త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | నేటి నుంచి ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ షురూ.. ఆర్‌సీబీ Vs గుజరాత్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌..!

IPL 2026 | ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌ దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మరోసారి ఫైనల్‌కి చేరేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు రెండో టైటిల్‌ లక్ష్యంగా గుజరాత్‌ టైటాన్స్‌ కూడా బరిలోకి దిగుతోంది. ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ధర్మశాలలో జరగనుంది.

P

Sports | Published On May 26, 2026, 8.15 am IST

IPL 2026 | నేటి నుంచి ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ షురూ.. ఆర్‌సీబీ Vs గుజరాత్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌..!
Advertisement

IPL 2026 | ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌ దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మరోసారి ఫైనల్‌కి చేరేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు రెండో టైటిల్‌ లక్ష్యంగా గుజరాత్‌ టైటాన్స్‌ కూడా బరిలోకి దిగుతోంది. ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ధర్మశాలలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మాత్రం క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం లభించనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ తమ టైటిల్‌ డిఫెన్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. రజత్ పటీదార్‌ నేతృత్వంలోని జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ అనుభవం, జోష్ హేజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్‌ల పేస్‌ దాడి జట్టుకు ప్రధాన బలంగా మారింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ పలు మ్యాచ్‌ల్లో 200కిపైగా స్కోర్‌ నమోదు చేయడం విశేషం.

గుజరాత్ టైటాన్స్ ప్రదర్శన ఇలా..

గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో టాప్ ఆర్డర్‌ బ్యాటింగ్‌తో పాటు బలమైన బౌలింగ్‌తో ప్లే ఆఫ్స్‌కి చేరింది. శుభ్‌మన్ గిల్‌, సాయి సుదర్శన్‌, జోస్ బట్లర్‌ త్రయం జట్టుకు కీలక విజయాలు అందించింది. బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ సిరాజ్‌, కాగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ కొత్త బంతితో ఒత్తిడి పెంచుతున్నారు. మధ్య ఓవర్లలో రషీద్ ఖాన్‌, ఆర్ సాయి కిశోర్ స్పిన్‌ విభాగాన్ని సమతూకంగా నడిపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ధర్మశాలలో ఆర్సీబీకే స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్‌, హేజిల్‌వుడ్ నేతృత్వంలోని పేస్‌ దాడి స్వింగ్‌, కంట్రోల్‌, లెంగ్త్‌తో ప్రభావం చూపే అవకాశముంది. గతంలో కూడా ఆర్సీబీ ఇలాంటి పరిస్థితుల్లో భారీ స్కోర్లను విజయవంతంగా కాపాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, గుజరాత్ పేస్‌ దాడిని తక్కువ అంచనా వేయలేం. ధర్మశాలలో అదనపు బౌన్స్‌ వారికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. కానీ, స్పిన్నర్లకు ఎక్కువగా సహకారంలభించే అవకాశం లేదు. దాంతో వ్యూహం కీలకంగా మారనుంది.

జట్లలో మార్పులపై ఉత్కంఠ

ఆర్సీబీ ఎక్కువగా తమ కోర్‌ టీమ్‌పైనే ఆధారపడుతోంది. ఫిల్ సాల్ట్ గాయం నుంచి కోలుకుని తిరిగి అందుబాటులోకి రావడం జట్టుకు పెద్ద ఊరటనిస్తోంది. ఫిట్ అయితే ఓపెనింగ్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీంతో వెంకటేశ్ అయ్యర్‌ స్థానంపై నిర్ణయం ఆసక్తికరంగా మారింది. సుయాష్ శర్మ స్థానంలో జేకబ్ డఫీకి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ కూడా తుది జట్టుపై తర్జనభర్జనలో ఉంది. అదనపు బ్యాటర్‌గా నిషాంత్ సిద్ధును తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్లలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఉంది.

అంచనా జట్లు

ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్/వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్ తేవాటియా, నిషాంత్ సిధ్దు, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కాగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్.

Advertisement
Advertisement