త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tim David | టిమ్‌ డేవిడ్‌కు షాక్‌.. 30శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించిన ఐపీఎల్‌..!

P

Sports | Published On May 12, 2026, 8.46 am IST

Tim David | టిమ్‌ డేవిడ్‌కు షాక్‌.. 30శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించిన ఐపీఎల్‌..!
Advertisement

Tim David | రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ టిమ్‌ డేవిడ్‌పై ఐపీఎల్‌ పరిపాలన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అనైతికంగా ఆ జట్టుకు డేవిడ్‌ మిడిల్‌ ఫింగర్‌ను చూపిస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. దాంతో మ్యాచ్‌ ఫీజులో 30శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్‌ పాయింట్లు అకౌంట్‌లో యాడ్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ రెండు వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. అయితే, మ్యాచ్ అనంతరం టిమ్ డేవిడ్ చేసిన సైగలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో వివాదం చెలరేగింది. ఆ వీడియోలో ఆయన ముంబయి ఇండియన్స్‌ జట్టు వైపు చూపిస్తూ అనుచితంగా వ్యవహరించాడనే ఆరోపణలు వచ్చాయి.

ఈ మేరకు ఐపీఎల్‌ పాలకవర్గం చర్యలు చేపట్టింది. ఐపీఎల్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.6ను టిమ్ డేవిడ్ ఉల్లంఘించినట్లు పేర్కొంది. టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ అమీర్ శర్మ విధించిన శిక్షను స్వీకరించినట్లు ఐపీఎల్‌ తెలిపింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో డేవిడ్‌ ప్రభావం చూపించలేకపోయాడు. తొలి బంతికే అవుటటై గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అయినా, మ్యాచ్‌ సమయంలో డగౌట్‌లో తోటి ప్లేయర్లను ఉత్సాహపరుస్తూ కనిపించాడు. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ విజయం సాధించగానే జట్టు శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది అభిమానులు దీన్ని విజయోత్సవ సమయంలో అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొనగా.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు మండిపడ్డారు.

Advertisement
Advertisement