త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Temple Wearable | త‌ల‌కు ధ‌రించే స‌రికొత్త వేర‌బుల్ డివైస్‌.. భార‌త్‌లో అమ్మ‌కాలు షురూ.. ఏంటిది, ఎలా ప‌నిచేస్తుంది..?

Temple Wearable | ముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మద్దతుతో రూపొందించిన ప్రీమియం హెల్త్‌ అండ్‌ అథ్లెటిక్‌ వేరబుల్‌ పరికరం టెంపుల్‌ భారత్‌లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.85వేలుగా నిర్ణయించారు. ప్రత్యేకంగా తలకు ధరించేలా రూపొందించిన ఈ పరికరం గుండె స్పందన రేటును పర్యవేక్షించడంతోపాటు వ్యాయామ సమయంలో శారీరక పనితీరును విశ్లేషిస్తుంది.

S

Technology | Published On Nov 3, 2026, 12.31 pm IST

Temple Wearable | త‌ల‌కు ధ‌రించే స‌రికొత్త వేర‌బుల్ డివైస్‌.. భార‌త్‌లో అమ్మ‌కాలు షురూ.. ఏంటిది, ఎలా ప‌నిచేస్తుంది..?
Advertisement

Temple Wearable | ముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మద్దతుతో రూపొందించిన ప్రీమియం హెల్త్‌ అండ్‌ అథ్లెటిక్‌ వేరబుల్‌ పరికరం టెంపుల్‌ భారత్‌లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.85వేలుగా నిర్ణయించారు. ప్రత్యేకంగా తలకు ధరించేలా రూపొందించిన ఈ పరికరం గుండె స్పందన రేటును పర్యవేక్షించడంతోపాటు వ్యాయామ సమయంలో శారీరక పనితీరును విశ్లేషిస్తుంది.

వెబ్‌సైట్‌, యాప్ ద్వారా ఆర్డ‌ర్లు..

టెంపుల్‌ సంస్థ రూపొందించిన ఈ పరికరాన్ని ముందస్తుగా ఆర్డర్‌ చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. ఆర్డర్‌ చేసిన మూడు నెలల్లో తొలి విడత డెలివరీలు ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరికరంలోని ఆప్టికల్‌ ఫోటోప్లెథిస్మోగ్రఫీ (పీపీజీ) సెన్సార్ల పనితీరును పరీక్షించేందుకు సంస్థ అంతర్గత అధ్యయనం నిర్వహించింది. ఇందులో 43 మంది పాల్గొన్నారు. విశ్రాంతి స్థాయి నుంచి హార్ట్‌ రేట్‌ జోన్లు 1 నుంచి 5 వరకు ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేయించారు. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12, ఫిట్‌బిట్‌ ఎయిర్‌, హూప్‌ ఎంజీ, గార్మిన్ ఫోర్‌ర‌న్నర్‌ 970, ఔరా రింగ్‌ 5 పరికరాలతో టెంపుల్‌ను పోల్చారు. పోలార్‌ హెచ్‌10 ఈసీజీ ఛాతీ స్ట్రాప్‌ను ప్రధాన ప్రమాణంగా ఉపయోగించారు.

యాపిల్ వాచ్ క‌న్నా క‌చ్చిత‌త్వంతో..

ఈ అధ్యయనం ప్రకారం టెంపుల్‌ సగటు సంపూర్ణ లోపం (ఎంఏఈ) 1.18 బీపీఎంగా నమోదైంది. యాపిల్‌ వాచ్‌లో ఇది 1.94 బీపీఎంగా, ఔరా రింగ్‌లో 5.21 బీపీఎం వరకు నమోదైంది. అధిక తీవ్రత కలిగిన వ్యాయామ సమయంలోనూ టెంపుల్‌ మెరుగైన క‌చ్చితత్వాన్ని చూపించిందని కంపెనీ వెల్లడించింది. అయితే ఇవి సంస్థ స్వయంగా నిర్వహించిన అంతర్గత పరీక్షల ఫలితాలే కావడం గమనార్హం.

ధ‌ర ఎంత‌..

రూ.85వేల ధరలో పరికరంతోపాటు అనేక సదుపాయాలను అందిస్తున్నారు. ఆరు రంగుల్లో టెంపుల్‌ వేరబుల్‌ అందుబాటులో ఉంటుంది. ట్రూ గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌, డార్క్‌ మిర్రర్‌, డీప్‌ బ్లూ, రియల్‌ జేడ్‌, పర్పుల్‌ ఫంక్‌ రంగులను ఎంచుకోవచ్చు. 25 రోజుల వరకు అదనపు ఛార్జింగ్‌ నిల్వను అందించే పోర్టబుల్‌ ఛార్జింగ్‌ పాడ్‌, పరికరాన్ని తలకు అమర్చేందుకు అవసరమైన మెడికల్‌ గ్రేడ్‌ అడ్హెసివ్‌ గ్రిప్స్‌ను కూడా అందిస్తున్నారు. టెంపుల్‌ యాప్‌లోని అన్ని ఫీచర్లు, ఆరోగ్య గణాంకాలను జీవితకాలం ఉచితంగా ఉపయోగించుకునే సదుపాయం కల్పిస్తున్నారు. అదనంగా వ్యక్తిగత ఆన్‌బోర్డింగ్‌ సెషన్‌, జీవితకాల హార్డ్‌వేర్‌ రీప్లేస్‌మెంట్‌ సదుపాయం కూడా ప్యాకేజీలో ఉన్నాయి. అయితే రీప్లేస్‌మెంట్‌కు నామమాత్రపు సర్వీస్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు, ఈ పరికరంపై మరిన్ని స్వతంత్ర పరిశోధనలు జరుగుతున్నాయని దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. కొనుగోలు విషయంలో సందేహాలు ఉన్నవారు స్వతంత్ర పరీక్షల ఫలితాల కోసం వేచి చూడాలని సూచించారు. ప్రస్తుతం భారత్‌లో అమల్లో ఉన్న 14 రోజుల నో-క్వశ్చన్స్‌-ఆస్క్డ్‌ రిటర్న్‌ పాలసీని భవిష్యత్తులో మార్చే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత 2027 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరికరం బ్యాటరీ సామర్థ్యం, బ్యాటరీ లైఫ్‌, కొలతలు, బరువు వంటి పూర్తి సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ట్యాగ్స్:

Athletic WearableDeepinder GoyalHealth WearableTemple WearableZomato Founder
Advertisement
Advertisement