త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Starlink | ఎలాన్ మ‌స్క్ కు సిరులు కురిపిస్తున్న స్టార్ లింక్‌.. మొద‌టి ట్రిలియ‌నీర్ అవుతారా..?

Starlink | ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే భారత్‌లోనూ స్టార్‌లింక్ సేవ‌లు ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లో భాగ‌స్వామ్య సంస్థ‌గా ఉన్న స్టార్‌లింక్ ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందిస్తోంది.

S

Technology | Published On Dec 27, 2025, 3.12 pm IST

Starlink | ఎలాన్ మ‌స్క్ కు సిరులు కురిపిస్తున్న స్టార్ లింక్‌.. మొద‌టి ట్రిలియ‌నీర్ అవుతారా..?
Advertisement

Starlink | ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే భారత్‌లోనూ స్టార్‌లింక్ సేవ‌లు ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లో భాగ‌స్వామ్య సంస్థ‌గా ఉన్న స్టార్‌లింక్ ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందిస్తోంది. మొత్తం 155 దేశాల‌కు చెందిన వినియోగ‌దారులు స్టార్‌లింక్ సేవ‌ల‌ను వాడుతున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఉన్న స్టార్ లింక్ వినియోగ‌దారుల సంఖ్య ఈ నెల‌తో 90 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. గ‌త న‌వంబర్ నెలాఖ‌రుకు ఈ సంఖ్య 80 ల‌క్ష‌లు ఉండ‌గా, నెల రోజుల్లోనే 10 ల‌క్ష‌ల కొత్త క‌స్ట‌మ‌ర్లు స్టార్‌లింక్‌లో చేర‌డం విశేషం. ఇక గ‌డిచిన ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు స్టార్ లింక్‌లో 70 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందించ‌డంలో స్టార్‌లింక్ సంస్థ దూసుకుపోతోంది.

2026లో భార‌త్‌లో సేవ‌లు..

కాగా గ‌త 47 రోజుల వ్య‌వధిలో స్టార్‌లింక్‌లో కొత్త‌గా చేరుతున్న కస్ట‌మ‌ర్ల సంఖ్య రోజుకు స‌రాస‌రిగా 21,275 ఉండ‌గా, అంత‌కు ముందు ఇది రోజుకు 14,250గా ఉంది. ఈ క్ర‌మంలోనే కొత్త క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డంలో స్టార్‌లింక్ త‌న రికార్డుల‌ను తానే బ్రేక్ చేస్తుండడం విశేషం. ఇక 2026లో భార‌త్‌లో స్టార్‌లింక్ సేవ‌ల‌ను ప్రారంభించాల‌ని స్పేస్ ఎక్స్ ప్ర‌ణాళిక‌లు రచిస్తుండ‌గా 2030 వ‌ర‌కు భార‌త్‌లో క‌నీసం 15 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారుల‌కు సేవ‌ల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. కాగా స్టార్‌లింక్ అందించే ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పొందాలంటే వినియోగదారులు వ‌న్ టైమ్ కాస్ట్ కింద ప్ర‌త్యేకంగా హార్డ్ వేర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌న్న విష‌యం విదితమే. భార‌త్‌లో ఈ హార్డ్ వేర్‌తోపాటు నెల‌వారి చార్జిల వివ‌రాలను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో మాత్రం స‌రాస‌రిగా హార్డ్ వేర్‌కు దాదాపుగా రూ.30వేలు, నెల‌కు రూ.4వేల వ‌ర‌కు చార్జిల‌ను వ‌సూలు చేస్తోంది.

ఏయే దేశాల్లో చార్జిలు ఎంతంటే..?

