త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shreyas Iyer | టీ20 జట్టుకు సారథ్యం దక్కడం గర్వకారణం.. తొలిసారిగా స్పందించిన శ్రేయాస్ అయ్య‌ర్‌

Shreyas Iyer | భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియామ‌క‌మ‌వ‌డంపై శ్రేయాస్ అయ్య‌ర్ ఆనందం వ్య‌క్తం చేశాడు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన ఘట్టమని పేర్కొన్నాడు.

P

Sports | Published On Jun 7, 2026, 4.15 pm IST

Shreyas Iyer | టీ20 జట్టుకు సారథ్యం దక్కడం గర్వకారణం.. తొలిసారిగా స్పందించిన శ్రేయాస్ అయ్య‌ర్‌
Advertisement

Shreyas Iyer | భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియామ‌క‌మ‌వ‌డంపై శ్రేయాస్ అయ్య‌ర్ ఆనందం వ్య‌క్తం చేశాడు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన ఘట్టమని పేర్కొన్నాడు. ఐర్లండ్‌, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు 2026 ఆసియా గేమ్స్‌లో కూడా టీమిండియాకు అయ్యర్ సారథ్యం వహించనున్న నేపథ్యంలో స‌ర్పంచ్ సాబ్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ముంబ‌యి టీ20 లీగ్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అయ్యర్.. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు.

భారత జట్టులో చోటు సంపాదించడమే ప్రతి క్రికెటర్‌కు కల అని, అలాంటిది దేశ జట్టును ముందుండి నడిపించే అవకాశం రావడం మరింత గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. "భారత్ తరఫున మైదానంలో అడుగుపెట్టడం ప్రతిసారి ప్రత్యేక అనుభూతినే ఇస్తుంది. ఇప్పుడు కెప్టెన్‌గా ఆ బాధ్యతలు నిర్వర్తించబోతుండటం మరింత సంతోషంగా ఉంది. బ్యాట్స్‌మన్‌గా జట్టుకు పరుగులు అందించడమే కాకుండా.. నాయకుడిగా విజయాలు అందించగలిగితే అది మరింత సంతృప్తినిస్తుంది. అభిమానులు ఇన్నాళ్లుగా నాపై చూపిస్తున్న ప్రేమ, ప్రోత్సాహం నాకు ఎప్పటికీ మరిచిపోలేని బలం" అని అయ్యర్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉండ‌గా.. టీ20 కెప్టెన్సీ మార్పుల వెనుక ఉన్న కార‌ణాల‌ను భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. భవిష్యత్ అవసరాలు, ముఖ్యంగా రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని నాయకత్వంలో మార్పు చేపట్టినట్లు వివరించాడు. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం సులభమైన నిర్ణయం కాదని, జట్టు భవిష్యత్ ప్రణాళికల మేర‌కు మార్పు అవసరమైందని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడని, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా అతనిలో ఉన్నాయని అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అందుకే అతడికి టీ20 జట్టు పగ్గాలు అప్పగించినట్లు తెలిపారు. కొత్త సారథిగా అయ్యర్ ముందు ప‌రీక్ష‌లున్నాయి. వ్యక్తిగత ప్రదర్శనను కొనసాగిస్తూనే జట్టును సమర్థంగా నడిపించడం, కీలక సిరీస్‌లు, అంతర్జాతీయ టోర్నీల్లో విజయాలు అందించ‌డం కీల‌కం. ప్ర‌స్తుతం భారత టీ20 జట్టు కొత్త అధ్యాయం ఎలా ఉంటుంద‌న్న దానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement