త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

స్పెయిన్‌దే ప్రపంచకప్‌

FIFA 2026 | ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవాలన్న అర్జెంటీనా ఆశలను స్పెయిన్‌ చిత్తు చేసింది. మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న మెస్సీ కల చెదిరిపోయింది. ఆరంభం నుంచి చివరి వరకు ఆటపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్‌.. అదనపు సమయంలో ఫెర్రాన్‌ టొరెస్‌ చేసిన ఏకైక గోల్‌తో 1-0 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది.

P

Sports | Published On Jul 20, 2026, 7.51 am IST

స్పెయిన్‌దే ప్రపంచకప్‌
Advertisement
  • ఎక్స్‌ట్రా టైమ్‌లో గోల్‌ చేసిన టొరెస్‌
  • 1-0తో అర్జెంటీనాపై విజయం
  • మ్యాచ్‌లో చివరి వరకు స్పెయిన్‌దే ఆధిపత్యం
  • విజేతలకు ట్రోఫీ బహూకరించిన ట్రంప్‌

FIFA 2026 | ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవాలన్న అర్జెంటీనా ఆశలను స్పెయిన్‌ చిత్తు చేసింది. మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న మెస్సీ కల చెదిరిపోయింది. ఆరంభం నుంచి చివరి వరకు ఆటపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్‌.. అదనపు సమయంలో ఫెర్రాన్‌ టొరెస్‌ చేసిన ఏకైక గోల్‌తో 1-0 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మెస్సీని పూర్తిగా కట్టడి చేసిన స్పానిష్‌ జట్టు.. అర్జెంటీనాకు మ్యాచ్‌లో కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. ఫైనల్‌కు ముందు ఫైనల్‌కు ముందు మెస్సీ-యమాల్‌ పోరుగా ప్రచారం జరిగినా.. మైదానంలో మాత్రం అది స్పెయిన్‌-అర్జెంటీనా మధ్య ఏకపక్ష పోరుగా మారింది. మెస్సీ బంతిని అందుకున్న ప్రతిసారి స్పెయిన్‌ ఆటగాళ్లు వెంటనే అతన్ని చుట్టుముట్టడంతో అర్జెంటీనా ఎటాకింగ్‌ చేయలేకపోయింది. మ్యాచ్‌ తొలి 70 నిమిషాల వరకు అర్జెంటీనా ఒక్క షాట్‌ కూడా ఆడలేకపోయింది. 1966 నుంచి ఓ ప్రపంచకప్‌ ఫైనల్‌ చరిత్రలో తొలి షాట్‌ కోసం ఇంతసేపు వేచి చూడాల్సి వచ్చిన సందర్భం ఇదే. ఈ సమయంలో మెస్సీ బంతిని కేవలం 22 సార్లు మాత్రమే తాకడం స్పెయిన్‌ డిఫెన్స్‌ ఎంత సమర్థవంతంగా నిలువరించిందో చెప్పడానికి ఇదే నిదర్శనం.

రొడ్రీ నాయకత్వంలో మిడ్‌ఫీల్డ్‌ ఆధిపత్యం

రొడ్రీ మరోసారి స్పెయిన్‌కు కీలకంగా నిలిచాడు. పెద్రి, ఫాబియన్‌ రూయిజ్‌, డానీ ఒల్మో నిరంతరం బంతిని చక్కగా పాస్‌లు చేసుకుంటూ అర్జెంటీనా ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. మరోవైపు యువ డిఫెండర్‌ కుబార్సీ ధైర్యంగా ముందుకు వస్తూ ఎటాకింగ్‌కు ఊతమిచ్చాడు. వింగర్లుగా లామిన్‌ యమాల్‌, నికో విలియమ్స్‌ అర్జెంటీనా డిఫెన్స్‌ను సవాల్‌ చేస్తూ వచ్చారు. యమాల్‌ డ్రిబ్లింగ్‌తో ప్రత్యర్థులను మభ్యపెట్టగా.. విలియమ్స్‌ వేగంతో ఖాళీ ప్రదేశాలను చక్కగా వినియోగించుకుంటూ ఎటాకింగ్‌కు దిగాడు. తొలి అర్ధభాగంలో నమోదైన మూడు షాట్లు కూడా స్పెయిన్‌వే కావడం వారి ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది. స్పెయిన్‌ దాడులను అడ్డుకుంటూ అర్జెంటీనాను ఎంతోసేపు పోటీలో నిలబెట్టింది గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌ మాత్రమే. డానీ ఒల్మో, నికో విలియమ్స్‌, యమాల్‌ చేసిన పలువురు ప్రయత్నాలను అద్భుతంగా అడ్డుకున్నాడు. మికెల్‌ మెరినో దగ్గర నుంచి హెడ్డర్‌ను లక్ష్యానికి మళ్లించలేకపోవడం కూడా స్పెయిన్‌కు నిరాశ కలిగించింది. అదే సమయంలో స్పెయిన్‌ చేసిన రెండు గోల్స్‌ను రిఫరీ వరుసగా ఫౌల్‌, ఆఫ్‌సైడ్‌ కారణాలతో తిరస్కరించాడు. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లింది. ఇక అర్జెంటీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణీత సమయం చివర్లో ఎంజో ఫెర్నాండెజ్‌ రెడ్‌కార్డు చూడటంతో అదనపు సమయాన్ని పది మందితోనే ఆడాల్సి వచ్చింది.

