త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మ‌ల‌

Minister Tummala | రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు కొరత లేకుండా ముందస్తుగా ఎరువులను అందుబాటులో ఉంచడంతోపాటు, యాప్‌ల ద్వారా పంపిణీని పర్యవేక్షించినట్లు చెప్పారు.

P

Telangana | Published On Oct 6, 2026, 6.33 pm IST

Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

Minister Tummala | రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు కొరత లేకుండా ముందస్తుగా ఎరువులను అందుబాటులో ఉంచడంతోపాటు, యాప్‌ల ద్వారా పంపిణీని పర్యవేక్షించినట్లు చెప్పారు. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడటంతో గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి 35 వేల టన్నుల యూరియా వినియోగం తగ్గిందన్నారు. ఖరీఫ్‌-2026లో రాష్ట్ర ఫెర్టిలైజర్‌ యాప్‌ ద్వారా 33.39 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా.. 142.08 లక్షల బస్తాలు బుక్‌ అయ్యాయని మంత్రి తెలిపారు. వీటిలో 128.18 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఎఫ్ఎఫ్ఎస్ (FFS) యాప్‌ ద్వారా 37.48 లక్షల QR కోడ్‌లు జనరేట్‌ కాగా.. 141.88 లక్షల బస్తాలు బుక్‌ అయ్యాయని, ఇందులో 104.99 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారని వివరించారు. ఎక్కడ ఎంత ఎరువు నిల్వ ఉంది ? ఎంత బుకింగ్‌ జరిగింది ? ఎంత మేరకు రైతులు కొనుగోలు చేశారన్న వివరాలను యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన యూరియా యాప్‌ కూడా అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను నియంత్రించడంలో ఉపయోగపడిందన్నారు.

పొజిషనింగ్‌తో కొరతకు చెక్‌

ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ఎరువుల నిల్వలను రాష్ట్రంలో పొజిషన్‌ చేశామని తుమ్మల తెలిపారు. దిగుమతి ఎరువుల షిప్‌మెంట్లు వేగంగా రాష్ట్రానికి చేరేలా షిప్‌యార్డుల్లో ప్రత్యేక అధికారులను నియమించి కేంద్రంతో సమన్వయం చేశామన్నారు. జాతీయ ఫెర్టిలైజర్‌ యాప్‌ ప్రారంభ దశలో రెవెన్యూ గ్రామాల మ్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఎదురైనా.. అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 0.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం డీఏపీ(DAP) 0.39 లక్షల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 2.72 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ (MOP) 0.36 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఎస్ఎస్‌పీ (SSP) 0.18 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అక్టోబర్‌లో రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా ప్రణాళిక ఉందని.. ఇప్పటివరకు 0.18 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చాయని తెలిపారు. ఇందులో దేశీయ ఉత్పత్తి ద్వారా 0.87 లక్షల మెట్రిక్‌ టన్నులు, దిగుమతుల ద్వారా 1.13 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరా లక్ష్యంగా ఉందన్నారు. అక్టోబర్‌లో DAPకు 0.30 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరా ప్రణాళిక ఉందని పేర్కొన్నారు.

ఫార్మర్స్‌ రిజిస్ట్రీలో ముందంజ

రైతుల సమగ్ర సమాచారాన్ని డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ ముందంజలో ఉందని తుమ్మల తెలిపారు. ఫార్మర్స్‌ రిజిస్ట్రీని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో **డిజిటల్‌ క్రాప్‌ సర్వే ఆధారంగానే** పంటల కొనుగోళ్లు, వ్యవసాయ యాంత్రీకరణ, సబ్సిడీపై విత్తనాల పంపిణీ తదితర పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. వానాకాలం 2026-27 డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో ఇప్పటివరకు 1,93,25,309 వ్యవసాయ క్షేత్రాలను సర్వేకు కేటాయించగా.. 1,46,67,370 క్షేత్రాల సర్వే పూర్తయింది. దీంతో 75.9 శాతం సర్వే పూర్తయినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,164 మంది వాలంటీర్లు రిజిస్టర్‌ కాగా.. 9,820 మంది యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని సర్వే ప్రారంభించారని చెప్పారు. అక్టోబర్‌ 5న ఒక్కరోజే 2,69,597 క్షేత్రాల సర్వే పూర్తయిందన్నారు. కొన్ని జిల్లాల్లో 95 శాతం వరకు సర్వే పూర్తికాగా.. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పురోగతి తక్కువగా ఉందని మంత్రి వివ‌రించారు.

Advertisement
Advertisement