త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CWG 2026 | గ్లాస్గో కామ‌న్వెల్త్ గేమ్స్‌.. వెయిట్‌లిఫ్ట్‌లో భార‌త్‌కు సిల్వ‌ర్‌..!

CWG 2026 | ఓడిపోకుండా చివరి ప్రయత్నం వరకు పోరాడటమే అసలైన క్రీడాస్ఫూర్తి. కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత వెయిట్‌లిఫ్టర్‌ రిషికాంత్‌ సింగ్‌ ఇదే స్ఫూర్తిని చాటాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో రెండు ప్రయత్నాలు విఫలమైనా.. బంగారు పతకం చేజారినా అత‌ని ముఖంలో నిరాశ కంటే సంతృప్తే ఎక్కువగా కనిపించింది.

P

Sports | Published On Jul 26, 2026, 5.36 pm IST

CWG 2026 | గ్లాస్గో కామ‌న్వెల్త్ గేమ్స్‌.. వెయిట్‌లిఫ్ట్‌లో భార‌త్‌కు సిల్వ‌ర్‌..!
Advertisement

CWG 2026 | ఓడిపోకుండా చివరి ప్రయత్నం వరకు పోరాడటమే అసలైన క్రీడాస్ఫూర్తి. కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత వెయిట్‌లిఫ్టర్‌ రిషికాంత్‌ సింగ్‌ ఇదే స్ఫూర్తిని చాటాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో రెండు ప్రయత్నాలు విఫలమైనా.. బంగారు పతకం చేజారినా అత‌ని ముఖంలో నిరాశ కంటే సంతృప్తే ఎక్కువగా కనిపించింది. కారణం భారత్‌కు మరో పతకం అందించ‌డ‌మే. పురుషుల 60 కేజీల విభాగంలో సిల్వ‌ర్ మెడ‌ల సాధించి దేశాన్ని గర్వపడేలా చేశాడు.

స్నాచ్‌లో రిషికాంత్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి దశలోనే 121 కేజీల బరువును ఎత్తి తన సత్తా చాటాడు. అనంతరం క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 143 కేజీలను విజయవంతంగా ఎత్తాడు. గోల్డ్ మెడ‌ల్ పోటీలో నిలవాలంటే మరింత మెరుగైన ప్రదర్శన అవసరం కావడంతో రెండో ప్రయత్నంలో 148 కేజీలు, మూడో ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించాడు. అయితే, రెండు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. అయినా స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ కలిపి 264 కేజీల మొత్తం బరువుతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన మహ్మద్‌ అనిక్‌ 273 కేజీల మొత్తం బరువుతో స్వర్ణం గెలిచాడు. స్నాచ్‌ (121 కేజీలు), క్లీన్‌ అండ్‌ జెర్క్‌ (152 కేజీలు), మొత్తం బరువు విభాగాల్లో అతడు కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డులను క్రియేట్ చేశాడు. గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. అంతకుముందు పారా పవర్‌లిఫ్టింగ్‌లో జంధు కుమార్‌ కాంస్య పతకం సాధించ‌డంతో భార‌త్ ఖాతా తెరిచింది.

మణిపూర్‌ నుంచి మరో వెయిట్‌లిఫ్టింగ్‌ స్టార్‌

వెయిట్‌లిఫ్టింగ్‌ అంటే మణిపూర్‌ పేరు ప్రస్తావనకు రావడం సహజం. మీరాబాయి చాను వంటి దిగ్గజాలను అందించిన ఈ రాష్ట్రం నుంచి రిషికాంత్‌ సింగ్‌ మరో భార‌త్‌కు ప‌త‌కాలు అందించే స్థాయికి ఎదిగాడు. ఇంఫాల్‌ వెస్ట్‌కు చెందిన రిషికాంత్‌కు చిన్నప్పటి నుంచే వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి ఉండేది. సరైన శిక్షణ, అవకాశాలు లభించడంతో అతడి ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది. భారత సైన్యం క్రీడా వ్యవస్థలో భాగమైన తర్వాత క్రమశిక్షణ, ఆధునిక శిక్షణ, మెరుగైన సదుపాయాలు అత‌ని నైపుణ్యాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.

రికార్డులతో కామన్వెల్త్‌ వేదికకు..

రిషికాంత్‌ 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో 55 కేజీల విభాగంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అనంతరం బరువు విభాగాన్ని మార్చుకుని 60/61 కేజీల విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2024 జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 61 కేజీల విభాగంలో స్నాచ్‌లో 124 కేజీలు ఎత్తి జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2025 కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 120 కేజీలు స్నాచ్‌, 151 కేజీలు క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో ఎత్తి స్వర్ణ పతకం సాధించాడు. 271 కేజీల మొత్తం బరువుతో మరో జాతీయ రికార్డును నమోదు చేసి వరుసగా రెండోసారి కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించాడు.

పోరాట‌మే బంగారం..

గ్లాస్గోలో స్వర్ణం చేజారినా రిషికాంత్‌ సాధించిన రజతం అత‌ని పట్టుదల, కష్టానికి నిదర్శనం. చివరి రెండు ప్రయత్నాలు విఫలమైనా మనోధైర్యం కోల్పోకుండా త్రివర్ణ పతాకాన్ని వేదికపై నిలిపాడు. ఈ పతకం కేవలం ఒక క్రీడాకారుడి విజయం మాత్రమే కాదు.. మణిపూర్‌లో మొదలైన ఓ యువకుడి ప్రయాణం, భారత సైన్యం అందించిన సహకారం, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన ఓ వెయిట్‌లిఫ్టర్‌ కథ. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌ వంటి వేదికలపై రిషికాంత్‌ నుంచి మరిన్ని విజయాలను సాధించాల‌ని యావ‌త్ భారత్‌ ఆకాంక్షిస్తోంది.

Advertisement
Advertisement