త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paraguay Vs Germany | జర్మనీకి పరాగ్వే షాక్‌

Paraguay Vs Germany | ఫుట్‌బాల్‌లో అద్భుతాలు అరుదుగానే జరుగుతాయి. కానీ, ప్రపంచకప్ వేదికపై పరాగ్వే అలాంటి అద్భుతాన్ని చేసి చూపించింది. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీని పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో మట్టికరిపించి ప్రీక్వార్టర్స్‌కు చేరిన పరాగ్వే.. దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నది.

P

Sports | Published On Jun 30, 2026, 7.23 am IST

Paraguay Vs Germany | జర్మనీకి పరాగ్వే షాక్‌
Advertisement
  • ప్రీకార్వర్ట్స్‌లోకి దూసుకెళ్లిన చరిత్ర సృష్టించిన జట్టు
  • ఆర్లాండ్‌ గిల్‌ అద్భుత ప్రదర్శన
  • పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో ఘన విజయం
  • చెదిరిన జర్మనీ కల

Paraguay Vs Germany | ఫుట్‌బాల్‌లో అద్భుతాలు అరుదుగానే జరుగుతాయి. కానీ, ప్రపంచకప్ వేదికపై పరాగ్వే అలాంటి అద్భుతాన్ని చేసి చూపించింది. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీని పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో మట్టికరిపించి ప్రీక్వార్టర్స్‌కు చేరిన పరాగ్వే.. దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నది. మంగళవారం జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 32 మ్యాచ్‌లో జర్మనీని ఓడించి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత 90 నిమిషాల సమయంతో పాటు అదనపు 30 నిమిషాల్లోనూ ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. అక్కడ పరాగ్వే 4-3తో విజయం సాధించి దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప విజయాన్ని నమోదు చేసింది. జర్మనీ ఆటగాడు జొనాథన్ తాహ్ ఆరో పెనాల్టీని క్రాస్‌బార్‌పైకి కొట్టగా.. జోస్ కనాలే ఒత్తిడిని అధిగమిస్తూ నిర్ణయాత్మక పెనాల్టీని గోల్‌గా మలిచాడు. దీంతో పరాగ్వే శిబిరంలో సంబరాలు అంబరాన్నంటగా.. జర్మనీ మరోసారి ప్రపంచకప్‌లో నిరాశతో ఇంటిముఖం పట్టింది.

గిల్ ఎదుట నిలువలేకపోయిన జర్మనీ

ఈ మ్యాచ్‌ హీరో పరాగ్వే గోల్‌కీపర్ ఆర్లాండో గిల్. ఒకవైపు ప్రపంచకప్ విజేత, దిగ్గజ గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయర్ ఉండగా.. మరోవైపు కేవలం 25 ఏళ్ల గిల్ తన అసాధారణ ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 120 నిమిషాల్లో గిల్‌ ఆరు కీలక సేవ్స్‌ చేసి జర్మనీ ఎటాకింగ్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ప్రతి క్రాస్‌ను ధైర్యంగా అందుకోవడం, ఒత్తిడిలోనూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా గోల్‌ పోస్ట్‌ ఎదుట అడ్డుగోడగా నిలిచి ప్రత్యర్థి ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. పెనాల్టీ షూటౌట్‌లో కై హావెర్ట్జ్, నిక్ వోల్టెమాడే కిక్‌లను అద్భుతంగా అడ్డుకొని పరాగ్వేకు ఆధిక్యం అందించాడు. ఒక దశలో న్యూయర్ ఫాబియన్ బాల్బుయెనా పెనాల్టీని ఆపి జర్మనీ ఆశలు రేకెత్తించినా.. తాహ్ పెనాల్టీని వృథా చేయడంతో పరాగ్వే విజయం ఖాయమైంది. ప్రపంచకప్ చరిత్రలో పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీకి ఇదే తొలి ఓటమి కావడం విశేషం.

వీఏఆర్‌తో నిర్ణయంతో మలుపు..

అదనపు సమయంలో జర్మనీ గెలుపు గోల్ సాధించిందనుకున్నా.. వీఏఆర్ సమీక్షతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 102వ నిమిషంలో జొనాథన్ తాహ్ హెడ్డర్‌ను గోల్‌గా ప్రకటించిన రిఫరీ.. రీప్లేలో వాల్డెమార్ ఆంటన్ గోల్‌కీపర్ గిల్‌ను అడ్డుకున్నట్లు గుర్తించడంతో వీఏఆర్ సూచన మేరకు నిర్ణయాన్ని మార్చాడు. పిచ్‌సైడ్ మానిటర్‌లో పరిశీలించిన అనంతరం గోల్‌ను ఫౌల్‌గా ప్రకటించి రద్దు చేశాడు. ఇదే మ్యాచ్‌కు కీలక మలుపు. ఆ తర్వాత కూడా జర్మనీ వరుసగా ఎటాకింగ్‌ చేసినా గిల్ గోడలా నిలిచి ఒక్క అవకాశం ఇవ్వలేదు. పరాగ్వే విజయానికి మరో కారణం జూలియో ఎన్‌సిసో పోరాటస్ఫూర్తి. టోర్నీకి ముందు నికరాగువాతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో గాయపడి స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన అతడు ప్రపంచకప్‌కు దూరమవుతాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఎన్‌సిసో 42వ నిమిషంలో మతియాస్ గలార్జా ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను హెడ్డర్‌తో గోల్‌గా మలిచి పరాగ్వేకు ఆధిక్యం అందించాడు. అయితే, ద్వితీయార్థం ప్రారంభమైన 12 నిమిషాలకే గాయం మళ్లీ వేధించడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయినప్పటికీ అతని గోల్‌నే చివరకు పరాగ్వే చారిత్రక విజయాన్ని అందించింది.

జర్మనీకి మరో చేదు అనుభవం

2018, 2022 ప్రపంచకప్‌లలో వరుసగా లీగ్ దశలోనే జర్మనీ నిష్క్రమించింది. ఈసారి గత వైభవాన్ని చాటాలని భావించింది. కానీ, నాకౌట్ దశలోనే పరాగ్వే చేతిలో ఓటమిపాలై మరోసారి నిరాశ చెందింది. మరోవైపు, 2010 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్ చేరిన ప్రదర్శనే ఇప్పటివరకు పరాగ్వేకు అత్యుత్తమం. తాజాగా ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రశ్రేణి జట్లలో ఒకటైన జర్మనీని ప్రపంచకప్ వేదికపై ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కనాలే చేసిన గోల్‌తో విజయం ఖరారు కాగా.. పెనాల్టీ గోల్‌తో పరాగ్వే అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. జర్మనీ ఆటగాళ్లు నిరాశతో మైదానంలోనే కుప్పకూలిపోయారు. ఈ విజయం పరాగ్వే ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

Advertisement
Advertisement