల విధానం, మార్గదర్శకాలు; 2025లో కొత్త కార్డుల ప్రక్రియ)
8. రైతు భరోసా
(భట్టి విక్రమార్క - అర్హతలు, సాగుభూమి, రియల్‌ ఎస్టేట్‌, కొండలు తదితరాలపై పరిశీలన, నివేదిక/విధివిధానాలు)
9. మెగా ప్రాజెక్టులు
(మంత్రివర్గ ఉపసంఘం - ఫ్యూచర్‌ సిటీ, భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు, పెట్టుబడులు/15 రోజులకు ఒకసారి సమీక్షించాలని ఆదేశం)
10. ప్రజాపాలన దరఖాస్తుల అమలు
(భట్టి విక్రమార్క - దరఖాస్తుల డిజిటలైజేషన్‌, భౌతిక పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక/ఆరు గ్యారంటీల అమలులో భాగంగా పనిచేసింది)

II. బీఆర్‌ఎస్‌ పాలనలోని నిర్ణయాలపై న్యాయ విచారణలు

11. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌
(రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్ - మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డిజైన్‌, నిర్మాణం తదితరాలు/ నివేదిక 31-07-2025; అనంతరం సీబీఐకి)
12. విద్యుత్‌ కొనుగోళ్లు/యాదాద్రి – భద్రాద్రి
(రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి - ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్లు/ లోకూర్‌ కమిషన్‌ దశకు చేరింది)
13. విద్యుత్‌ అంశంపై లోకూర్‌ కమిషన్‌
(జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్ - విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి–యాదాద్రి ప్లాంట్లు/ 114 పేజీల నివేదిక; 2026లో సీబీఐకి అప్పగించే నిర్ణయం)

III. ధరణి – భూ వ్యవహారాలు

14. ధరణి కమిటీ
(ధరణి పోర్టల్‌, ఆర్‌ఓఆర్‌ చట్టం, భూ రికార్డుల సమస్యలు/ నివేదిక)
15. ధరణి నిర్వహణ సంస్థపై విచారణ
(పోర్టల్‌ నిర్వహణ, ప్రైవేటు ఏజెన్సీ, డేటా/పరిపాలనా లోపాలు/సమగ్ర విచారణకు ఆదేశం)
16. భూ వివాదాల ప్రత్యేక కమిటీ
(భూ హక్కులు, రికార్డులు, రైతుల సమస్యలు/ సంస్కరణలకు సూచనలు)
17. 22 - ఏ ఆస్తుల పరిష్కార కమిటీ – GO Rt.No.564
(22 - ఏ నిషేధిత జాబితాలో పెండింగ్‌ ఆస్తుల కేసులు/ 2026 సెప్టెంబరులో ఏర్పాటు)
18. భూ అక్రమాల రాష్ట్రస్థాయి కమిటీ – GO Ms.No.134
(ప్రభుత్వ, అసైన్డ్‌, సీలింగ్‌, జాగీర్‌, భూదాన్‌, ఇనాం, అటవీ భూములు, చెరువులు, భూ రికార్డులు తదితరాలు/24-09-2026న తాజా ఏర్పాటు. 22 - ఏ కేసుల వేగవంతమైన పరిష్కారానికి GO Ms.No.564తో సీసీఎల్‌ఏ డి.ఎస్‌. లోకేశ్‌కుమార్‌ చైర్మన్‌గా, న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు సభ్యులుగా కమిటీ ఏర్పడింది. సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, సీలింగ్‌ సర్‌ప్లస్‌, జాగీర్‌, భూదాన్‌, ఇనాం, అటవీ భూములు, నీటి వనరులు, క్యాచ్‌మెంట్‌ ప్రాంతాలు, భూసేకరణ, భూ రికార్డులు, 22 - ఏ అంశాలు, పరిశీలించే అధికారం ఇచ్చారు. ఉల్లంఘనలు తేలితే బాధ్యత నిర్ణయించి చర్యలు సిఫారసు చేయాలి. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు కుటుంబాలకు సంబంధించిన భూములతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులకు సంబంధించిన మొత్తం 16 భూ వ్యవహారాలు పరిశీలన పరిధిలో ఉంటాయి)

V. విజిలెన్స్ – ఏసీబీ – సిట్‌ విచారణలు

19. గొర్రెల పంపిణీ పథకం
(విజిలెన్స్‌ → ఏసీబీ- కొనుగోళ్లు, లబ్ధిదారులు, నిధులు)
20. చేప పిల్లల పంపిణీ
(విజిలెన్స్‌ విచారణ - కొనుగోళ్లు, పంపిణీ)
21. ఫోన్‌ ట్యాపింగ్‌ సిట్‌
(ఎస్‌ఐబీ - నిఘా, డేటా ధ్వంసం)
22. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఒప్పందాలు
(ప్రభుత్వ పరిశీలన - గత ఒప్పందాల ఆర్థిక ప్రభావం)
23 . ఫార్ములా – ఈ
(ఏసీబీ + ఈడీ - చెల్లింపులు, అనుమతులు, నిధుల వినియోగం)
24. ఓఆర్‌ఆర్‌ టోల్‌ టెండర్లు
(ప్రభుత్వ విచారణ/ సిట్ - టెండర్‌ ప్రక్రియ, ప్రభుత్వ ఆదాయ అంశాలు)
25. ఇసుక తవ్వకాలు/రవాణా
(విజిలెన్స్‌, ఏసీబీ - మైనింగ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా)
26. సెల్లార్‌ తవ్వకాలు
(మైనింగ్‌ శాఖ - మట్టి/మొరం/రాయి తవ్వకం, సీనరేజ్‌)
27 . హెచ్‌ఎండీఏ/జీహెచ్‌ఎంసీ
(భూ–భవన వ్యవహారాలు, విజిలెన్స్ - అనుమతులు, రికార్డులు, చెరువులు)

VI. సీబీఐకి వెళ్లిన అంశాలు

28. కాళేశ్వరం
(కమిషన్‌ నివేదిక అనంతరం 2025 సెప్టెంబరులో సీబీఐకి అధికారికంగా అప్పగించారు)
29. విద్యుత్‌ కొనుగోళ్లు/యాదాద్రి–భద్రాద్రి
(జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ కమిషన్‌ నివేదికను 2026లో సీబీఐకి అప్పగించాలని కేబినెట్‌ నిర్ణయించింది)

VII. సామాజిక న్యాయం – కులగణన – రిజర్వేషన్లు

31.ఎస్సీ ఉపవర్గీకరణ కేబినెట్‌ సబ్‌కమిటీ
(ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణపై సిఫారసులు/ నివేదిక)
32. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌
(రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఎస్సీ ఉపవర్గీకరణ నివేదిక; మూడు గ్రూపుల సిఫారసు)
33. కులగణన స్వతంత్ర నిపుణుల కమిటీ
(జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే డేటా అధ్యయనం 2025 జూలైలో నివేదిక)
34. బీసీ వెనుకబాటుతన సూచిక అధ్యయనం
(జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని Independent Expert Working Group‌ను 2025 మార్చిలో ఏర్పాటు చేసి, కుల సర్వే డేటాను స్వతంత్రంగా విశ్లేషించే బాధ్యత అప్పగించారు; 2025 జూలైలో 300 పేజీల నివేదిక సమర్పించింది)

VIII. వ్యవసాయం – రైతులు

35. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌
(చైర్మన్‌: ఎం. కోదండరెడ్డి - పంటల మార్పిడి, రైతుల సంక్షేమం, సాగునీరు, కౌలు రైతులు, వ్యవసాయ విధానం తదితర అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు. 2026లో పంటల మార్పిడిపై నివేదిక, చిన్న నీటిపారుదలపై నివేదిక, చెరువుల పరిరక్షణ, ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులపై సూచనలు సమర్పించింది.)

IX. విద్య

36. తెలంగాణ విద్యా కమిషన్‌
(చైర్మన్‌: రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళ - ప్రీ - ప్రైమరీ నుంచి విశ్వవిద్యాలయాల వరకు సమగ్ర విద్యా విధానంపై అధ్యయనం. 2026లో విద్యా విధాన నివేదికను సమర్పించింది)
37. విద్యా కేబినెట్‌ ఉపసంఘం
(శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ - విద్యా వ్యవస్థలో సంస్కరణలపై పని చేసింది)
38. విద్యలో AIపై ఉన్నతస్థాయి కమిటీ
(2026లో పాఠశాల, సాంకేతిక, వైద్య విద్యలో కృత్రిమ మేధ వినియోగాన్ని చేర్చే విధానంపై నిపుణుల కమిటీ ఏర్పాటు, మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ నుంచి వ్యూహాత్మక సూచనలు కోరారు)

X. ఉద్యోగులు–నియామకాలు

39. 317 జీవో కేబినెట్‌ సబ్‌కమిటీ
(ఉద్యోగుల స్థానిక కేడర్‌ కేటాయింపులపై అత్యంత ముఖ్యమైన కమిటీ. నివేదిక 20 అక్టోబరు 2024న సమర్పించారు)
40. డీఎస్సీ – 2008 కేబినెట్‌ సబ్‌కమిటీ
(2008 డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై ఏర్పాటైన కమిటీ. దాని సిఫారసుల మేరకు 1,382 మంది అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించే ప్రక్రియ)
41. టీజీపీఎస్సీ/నియామక పరీక్షల సంస్కరణల అధ్యయనం
(టీజీపీఎస్సీ పరీక్షల విధానం, సిలబస్‌, గ్రూపుల పరీక్షా విధానంపై నిపుణుల కమిటీ/కేబినెట్‌ స్థాయి పరిశీలన ప్రక్రియ కూడా ఉంది. పాత పరీక్షా విధానాన్ని పునఃపరిశీలించేందుకు నిపుణుల నివేదిక, టీజీపీఎస్సీ సిఫారసులను పరిశీలించే కేబినెట్‌ ఉపసంఘం ఏర్పడింది)

ఇతరాలు

42. మూసీ ప్రక్షాళనపై కేబినెట్‌ ఉపసంఘం
(2026 మార్చిలో సీఎం మూసీ ప్రక్షాళనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుతో కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు)
43. గ్రామీణ ఉపాధి పథకంపై కేబినెట్‌ ఉపసంఘం
(2026లో కేంద్ర గ్రామీణ ఉపాధి పథకంలో మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జి. వివేక్‌ వెంకటస్వామి, సీతక్కలతో కేబినెట్‌ ఉపసంఘం ఏర్పాటు చేసింది. తెలంగాణపై ఆర్థిక ప్రభావం, ఇతర రాష్ట్రాల అనుభవాలు, భవిష్యత్‌ కార్యాచరణను అధ్యయనం చేయడం దీని పని).
44. 99 రోజుల "ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక" కేబినెట్‌ సబ్‌కమిటీ
(2026 ఫిబ్రవరిలో ఏర్పాటైన కేబినెట్‌ ఉపసంఘం 99 రోజుల కార్యాచరణపై చర్చించింది. 6 మార్చి–12 జూన్‌ 2026 మధ్య వివిధ శాఖల లక్ష్యాల అమలుకు ప్రణాళిక రూపొందించబడింది)
45. రోహిత్‌ వేముల చట్టం రూపకల్పనపై కేబినెట్‌ ఉపసంఘం
(2026లో ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను నిరోధించే ప్రతిపాదిత రోహిత్‌ వేముల చట్టం రూపకల్పనకు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. సభ్యులుగా దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు.)

Advertisement
Advertisement