త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court Electrocution Ruling | విద్యుత్ మరణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. బాధ్యత ఎవరిది?

విద్యుత్ షాక్‌తో జరిగే మరణాలు లేదా ప్రమాదాలకు ఎలక్ట్రిసిటీ బోర్డులదే పూర్తి బాధ్యతా? పరిహారం ఎలా చెల్లించాలి? ఈ అంశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

J

National | Published On Aug 13, 2026, 5.35 pm IST

Supreme Court Electrocution Ruling | విద్యుత్ మరణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. బాధ్యత ఎవరిది?

సంక్షిప్త సారాంశం

విద్యుత్ షాక్ మరణాలపై ఎలక్ట్రిసిటీ బోర్డులకు 'కఠినమైన బాధ్యత' (Strict Liability) ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపుల్లేని 'సంపూర్ణ బాధ్యత' (Absolute Liability) బోర్డులపై మోపలేమని పేర్కొంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ, పరిహారం లెక్కింపు కోసం మోటార్ వాహనాల చట్టంలోని విధానాన్ని విద్యుత్ కేసులకు వాడకూడదని సూచించింది. వాస్తవాలపై వివాదాలు ఉన్నప్పుడు పరిహారం కోసం నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Advertisement
  • విద్యుత్ షాక్ మరణాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • ఎలక్ట్రిసిటీ బోర్డుల బాధ్యతపై క్లారిటీ

Supreme Court Electrocution Ruling | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలు, వాటి పరిహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. కరెంట్ షాక్ వల్ల జరిగే మరణాలు లేదా గాయాలకు విద్యుత్ బోర్డులదే 'కఠినమైన బాధ్యత' (Strict liability) అయినప్పటికీ, దాన్ని మినహాయింపులు లేని 'సంపూర్ణ బాధ్యత'గా (Absolute liability) పరిగణించలేమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

నేపథ్యం ఇదే..

కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (KPTC) దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. గతంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో.. ఒకరు 11 KV లైన్ తగిలి చనిపోగా, మరొకరు క్రికెట్ బాల్ కోసం వెళ్లి 66 KV లైన్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుల్లో విద్యుత్ బోర్డుదే పూర్తి బాధ్యత అంటూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సింగిల్, డివిజన్ బెంచ్ తీర్పులను సుప్రీంకోర్టు తాజాగా పక్కనబెట్టింది.

బోర్డుల బాధ్యత ఏంటి?

విద్యుత్ సరఫరా అనేది స్వతహాగా ప్రమాదకరమైన ప్రక్రియ కాబట్టి.. ఆయా సంస్థలే నష్టభారాన్ని భరించాలని కోర్టు పేర్కొంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బోర్డులకు ఉన్నప్పటికీ.. దానికి కొన్ని చట్టబద్ధమైన మినహాయింపులు (Exceptions) వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఓలియం గ్యాస్ లీక్ (Oleum Gas Leak) లాంటి భారీ ప్రమాదాల్లో వర్తించే 'అబ్సల్యూట్ లయబిలిటీ'(Absolute liability)ని ప్రతి కరెంట్ షాక్ కేసుకు ఆపాదించలేమని వివరించింది. అబ్సల్యూట్ లయబిలిటీ కింద ఎటువంటి మినహాయింపులకు ఆస్కారం ఉండదు.

పరిహారం లెక్కింపుపై కీలక వ్యాఖ్యలు

విద్యుత్ ప్రమాదాల్లో పరిహారం లెక్కించేందుకు మోటార్ వాహనాల చట్టం-1988 (Motor Vehicles Act)లోని 'మల్టిప్లయర్ పద్ధతి'ని వాడటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్-2003 సెక్షన్ 57 ప్రకారం కొన్ని సందర్భాల్లో పరిహారం చెల్లింపునకు సంబంధించి బాధ్యతలను మాత్రమే పేర్కొన్నారని, నిర్దిష్ట విధానం లేనప్పటికీ వాహన ప్రమాదాల చట్టాన్ని దీనికి వర్తింపజేయడం సరికాదని స్పష్టం చేసింది.

అలాగే, వాస్తవాలపై వివాదాలు (Disputed facts) ఉన్నప్పుడు నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ (Writ Petition) దాఖలు చేయడం చట్టబద్ధం కాదని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యామ్నాయ వేదికల ద్వారా పరిహారం కోసం అప్పీల్ చేసుకునేందుకు బాధితులకు కోర్టు అవకాశం కల్పించింది.

Advertisement
Advertisement