Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!
Manushi Chhillar | సినిమా రంగంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. తొలి అవకాశమే అద్భుతమైన పాత్ర కావాలని, స్టార్ హీరోల సరసన నటించాలని, మంచి కథలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని కలలు కంటారు. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం చాలాసార్లు అందుకు భిన్నంగా ఉంటాయి.
Entertainment | Published On Nov 4, 2026, 9.20 pm IST
Manushi Chhillar | సినిమా రంగంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. తొలి అవకాశమే అద్భుతమైన పాత్ర కావాలని, స్టార్ హీరోల సరసన నటించాలని, మంచి కథలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని కలలు కంటారు. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం చాలాసార్లు అందుకు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సినీ నేపథ్యం లేని వారు పరిశ్రమలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవకాశాల కోసం ఎదురుచూడటం కంటే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు సాగడమే ముఖ్యమని అంటున్నారు మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ప్రతి సినిమా తన కలల ప్రాజెక్ట్ కావాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు లక్ష్యానికి చేరువ చేసే చిన్న అవకాశమైనా కెరీర్‌కు ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
పర్ఫెక్ట్ అవకాశం కోసం ఎదురుచూడలేం!

Manushi Chhillar
సినీ పరిశ్రమలో కెరీర్ అనేది ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమేమీ సాగదని మానుషి చెబుతున్నది. ముఖ్యంగా సినిమా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఎప్పుడు వస్తాయో.. తర్వాతి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుందన్నారు. అలాంటప్పుడు ఒక పెద్ద దర్శకుడు తమ కోసమే అద్భుతమైన కథను సిద్ధం చేస్తారని ఎదురుచూస్తూ కూర్చోవడం సరైన నిర్ణయం కాదని పేర్కొంది. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక అనుభవంగా చూడాలని, అవే భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలకు మార్గం వేస్తాయని వివరించింది. అందుకే ప్రతి ప్రాజెక్ట్ తనకు నచ్చిన కథతో ఉండాలని పట్టుబట్టకుండా.. తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే పనులను ఎంచుకోవడం ముఖ్యమని ఆమె అభిప్రాయపడింది.
మనసు చెప్పిందే ముఖ్యం..

Manushi Chhillar
కొత్తగా ఒక రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవడం సహజం. అయితే, కాలం గడిచేకొద్దీ సొంత ఆలోచనలు, నిర్ణయాలపై నమ్మకం పెంచుకోవాలని మానుషి సూచిస్తోంది. తన కెరీర్ ప్రారంభంలో చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలను ఎక్కువగా పరిగణనలోకి తీసుకున్నానని, కానీ అనుభవం పెరిగిన తర్వాత తన మనసుకు నచ్చిన నిర్ణయాలే ఎక్కువ సంతృప్తినిచ్చాయని తెలిపింది. పరిశ్రమలో అనిశ్చితి ఉన్నప్పటికీ.. మనకు సరైనదనిపించిన మార్గంలో ముందుకు వెళ్లడం అవసరమని ఆమె భావిస్తోంది. ఇతరులు ఏమనుకుంటారనే దానికంటే మనం ఎంచుకున్న పని పట్ల మనకు ఎంత నమ్మకం ఉందనేదే ముఖ్యమని మానుషి మాటలతో స్పష్టమైంది.
ఆర్థిక స్వేచ్ఛతో ఒత్తిడి తగ్గింది

Manushi Chhillar
నటన ఒక్కటే ఆదాయ మార్గంగా ఉండకపోవడం కూడా తన కెరీర్‌కు ఉపయోగపడిందని మానుషి పేర్కొంది. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించగలిగానని చెప్పింది. దీనివల్ల ప్రతి సినిమాపైనా ఆర్థిక అవసరాల కోసం ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గిందని వివరించింది. తనకంటూ మరో ఆదాయ మార్గం ఉండటం వల్ల నటనను కేవలం సంపాదన కోసం కాకుండా.. ఇష్టంతో, ఆసక్తితో కొనసాగించే వెసులుబాటు లభించిందని చెప్పుకొచ్చింది. కళాత్మక రంగంలో పనిచేసేవారు చేసే పనిని ఆస్వాదించగలగాలని, అందుకు కొంత ఆర్థిక స్వేచ్ఛ కూడా తోడ్పడుతుందని ఆమె అభిప్రాయపడింది.
మిస్ వరల్డ్ నుంచి బాలీవుడ్ వరకు..

Manushi Chhillar
హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ ప్రయాణం అందాల పోటీలతోనే ప్రపంచానికి పరిచయమైంది. వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే మోడలింగ్, అందాల పోటీలపై ఆసక్తి పెంచుకున్నారు. 2017లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో హరియాణా తరఫున పాల్గొని విజేతగా నిలిచింది. అదే ఏడాది నవంబర్ 18న చైనాలోని సాన్యాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అప్పటికి ఆమె వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. ఈ విజయంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత మోడలింగ్, ఫ్యాషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలో అవకాశాలు పెరిగాయి. పలు అంతర్జాతీయ బ్రాండ్లతోనూ ఆమె పనిచేశారు. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేశారు. యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో 2022లో బాలీవుడ్‌లో కథానాయికగా పరిచయమయ్యారు. ఇందులో అక్షయ్ కుమార్ సరసన సంయోగిత పాత్రలో నటించారు. అనంతరం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘బడే మియాన్ చోటే మియాన్’ వంటి చిత్రాల్లో నటించింది. 2025లో మాలిక్, తెహ్రాన్ సినిమాలతోనూ ప్రేక్షకులను పలకరించింది.
తనదైన గుర్తింపు కోసం ప్రయత్నం

Manushi Chhillar
విశ్వసుందరి కిరీటం అందుకున్న తర్వాత సినిమాల్లోకి రావడం బయటకు చూస్తే సులభంగా అనిపించినా.. నటిగా తనను తాను నిరూపించుకోవడం మాత్రం అంత సులభం కాదని మానుషి గతంలోనూ పలు సందర్భాల్లో వెల్లడించింది. అందాల పోటీల్లో సాధించిన గుర్తింపు ఒక వేదికను కల్పించినప్పటికీ.. నటిగా నిలదొక్కుకోవాలంటే ప్రతిభ, కృషి అవసరమని భావిస్తోంది. ప్రస్తుతం విక్రాంత్ మాస్సేతో కలిసి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో నటిస్తున్నది. ఆ కథ తనకు ఎంతో నచ్చిందని, చిత్రీకరణలో ఉపయోగిస్తున్న సాంకేతికత కూడా కొత్త అనుభవాన్ని ఇచ్చిందని తాజా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. విశ్వసుందరిగా ప్రపంచ వేదికపై మొదలైన మానుషి ప్రయాణం.. ఇప్పుడు నటిగా, వ్యాపారవేత్తగా ముందుకు సాగుతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక అనుభవంగా మలుచుకుంటూ, తన నిర్ణయాలపై నమ్మకంతో ముందుకు సాగడమే తన కెరీర్ మంత్రంగా మార్చుకొని కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు
- ●US Midterm Elections 2026 | ట్రంప్‌నకు అసలు షాక్ ఇప్పుడే.. అమెరికాలో మారిన పవర్ గేమ్..!
- ●Kajal Aggarwal | మండోదరిగా చందమామ.. ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు ఎందుకో..!
- ●Medigadda To Kondapochamma Sagar Cycle Yatra | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. మేడిగడ్డ టు ఎర్రవెల్లి 400 కి.మీ సైకిల్ యాత్ర
- ●WPL 2027 | డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి మహిళల క్రికెట్ సమరం
- ●Disha Patani | గ్లామర్ చూసి అంచనా వేయొద్దు.. నా అసలు స్వభావం వేరంటున్న బ్యూటీ..!

Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు

US Midterm Elections 2026 | ట్రంప్‌నకు అసలు షాక్ ఇప్పుడే.. అమెరికాలో మారిన పవర్ గేమ్..!

Kajal Aggarwal | మండోదరిగా చందమామ.. ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు ఎందుకో..!

Medigadda To Kondapochamma Sagar Cycle Yatra | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. మేడిగడ్డ టు ఎర్రవెల్లి 400 కి.మీ సైకిల్ యాత్ర





