త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Pixel Watch 5 | ఏఐ మోడ‌ల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్స‌ల్ వాచ్ 5.. ఫీచ‌ర్లు ఇవే..

Google Pixel Watch 5 | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న నూత‌న స్మార్ట్ వాచ్ పిక్స‌ల్ వాచ్ 5ని విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 41 ఎంఎం, 45 ఎంఎం పరిమాణాల్లో లభిస్తోంది. ఇందులో వేర్ ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. పిక్స‌ల్ వాచ్ 5లో 3000 నిట్స్ బ్రైట్‌నెస్ క‌లిగిన డోమ్డ్ యాక్టువా 360 డిస్‌ప్లేను అందించారు.

S

Technology | Published On Aug 13, 2026, 5.54 pm IST

Google Pixel Watch 5 | ఏఐ మోడ‌ల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్స‌ల్ వాచ్ 5.. ఫీచ‌ర్లు ఇవే..
Advertisement

Google Pixel Watch 5 | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న నూత‌న స్మార్ట్ వాచ్ పిక్స‌ల్ వాచ్ 5ని విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 41 ఎంఎం, 45 ఎంఎం పరిమాణాల్లో లభిస్తోంది. ఇందులో వేర్ ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. పిక్స‌ల్ వాచ్ 5లో 3000 నిట్స్ బ్రైట్‌నెస్ క‌లిగిన డోమ్డ్ యాక్టువా 360 డిస్‌ప్లేను అందించారు. దీనికి కస్టమ్ 3డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ ఉంది. అమోలెడ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేగా అందించారు. ఇది 1 నుంచి 60 హెడ్జ్ వరకు రెస్పాన్సివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేలో కనీస బ్రైట్‌నెస్ 1 నిట్‌గా ఉంటుంది. ఇందులో 11 కొత్త గ్లాన్స్ చేయగలిగే కాంప్లికేషన్ స్టైల్స్, రెండు కొత్త వాచ్ ఫేస్‌లు, జనరేటివ్ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. వాచ్ హౌసింగ్‌ను 100 శాతం రీసైకిల్ చేసిన అల్యూమినియంతో తయారు చేశారు. ఇందులో రెండో తరం హెచ్‌ఎన్‌బీఆర్ యాక్టివ్ బ్యాండ్‌ను సాఫ్ట్-టచ్ కోటింగ్‌తో అందించారు. ఫాగ్, ఆలివ్, క్యాన్యన్ రంగుల్లో ఇది లభిస్తోంది. క్యాన్యన్ రంగు మాత్రం 41 ఎంఎం మోడల్‌కు ప్రత్యేకం. 45 ఎంఎం మోడల్‌లో స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది. దీనికి చెమటను గ్రహించే పెర్ఫార్మెన్స్ లూప్ బ్యాండ్‌ను అందించారు.

జెమిని, ప్రొ-యాక్టివ్ అసిస్టెన్స్..

వాచ్ ఫేస్‌పై సందర్భానికి అనుగుణంగా సమాచారాన్ని చూపించే ఎట్ ఎ గ్లాన్స్ ఫీచర్‌ను గూగుల్ అందించింది. ఉదాహరణకు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు లైవ్ బోర్డింగ్ పాస్‌లను, ప్రయాణ సమయంలో ఇంకా ఎన్ని స్టాప్‌లు మిగిలి ఉన్నాయో ఇది చూపిస్తుంది. రైజ్ టు టాక్ ఫీచర్ ద్వారా మణికట్టును పైకి ఎత్తడం ద్వారా జెమినిని యాక్సెస్ చేయవచ్చు. దీని సహాయంతో వర్కౌట్ ప్రారంభించడం, టైమర్ సెట్ చేయడం, జీమెయిల్‌లోని డిన్నర్ రిజర్వేషన్లను చెక్ చేయ‌డం వంటి పనులు చేయవచ్చు. ప్రధాన చర్యలను డివైస్‌లోనే ప్రాసెస్ చేయడం వల్ల తక్కువ లేటెన్సీతో పనిచేస్తాయి. ఇవి ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తాయి. జెమిని ఇంటెలిజెన్స్ ప్రోయాక్టివ్ సజెషన్స్ ఫీచర్ కుటుంబంతో కలిసి డిన్నర్‌కు సంబంధించిన క్యాలెండర్ ఎంట్రీ వంటి అవసరమైన సమాచారాన్ని గుర్తించి వాచ్‌పై చూపిస్తుంది. వినియోగదారులు డబుల్-పించ్ జెస్చర్‌తో సజెషన్‌ను ఎంచుకుని, నిర్ధారించి, పంపించవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 జెన్ 2 యాక్సిలరేటెడ్ ప్రాసెసర్‌తోపాటు కార్టెక్స్-ఎం55 కో-ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గత తరంతో పోలిస్తే ర్యామ్ 50 శాతం పెరిగింది. సీపీయూ పనితీరు 12 శాతం పెరిగింది. గత తరంతో పోలిస్తే ఇది 20 శాతం వేగంగా పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది.

హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు..

పిక్స‌ల్ వాచ్ 5లో డ్య‌యల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌తోపాటు జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బీడౌ, క్యూజెడ్‌ఎస్‌ఎస్ వ్యవస్థలకు సపోర్ట్ ఉంది. క్లిష్టమైన ప్రాంతాల్లో గత తరాలతో పోలిస్తే రూట్ ట్రాకింగ్ క‌చ్చితత్వం రెండు రెట్లు మెరుగుపడుతుందని గూగుల్ చెబుతోంది. ఉపగ్రహ సిగ్నల్ ప్రయాణ మార్గాలను గుర్తించేందుకు 3డి బిల్డింగ్ మోడళ్లను, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునేందుకు వాతావరణ రిఫరెన్స్ స్టేషన్లను ఇది ఉపయోగిస్తుంది. ఫిట్‌నెస్, నిద్రకు సంబంధించిన ఫీచర్లలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఉంది. ఇందులో దశలవారీ మార్గదర్శకత్వం, సెట్లు, విశ్రాంతి సమయాలు, బరువు, రిపిటేషన్ల నమోదు వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ హెల్త్ కోచ్ ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా స్ట్రెంగ్త్ వర్కౌట్లను పొందవచ్చు. గూగుల్ హెల్త్ యాప్ ద్వారా కస్టమ్ స్ట్రెంగ్త్ రొటీన్‌లను కూడా రూపొందించుకోవచ్చు.

రికవరీ సజెషన్స్..

నిద్ర, హార్ట్ రేట్ వేరియబిలిటీ ఆధారంగా రికవరీ సజెషన్స్ అందిస్తారు. స్లీప్ స్టేజ్ డిటెక్షన్ క‌చ్చితత్వం 15 శాతం మెరుగుపడింది. బెడ్‌టైమ్ ఆటోమేషన్స్ ద్వారా ఆడియోబుక్‌లను పాజ్ చేయవచ్చు. ప్రత్యేకమైన బెడ్‌టైమ్ వాచ్ ఫేస్ కూడా ఉంది. అలారం మోగడానికి ముందు 30 నిమిషాల్లో హార్ట్ రేట్, కదలికలను పరిశీలించి సరైన సమయంలో మేల్కొలిపే స్మార్ట్ వేక్ ఫీచర్ ను కూడా అందించారు. పిక్స‌ల్ వాచ్ 5లో బ్రీతింగ్ ఎమర్జెన్సీ డిటెక్షన్ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టారు. పీపీజీ, యాక్సిలరోమీటర్, బారోమీటర్ సెన్సర్లతోపాటు డివైస్‌లోనే పనిచేసే కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఆక్సిజన్ సాచురేషన్‌లో తీవ్రంగా, నిరంతరంగా పడిపోవడాన్ని ఇది గుర్తిస్తుంది. డ్రగ్ టాక్సిసిటీ ప్రమాదాలు, తీవ్రమైన న్యూమోనియా లేదా ఊపిరాడకపోవడం వంటి పరిస్థితుల వల్ల ఇలాంటి మార్పులు సంభవిస్తాయి. ఎమర్జెన్సీ పరిస్థితి గుర్తించినప్పుడు వాచ్ ధరించిన వ్యక్తి స్పందించకపోతే, వాచ్ ఆటోమేటిక్‌గా అత్యవసర సేవలకు కాల్ చేసి క‌చ్చితమైన లొకేషన్‌ను పంపిస్తుంది. ఈ ఫీచర్ తొలుత యూరప్‌లో అందుబాటులోకి రానుంది.

ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ నోటిఫికేషన్స్..

హెల్త్ గార్డియన్ ఫీచర్లలో లాస్ ఆఫ్ పల్స్ డిటెక్షన్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ నోటిఫికేషన్స్, హై అండ్ లో హార్ట్ రేట్ అలర్ట్స్, ఈసీజీ, బ్లడ్ ప్రెజర్ ట్రెండ్ సమ్మరీస్, స్లీప్ బ్రీతింగ్ క్వాలిటీ ట్రెండ్ సమ్మరీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రెండ్ సమ్మరీస్ ఉన్నాయి. కొత్తగా అందిస్తున్న మూడు నెలవారీ ట్రెండ్ సమ్మరీలను బిలియన్ల నిమిషాల సెన్సర్ డేటాతో శిక్షణ పొందిన హెల్త్ ఫౌండేషన్ మోడల్స్ ఆధారంగా రూపొందించారు. వినియోగదారుల అనుమతితో సేకరించిన డేటాను ఉపయోగించి వీటికి శిక్షణ ఇచ్చారు. క్లినికల్ కొలతలతో కూడా వీటిని ధ్రువీకరించారు. వాచ్‌ను ఒక నెల పాటు ఉపయోగించిన తర్వాత మొదటి వివరణాత్మక సమ్మరీ అందుతుంది. ఇందులో మెటబాలిక్, రెస్పిరేటరీ, కార్డియోవాస్క్యులర్ మార్పులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. నెలవారీ సమ్మరీలు గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ సహా గూగుల్ వియ‌ర‌బుల్‌ పరికరాల మొత్తం పోర్ట్‌ఫోలియోలో కూడా అందుబాటులోకి రానున్నాయి.

బ్యాటరీ, ఇతర ఫీచర్లు

41 ఎంఎం మోడల్‌లో 332 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఆన్‌లో ఉన్నప్పుడు 30 గంటల వరకు, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 48 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. 45 ఎంఎం మోడల్‌లో 465 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేతో 40 గంటల వరకు, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 72 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. రెండు మోడళ్లలోనూ సుమారు 15 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 41 ఎంఎం మోడల్ 80 శాతం ఛార్జ్ కావడానికి 25 నిమిషాలు, పూర్తిగా 100 శాతం ఛార్జ్ కావడానికి 45 నిమిషాలు పడుతుంది. 45 ఎంఎం మోడల్ 80 శాతం ఛార్జ్ కావడానికి 30 నిమిషాలు, పూర్తిగా ఛార్జ్ కావడానికి 60 నిమిషాలు పడుతుంది. బ్లూటూత్ 6.0, 2.4 గిగాహెడ్జ్‌, 5 గిగాహెడ్జ్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, అల్ట్రా-వైడ్‌బ్యాండ్, 64 జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ వాచ్ 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్, ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్, టచ్‌లెస్ వన్-హ్యాండ్ జెస్చర్స్, సైడ్ బటన్, హాప్టిక్ క్రౌన్, జెన్ 3 ప్రీమియం హాప్టిక్స్ ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ఆండ్రాయిడ్ 12.0 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌తో పనిచేసే చాలా ఫోన్లకు పిక్స‌ల్ వాచ్ 5 అనుకూలంగా ఉంటుంది. దీనిని ఉపయోగించేందుకు గూగుల్ అకౌంట్, గూగుల్ పిక్స‌ల్ వాచ్ యాప్ అవసరం. ఈ వాచ్ తయారీలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్, కోబాల్ట్, అల్యూమినియం, స్టీల్, గ్లాస్, టిన్, టంగ్‌స్టన్, బంగారం, రాగి, అరుదైన భూ మూలకాలను ఉపయోగించినట్లు గూగుల్ తెలిపింది. ప్యాకేజింగ్‌లో 100 శాతం ప్లాస్టిక్ రహిత పదార్థాలను ఉపయోగించారు. గూగుల్ పిక్స‌ల్ వాచ్ 5కు భారత్‌లో గురువారం నుంచే ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20 నుంచి స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి. పిక్స‌ల్ వాచ్ 5కి చెందిన 41 ఎంఎం మోడల్ ధర రూ.42,990గా ఉంది. పిక్స‌ల్ వాచ్ 5 కి చెందిన 45 ఎంఎం మోడల్ ధర రూ.45,990గా ఉంది.

Advertisement
Advertisement