త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?

Microsoft Surface | టెక్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ త‌న నూత‌న స‌ర్ఫేస్ ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసింది. 12, 13 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ఈ మోడ‌ల్స్ లాంచ్ అయ్యాయి. వీటిల్లో స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌ల‌ను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ ఎక్స్‌2 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌తో ఇవి ప‌నిచేస్తాయి.

S

Technology | Published On Sep 24, 2026, 2.00 pm IST

Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?
Advertisement

Microsoft Surface | టెక్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ త‌న నూత‌న స‌ర్ఫేస్ ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసింది. 12, 13 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ఈ మోడ‌ల్స్ లాంచ్ అయ్యాయి. వీటిల్లో స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌ల‌ను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ ఎక్స్‌2 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌తో ఇవి ప‌నిచేస్తాయి. ఈ రెండు కంప్యూటర్లతోపాటు ఇంటిగ్రేటెడ్ హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో పనిచేసే కొత్త సర్ఫేస్ మౌస్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 సిలికాన్ అభివృద్ధి సమయంలో క్వాల్‌కామ్ టెక్నాలజీస్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఇంజినీర్లు పనిచేశారని కంపెనీ తెలిపింది. పలుచగా, తేలికగా ఉండే కంప్యూటర్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేసినట్లు పేర్కొంది. ఎక్కువసేపు స్థిరమైన పనితీరు, సమర్థవంతమైన విద్యుత్ వినియోగం, తక్కువ శబ్దంతో పనిచేసే థర్మల్స్, పరికరంలోనే వేగంగా జరిగే కృత్రిమ మేధ పనితీరుపై ప్రధానంగా దృష్టి సారించిన‌ట్లు తెలిపింది.

డివైస్‌లోనే ఏఐ ప‌నుల ప్రాసెసింగ్‌..

కొత్త కంప్యూటర్లు విండోస్‌పై పనిచేస్తాయి. కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365 లకు మద్దతు ఇస్తాయి. వీటిలోని కొన్ని కృత్రిమ మేధ ఫీచర్లు పరికరంలోనే, క్లౌడ్‌లో లేదా రెండింటి కలయికతో పనిచేస్తాయి. దీనివల్ల ఆలస్యం తగ్గడం, క్లౌడ్‌కు చేసే కాల్స్, టోకెన్లపై ఆధారపడడం తగ్గడం, డేటాను పరికరంలోనే ఉంచుకోవడం వంటి ప్రయోజనాలు ఉంటాయని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. గత తరం మోడళ్లతో పోలిస్తే కొత్త కంప్యూటర్లలో ఆఫీస్ ఉత్పాదకత పనితీరు 17 శాతం వరకు వేగంగా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 18 శాతం వరకు మెరుగుపడుతుంది. గ్రాఫిక్స్ పనితీరు 60 శాతానికి పైగా వేగంగా ఉంటుంది. ఎన్‌పీయూలో స్థానిక కృత్రిమ మేధ ఇన్‌ఫరెన్సింగ్ పనితీరు 95 శాతం వరకు వేగంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

2 ఇన్ 1 వాడుకోవ‌చ్చు..

సర్ఫేస్ ప్రొ 12 ఇంచుల 2వ ఎడిషన్ పలుచగా, తేలికగా ఉండే ఫ్యాన్‌లెస్ విండోస్ కంప్యూటర్. దీన్ని టాబ్లెట్‌గా లేదా ల్యాప్‌టాప్‌గా ఉపయోగించుకోవచ్చు. కీబోర్డ్‌తో టైప్ చేయ‌డం, కోడింగ్ చేయడం, ఈమెయిల్‌లకు స్పందించడం వంటి పనులు చేయవచ్చు. మాగ్నెటిక్‌గా నిల్వ చేసుకునే సర్ఫేస్ స్లిమ్ పెన్‌తో రాయడం, స్కెచ్‌లు వేయడం, డిజైన్లపై కామెంట్లు చేయడం సాధ్యమవుతుంది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్ ప్రాసెసర్‌తో నోట్స్‌ను సంక్షిప్తీకరించడం, ఫొటోలను ఎడిట్ చేయడం, డిజైన్లపై కామెంట్లు చేయడం వంటి పనుల్లో ఇది మరింత వేగంగా స్పందిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. గత తరం మోడల్‌తో పోలిస్తే యాక్టివ్ వెబ్ బ్రౌజింగ్ సమయంలో మరో గంట బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని పేర్కొంది. ఇక సర్ఫేస్ ల్యాప్‌టాప్ 13 ఇంచుల 2వ ఎడిషన్ కూడా పలుచగా, తేలికగా ఉండే ఫ్యాన్‌లెస్ విండోస్ కంప్యూటర్. ఇందులో పూర్తి పరిమాణ బ్యాక్‌లిట్ కీబోర్డ్, ప్రెసిషన్ టచ్‌ప్యాడ్, అల్యూమినియం బాడీ, పొడవైన 3:2 యాస్పెక్ట్ రేషియోతో పిక్స‌ల్‌సెన్స్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి.

ధ‌ర ఎంతంటే..

సర్ఫేస్ ప్రొ 12 ఇంచులు, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 13 ఇంచుల మోడళ్లు అక్టోబర్ 13 నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. రెండు మోడళ్లను ప్లాటినమ్, వ‌యొలెట్, బ్లాక్ రంగుల్లో విక్రయించనున్నారు. సర్ఫేస్ ప్రొ 12 ఇంచుల 2వ ఎడిషన్ ప్రారంభ ధర 1,149.99 అమెరికన్ డాలర్లు కాగా భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1,10,260గా ఉంటుంది. సర్ఫేస్ ల్యాప్‌టాప్ 13 ఇంచుల 2వ ఎడిషన్ ప్రారంభ ధర 1,199 అమెరికన్ డాలర్లు కాగా, సుమారు రూ.1,14,960గా ఉంటుంది. కొత్త సర్ఫేస్ మౌస్ ధర 79.99 అమెరికన్ డాలర్లు, భారత కరెన్సీలో సుమారు రూ.7,670గా ఉంటుంది. సర్ఫేస్ మౌస్ బ్లాక్, ప్లాటినమ్ రంగుల్లో లభిస్తుంది. వ్యాపార వినియోగదారుల కోసం సర్ఫేస్ ప్రొ 12కు ఐచ్ఛిక 5జి కాన్ఫిగరేషన్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement