త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?

పిల్లల సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను రక్షించేలా మార్గదర్శకాలు తేవాలని కేంద్రాన్ని కోరింది.

J

Technology | Published On Sep 10, 2026, 7.36 pm IST

Supreme Court on Minor Social Media | పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియా వాడకం కరెక్టేనా? సుప్రీంకోర్టు ఏమంటోంది?
Advertisement
  • మైనర్ల సోషల్ మీడియా వాడకంపై నియంత్రణలు విధించాలని దాఖలైన పిల్ (PIL) పై విచారించిన సుప్రీంకోర్టు
  • కేంద్ర ఐటీ, న్యాయ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం
  • 18 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు ఇవ్వాలంటే ఈ-కేవైసీ ద్వారా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని పిటిషనర్ల డిమాండ్
  • సైబర్ బుల్లీయింగ్, వ్యసనం నుంచి చిన్నారులను రక్షించేందుకు డిజిటల్ ఫైర్‌వాల్స్ లాంటి భద్రతా చర్యలు అవసరమన్న కోర్టు

Supreme Court on Minor Social Media | త్రినేత్ర.న్యూస్ : పిల్లలు సోషల్ మీడియా (Social Media) వాడటం మంచిదేనా? ఆన్‌లైన్ ప్రపంచంలో వారి భద్రతకు గ్యారెంటీ ఉందా? ఈ ప్రశ్నల చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా, 18 ఏళ్ల లోపు పిల్లలను ఆన్‌లైన్ వేధింపులు, డిజిటల్ వ్యసనం నుంచి రక్షించేందుకు కఠినమైన మార్గదర్శకాలు తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందేనా?

'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్' అనే ఎన్జీవో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై సుప్రీం ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లు నిండని మైనర్లు ఎలాంటి చట్టపరమైన ఒప్పందాలు చేసుకోలేరు. మరి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ (Digital Platforms) నిబంధనలకు వారు స్వయంగా ఎలా అంగీకరిస్తారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కా ప్రశ్నించారు. పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి (Parental Consent) లేదా ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి చేసేలా ఐటీ చట్టాల్లో మార్పులు తేవాలని కోరారు.

ఫైర్‌వాల్స్ ఉంటేనే

పిల్లలను పూర్తిగా ఆన్‌లైన్ ప్రపంచానికి దూరం చేయాలని ఎవరూ కోరుకోవడం లేదని, అయితే వారిని రక్షించేందుకు పటిష్టమైన ఫైర్‌వాల్స్ (Firewalls) ఉండాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. వయసు నిర్ధారణ లేకుండా ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, యూట్యూబ్ లాంటి వేదికల్లోకి అడుగుపెట్టడం వల్ల పిల్లలు ఆన్‌లైన్ గ్రూమింగ్, సైబర్ బుల్లీయింగ్ (Cyberbullying), సెక్స్‌టార్షన్ వంటి తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆ దేశాల్లో సోషల్ మీడియా బ్యాన్

ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోగా.. ఇండోనేషియా, బ్రెజిల్, యూకే వంటి దేశాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నాయి. మన దేశంలోనూ కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు 16 ఏళ్ల లోపు పిల్లల వాడకంపై నిషేధం లేదా 'గ్రేడెడ్' విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.

రెండు అంచుల కత్తి

సోషల్ మీడియా అనేది రెండు అంచుల కత్తి లాంటిది. యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పిల్లలు కొత్త స్కిల్స్, సృజనాత్మకత నేర్చుకోవచ్చు. కానీ, అదే సమయంలో డిజిటల్ వ్యసనం (Digital Addiction) బారిన పడి నిద్రలేమి, మానసిక ఒత్తిడి (Depression), ఏకాగ్రత లోపంతో బాధపడుతున్నారు. దీనికి ఏకైక పరిష్కారం కచ్చితమైన నియంత్రణే. పిల్లలు ఏం చూస్తున్నారో పేరెంటల్ కంట్రోల్ (Parental Control) ద్వారా గమనించడం, స్క్రీన్ టైమ్ లిమిట్ సెట్ చేయడం, ఇంటర్నెట్ భద్రతపై వారికి అవగాహన కల్పించడం ద్వారానే చిన్నారులను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి కాపాడుకోగలం.

Advertisement
Advertisement