త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

USA Vs Australia | అమెరికాకు రెండో విజయం.. నాకౌట్‌కు అర్హత

USA Vs Australia | ఫిఫా ప్రపంచకప్-2026 గ్రూప్-డీ పోరులో అమెరికా జట్టు మరోసారి సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయం సాధించిన అమెరికా వరుసగా రెండో మ్యాచ్‌ను గెలిచి రౌండ్ ఆఫ్ 32లోకి దూసుకెళ్లింది. కామెరాన్ బర్గెస్ సెల్ఫ్ గోల్, అలెక్స్ ఫ్రీమన్ అద్భుత హెడ్డర్‌తో అమెరికా విజయం సాధించింది.

P

Sports | Published On Jun 20, 2026, 8.31 am IST

USA Vs Australia | అమెరికాకు రెండో విజయం.. నాకౌట్‌కు అర్హత
Advertisement

USA Vs Australia | ఫిఫా ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌-డీ పోరులో అమెరికా 2-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో అమెరికా నాకౌట్‌ దశకు ప్రవేశించింది. సియాటెల్ స్టేడియంలో జరిగిన టోర్నీ 32వ మ్యాచ్‌లో అమెరికా ఆరంభం నుంచే దూకుడుగా ఆడి తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్ చేసి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ 11వ నిమిషంలో అమెరికాకు అదృష్టం కలిసి వచ్చింది. ఫోలారిన్ బాలోగన్ ఇచ్చిన లో క్రాస్‌ను క్లియర్ చేసే ప్రయత్నంలో ఆస్ట్రేలియా డిఫెండర్ కామెరాన్ బర్గెస్ పొరపాటున బంతిని తన జట్టు గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఈ సెల్ఫ్ గోల్‌తో అమెరికా 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా.. ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగింది.

తొలి అర్ధభాగం ముగిసే సమయానికి అమెరికా మరో గోల్ సాధించింది. 43వ నిమిషంలో సెర్జినో డెస్ట్ చేసిన ప్రయత్నం అనంతరం బాక్స్ లోపల అలెక్స్ ఫ్రీమన్ అద్భుతమైన హెడ్డర్‌తో బంతిని గోల్‌లోకి పంపాడు. ఈ గోల్‌పై సమీక్షించి రిఫరీ గోల్‌ను నిర్ధారించారు. దీంతో హాఫ్‌టైమ్ సమయానికి అమెరికా 2-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో రెండు గోల్స్ వెనుకబడిన ఆస్ట్రేలియా పుంజుకునేందుకు ప్రయత్నించింది. పలుసార్లు ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించినా యూఎస్‌ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. మ్యాచ్‌ చివరి వరకు అమెరికా ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ఆసిస్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ విజయంతో గ్రూప్-డీలో అమెరికా వరుసగా రెండో మ్యాచ్‌ను గెలిచి రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో అమెరికా జట్టు వరుసగా రెండు విజయాలతో నాకౌట్‌కు అర్హత సాధించడం ఇది రెండోసారి మాత్రమే. మరో వైపు ఆస్ట్రేలియాకు ఈ ఓటమి నాకౌట్‌ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement
Advertisement