Maoists | దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు( Maoists ) బలగాల తూటాలకు బలయ్యారు. అగ్ర నేతలు కూడా ఎన్‌కౌంటర్లకు గురయ్యారు. పలువురు అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. అక్కడక్కడ ఉన్న మావోయిస్టుల కోసం దండకారణ్యాన్ని బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. దీంతో పలువురు మావోయిస్టులు బలగాల కూంబింగ్ నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలం బాబ్జీపేట పంచాయతీ పరిధిలోని పెద్దదోబ గూడెంలోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో కుమ్రం భీం ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలో బలగాలు భారీ సంఖ్యలో చేరుకుని ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఎలాంటి ఎదురుకాల్పులకు తావులేకుండానే 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ఏకే 47, మరో రెండు ఇన్సాస్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మావోయిస్టుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. మరో ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని సమాచారం. అయితే ఆశ్రయమిచ్చిన ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీసుకు తరలించినట్లు సమాచారం. మావోయిస్టులు సెల్‌ఫోన్ వినియోగించడంతోనే పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది.