త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs AFG | ముల్లాన్‌పూర్ టెస్టులో ఆఫ్ఘ‌న్‌పై భార‌త్ ఆధిప‌త్యం.. అరంగేట్రంలో అల‌రించిన మాన‌వ్‌

IND Vs AFG | న్యూచండీగ‌ఢ్ ముల్లాన్‌పూర్ వేదిక‌గా ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ భార‌త జ‌ట్టు ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టిన బ్యాట్స్‌మెన్‌.. బౌలింగ్‌లోనూ బౌల‌ర్లు దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.

P

Sports | Published On Jun 7, 2026, 6.07 pm IST

IND Vs AFG | ముల్లాన్‌పూర్ టెస్టులో ఆఫ్ఘ‌న్‌పై భార‌త్ ఆధిప‌త్యం.. అరంగేట్రంలో అల‌రించిన మాన‌వ్‌
Advertisement

IND Vs AFG | న్యూచండీగ‌ఢ్ ముల్లాన్‌పూర్ వేదిక‌గా ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ భార‌త జ‌ట్టు ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టిన బ్యాట్స్‌మెన్‌.. బౌలింగ్‌లోనూ బౌల‌ర్లు దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు 451 ప‌రుగులు వెనక‌బ‌డింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 564/8 వద్ద డిక్లేర్ చేసింది. చివరి దశలో ఆడిన వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 52 పరుగులు చేయ‌గా.. చివ‌ర‌లో మహమ్మద్ సిరాజ్ (22) వేగంగా ప‌రుగులు చేశాడు.

సుంద‌ర్ హాఫ్ సెంచ‌రీ త‌ర్వాత కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తన అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టాడు. తాను వేసిన తొలి ఓవ‌ర్‌లోనే పదునైన టర్న్‌తో అబ్దుల్ మాలిక్‌ను పెవిలియన్‌కు తొలి వికెట్‌ను ఖాతాలే వేసుకున్నాడు. త‌ర్వాత రహ్మానుల్లా గుర్బాజ్‌ను కూడా ఔట్ చేసి ప్రత్యర్థి శిబిరాన్ని కుదిపేశాడు. మరో ఎండ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన వేగంతో ప్రభావం చూపాడు. సెదిఖుల్లా అటల్‌ను అవుట్ చేసి ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఒకవైపు వికెట్లు వరుసగా పడుతున్నా.. సీనియ‌ర్ ప్లేయ‌ర్ రహ్మత్ షా మాత్రం నిలకడగా ఆడాడు. 43 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లోనే రహ్మత్ షా టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరి చరిత్ర నెల‌కొల్పాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్ఘన్ ఆటగాడిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో కలిసి 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అతను ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత అఫ్సర్ జజాయ్‌ను మానవ్ సుతార్ రిటర్న్ క్యాచ్ రూపంలో పెవిలియన్‌కు పంపడంతో ఆఫ్ఘనిస్థాన్ మరింత ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ఫాలో-ఆన్ ప్రమాదంలో ఉన్న ఆఫ్ఘన్ జట్టు.. మూడో రోజు ఆటలో ఎలా నిలదొక్కుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు మ్యాచ్‌ను త్వరగా ముగించాలని టీమిండియా ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.

Advertisement
Advertisement