టొరెస్‌ గోల్‌తో టైటిల్‌ ఖాయం

అదనపు సమయం రెండో భాగం ప్రారంభమైన కేవలం 37 సెకన్లకే స్పెయిన్‌కు ఎదురుచూస్తున్న గోల్‌ దక్కింది. పెడ్రో పోరో పంపిన క్రాస్‌ను నికో విలియమ్స్‌ చాకచక్యంగా హెడ్‌తో మళ్లించగా.. సరైన సమయంలో అక్కడికి చేరుకున్న ఫెర్రాన్‌ టొరెస్‌ బలమైన షాట్‌ కొట్టి బంతిని నెట్‌లోకి పంపించాడు. టోర్నీలో టొరెస్‌కు ఇదే తొలి గోల్‌ అయినా.. అదే స్పెయిన్‌కు ప్రపంచకప్‌ను అందించిన విజయగోల్‌గా నిలిచింది. ఆ తర్వాత అర్జెంటీనా సమం చేసే ప్రయత్నాలు చేసినా స్పెయిన్‌ రక్షణ ఏమాత్రం తడబడలేదు. మెస్సీ పంపిన ప్రమాదకర క్రాస్‌ను స్పెయిన్‌ ఆటగాళ్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. చివరి నిమిషాల్లో కార్నర్లు, లాంగ్‌బాల్స్‌తో ఒత్తిడి తీసుకొచ్చినా అర్జెంటీనా పెనాల్టీల వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లలేకపోయింది. తుది విజిల్‌తో స్పెయిన్‌ సంబరాల్లో మునిగిపోయింది. దాదాపు రెండు గంటలపాటు ఆటను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న స్పెయిన్‌, అందుకు తగిన ప్రతిఫలంగా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మెస్సీకి మరో ప్రపంచకప్‌ అందుకోవాలన్న ఆశ నెరవేరకపోగా, స్పెయిన్‌ మరోసారి ప్రపంచ ఫుట్‌బాల్‌పై తన ముద్ర వేసింది.

విజేతలకు ట్రోఫీ బహూకరించిన ట్రంప్‌

మ్యాచ్‌ ముగిసిన అనంతరం విజేతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజేత స్పెయిన్‌ జట్టుకు ఫిఫా చైర్మన్‌ జియానీ ఇన్‌ఫాంటినోతో కలిసి ట్రోఫీని అందజేశారు. ఈ సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రేక్షకుల నుంచి నిరసన ఎదురైంది. ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినోతో కలిసి మైదానంలోకి వచ్చిన ట్రంప్‌ను ప్రేక్షకుల్లోని కొందరు పెద్ద ఎత్తున హూటింగ్‌ చేశారు. ఆ తర్వాత స్పెయిన్‌ కెప్టెన్‌ రొడ్రీకి ట్రంప్‌ ప్రపంచకప్‌ ట్రోఫీని అందజేశారు. అయితే, ట్రోఫీని ఎత్తే సమయంలో ట్రంప్‌ ఆటగాళ్ల మధ్యనే నిలబడడంతో అధికారులు పక్కకు వెళ్లాలని సూచించారు. అనంతరం ఆయన పక్కకు తప్పుకోవడంతో రొడ్రీ తన సహచరులతో కలిసి ట్రోఫీని ఎత్తి సంబరాలు చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రేక్షకుల హూటింగ్‌, ట్రోఫీ ఎత్తే సమయంలో ట్రంప్‌ను పక్కకు వెళ్లమని సూచించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Advertisement
Advertisement