అమెరికా, కెన‌డాల‌లో స్టార్ లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పొందేందుకు ఎలాంటి హార్డ్ వేర్ రుసుమును చెల్లించాల్సిన ప‌నిలేదు. కానీ నెల‌వారి చార్జిలు మాత్రం అధికంగా ఉన్నాయి. అమెరికాలో స్టార్ లింక్‌కు అత్య‌ధికంగా మొత్తం 20 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉండ‌గా, అక్క‌డ వారు నెల‌కు దాదాపుగా రూ.11వేల వ‌ర‌కు చార్జిల‌ను చెల్లిస్తున్నారు. అలాగే కెనడాలో 5.53 ల‌క్ష‌ల మంది స్టార్ లింక్ వినియోగ‌దారులు ఉండ‌గా అక్క‌డ వారు ఇంట‌ర్నెట్‌కు స్టార్ లింక్‌కు నెల‌కు రూ.9వేల వ‌ర‌కు చెల్లిస్తున్నారు. స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య‌లో కెనడా 2వ స్థానంలో ఉంది. ఇక మెక్సికోలో ఈ సంస్థ‌కు 4.35 ల‌క్ష‌ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఆ విష‌యంలో ఈ దేశం మూడో స్థానంలో ఉంది. ఇక వీరు హార్డ్‌వేర్‌కు దాదాపుగా రూ.32వేలు చెల్లిస్తుండ‌గా, నెల‌కు చార్జి రూ.6వేల‌ను చెల్లిస్తున్నారు. అలాగే స్టార్ లింక్‌ స‌బ్‌స్క్రైబ‌ర్ల విష‌యంలో నాలుగో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో మొత్తం ఆ సంస్థ‌కు 3.33 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉన్నారు. ఈ దేశ‌వాసులు స్టార్ లింక్ హార్డ్ వేర్ కు రూ.27వేలు చెల్లిస్తుండ‌గా, నెల‌కు చార్జిలు రూ.4వేల వ‌ర‌కు చెల్లిస్తున్నారు. అలాగే ఇండోనేషియాలో స్టార్‌లింక్‌కు మొత్తం 3.04 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉండ‌గా, ఈ దేశంలో హార్డ్ వేర్‌కు రూ.27వేలు, నెల‌కు చార్జి రూ.3600 వ‌ర‌కు చెల్లిస్తున్నారు.

10వేల‌కు పైగా శాటిలైట్స్‌..

కాగా స్టార్‌లింక్ మాతృసంస్థ స్పేస్ ఎక్స్‌కు ప్ర‌స్తుతం 10వేల‌కు పైగా శాటిలైట్స్ ఉండ‌డం విశేషం. స్పేస్ ఎక్స్ ఈ ఘ‌న‌త‌ను ఈ ఏడాదిలోనే సాధించింది. ఈ క్ర‌మంలోనే 2030 వ‌ర‌కు మొత్తం శాటిలైట్స్ సంఖ్య‌ను 30వేలకు పెంచ‌నున్నారు. దీని వ‌ల్ల మ‌రింత మంది వినియోగ‌దారుల‌కు సేవ‌ల‌ను అందించేందుకు అవ‌కాశం ల‌భిస్తుంది. అలాగే స్పేస్ ఎక్స్ విలువ ఐపీవో ప‌రంగా చూస్తే 800 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌డం విశేషం. మ‌రో 30 బిలియ‌న్ డాల‌ర్లను స‌మీక‌రించ‌డం ద్వారా స్పేస్ ఎక్స్ ఏకంగా 1.5 ట్రిలియ‌న్ డాల‌ర్ల కంపెనీగా మారాల‌ని చూస్తోంది. ఇక స్పేస్ ఎక్స్ వ‌స్తున్న ఆదాయంలో అగ్ర‌భాగం స్టార్ లింక్ నుంచే కావ‌డం విశేషం. 2025లో స్టార్ లింక్ ద్వారా స్పేస్ ఎక్స్‌కు 15 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం వ‌చ్చింది. 2026 లో ఇది 20 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మొద‌టి ట్రిలియ‌నీర్‌గా..?

ఇక ఎలాన్ మ‌స్క్ ఆస్తి విలువ ప్ర‌స్తుతం 600 బిలియ‌న్ డాల‌ర్లు ఉండ‌గా ఆయ‌న‌కు స్పేస్ ఎక్స్‌లో 42 శాతం వాటా ఉంది. అలాగే కార్ల కంపెనీ టెస్లాలో మ‌స్క్ 15.3 శాతం వాటాను క‌లిగి ఉన్నారు. దీంతోపాటు ఎక్స్ (ట్విట్ట‌ర్‌, ఎక్స్ఏఐ, ది బోరింగ్ కంపెనీ. వంటి ప‌లు కంపెనీల్లోనూ మ‌స్క్ వాటాల‌ను క‌లిగి ఉన్నారు. కాగా స్పేస్ ఎక్స్‌కు సంబంధించి అనుకున్న మొత్తంలో ఐపీవో ద్వారా నిధుల‌ను స‌మీక‌రిస్తే మ‌స్క్ ఆస్తి విలువ 625 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని అంచనా వేస్తున్నారు. అదే జ‌రిగితే ప్ర‌పంచంలోనే మస్క్ మొట్ట మొద‌టి ట్రిలియ‌నీర్‌గా అవ‌త‌రించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement