త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | సూప‌ర్‌-8కి వెస్టిండిస్‌.. నేపాల్ ఇంటికి..!

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ముంబ‌యి వాంఖ‌డే వేదిక‌గా ఆదివారం నేపాల్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో క‌రేబియ‌న్ జ‌ట్టు సూప‌ర్ 8కి అర్హ‌త సాధించ‌గా.. నేపాల్ ప్ర‌యాణం ముగిసిపోయింది.

P

Sports | Published On Feb 15, 2026, 5.00 pm IST

T20 World Cup | సూప‌ర్‌-8కి వెస్టిండిస్‌.. నేపాల్ ఇంటికి..!
Advertisement

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ముంబ‌యి వాంఖ‌డే వేదిక‌గా ఆదివారం నేపాల్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో క‌రేబియ‌న్ జ‌ట్టు సూప‌ర్ 8కి అర్హ‌త సాధించ‌గా.. నేపాల్ ప్ర‌యాణం ముగిసిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్‌కు ఏమాత్రం శుభారంభం ద‌క్క‌లేదు. తొలి ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ కుశాల్ అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత కెప్టెన్ రోహిత్ పౌడెల్ సైతం 5 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. ఏడో ఓవర్ ముగిసే సరికి నేపాల్ 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయితే, దీపేంద్ర సింగ్ ఐరీ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు.

లోయ‌ర్ మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ల‌తో క‌లిసి ప‌రుగులు రాబ‌ట్టాడు. మ‌రో వైపు మాథ్యూ ఫోర్డ్ వ‌రుస‌గా నాలుగు ఓవ‌ర్లు బౌలింగ్ చేసి బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశాడు. డెత్ ఓవ‌ర్ల‌లో ఐరీ, సోంపాల్ కామి వేగంగా ప‌రుగులు చేశారు. 18 ఓవ‌ర్‌లో హోల్డ‌ర్ బౌలింగ్‌లో కామి వ‌రుస‌గా మూడు ఫోర్లు కొట్టాడు. ఆ త‌ర్వాత ష‌మ‌ర్ జోసెఫ్ బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ రెండు సిక్స‌ర్లు కొట్టి హాఫ్ సెంచ‌రీ చేశాడు. చివ‌రి మూడు ఓవ‌ర్ల‌లో నేపాల్ 44 ప‌రుగులు చేసింది. హోల్డ‌ర్ అద్భుత యార్క‌ర్ల‌తో రెండు వికెట్లు తీయ‌డంతో నేపాల్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 133 ప‌రుగులు చేసింది. హోల‌ర్డ్‌కు నాలుగు వికెట్లు ద‌క్కాయి. 134 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన వెస్టిండిస్ 15.2 ఓవ‌ర్ల‌లోనే వికెట్ న‌ష్టానికి 134 ప‌రుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. బ్రాండ‌న్ కింగ్ (22), హోప్ (61), హిట్మెర్ (46) ప‌రుగులు చేశారు.

Advertisement
Advertisement