త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Norway vs Brazil | నార్వే హిస్ట‌రీ.. తొలిసారి క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోకి ఎంట్రీ

Norway vs Brazil | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో బ్రెజిల్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. న్యూజెర్సీ వేదిక‌గా రౌండ్ ఆఫ్ 16లో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో నార్వే చేతిలో దారుణ ప‌రాజ‌యం పాలైంది. ప్రపంచకప్ గెలవాలంటే అందమైన ఆట కంటే ఫలితాలే ముఖ్యమన్న కార్లో అన్సెలోట్టి వ్యూహం బెడిసికొట్టింది. ఎర్లింగ్ హాలాండ్ రెండు గోల్స్‌తో చెలరేగడంతో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బ్రెజిల్ 2-1తో నార్వే చేతిలో ఓటమి పాలైంది.

P

Sports | Published On Jul 6, 2026, 7.38 am IST

Norway vs Brazil | నార్వే హిస్ట‌రీ.. తొలిసారి క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోకి ఎంట్రీ
Advertisement
  • బ్రెజిల్‌కు నార్వే చేతిలో ఘోర ప‌రాజ‌యం
  • 2-1 తేడాతో బ్రెజిల్ ఓట‌మి
  • రెండు గోల్స్‌తో రాణించిన ఎర్లింగ్ హాలాండ్‌
  • దెబ్బ‌కొట్టిన సాంబా కోచ్ అన్సెలోట్టి వ్యూహం

Norway vs Brazil | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో బ్రెజిల్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. న్యూజెర్సీ వేదిక‌గా రౌండ్ ఆఫ్ 16లో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో నార్వే చేతిలో దారుణ ప‌రాజ‌యం పాలైంది. ప్రపంచకప్ గెలవాలంటే అందమైన ఆట కంటే ఫలితాలే ముఖ్యమన్న కార్లో అన్సెలోట్టి వ్యూహం బెడిసికొట్టింది. ఎర్లింగ్ హాలాండ్ రెండు గోల్స్‌తో చెలరేగడంతో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బ్రెజిల్ 2-1తో నార్వే చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయంతో నార్వే చరిత్రలో తొలిసారి ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. బ్రెజిల్ మరోసారి నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

డిఫెన్స్‌కే ప్రాధాన్యం..

మ్యాచ్‌లో ఎక్కువసేపు బ్రెజిల్ డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టింది. అవ‌కాశాల కోసం ఎదురుచూసింది. అయితే, నార్వే మాత్రం ఆట‌పై ఆధిప‌త్యం చెలాయించింది. బంతిని ఎక్కువ‌గా త‌న ఆధీనంలోనే ఉంచుకొని బ్రెజిల్‌కు మాత్రం ఏ అవ‌కాశం ఇవ్వ‌లేదు. మ‌రో వైపు స్టార్ స్ట్ర‌యిక‌ర్ ఎర్లింగ్ హాలాండ్‌కు వ‌చ్చిన రెండు అవ‌కాశాల‌ను గోల్స్‌గా మ‌లిచి మ్యాచ్‌ను నార్వే వైపు తిప్పేశాడు. ఆఖరి నిమిషాల్లో వెనుక‌బ‌డినా బ్రెజిల్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడ‌లేక‌పోయింది. వ‌రుస ఎటాక్స్‌తో ప్ర‌త్య‌ర్థిని ఒత్తిడికి గురి చేయాల్సిన స‌మ‌యంలోనూ జ‌ట్టును నెమ్మ‌దిగా ఆడ‌డం అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నార్వే గోల్ చేసిన ప్ర‌తీ స‌మ‌యంలో స‌మీక‌ర‌ణాల‌ను మార్చేందుకు గోల్స్ చేస్తుంద‌ని భావించ‌గా.. ఒక‌రి నుంచి ఒక‌రికి బంతిని పాస్ చేస్తూ స‌మ‌యాన్ని వృథా చేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అవ‌కాశ‌మే రాలేదు.

ఆ వ్యూహంతోనే బ్రెజిల్ ఓడించిన నార్వే

దశాబ్దాలుగా ప్రత్యర్థి జట్లు బ్రెజిల్‌ను వెంటాడుతూ ఆడుతూ వ‌స్తుండేది. కానీ, ఈ మ్యాచ్‌లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. నార్వే కెప్టెన్ మార్టిన్ ఒడెగార్డ్ మిడ్‌ఫీల్డ్‌ను అద్భుతంగా నియంత్రించాడు. పాట్రిక్ బెర్గ్ మధ్యభాగంలో పైచేయి సాధించగా.. లెఫ్ట్ సైడ్‌లో ఆండ్రియాస్ షెల్డెరప్ బ్రెజిల్ డిఫెన్స్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. నార్వే అవ‌కాశాల కోసం ఎదురుచూడ‌కుండా బంతిపై పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. మ్యాచ్ 78వ నిమిషానికి నార్వే 523 పాస్‌లు పూర్తి చేయగా.. బ్రెజిల్ కేవలం 203 పాస్‌లకే పరిమితమైంది. ఈ గణాంకాలు చూసిన వారెవరైనా జట్ల పేర్లు మార్చి రాసి ఉంటారేమో అనుకునే పరిస్థితి నెలకొంది. కోచ్ అన్సెలోట్టి వ్యూహం స్పష్టంగానే కనిపించింది. డిఫెన్స్‌ను కట్టుదిట్టంగా ఉంచి, అవకాశం దొరికితే వినీసియస్ జూనియర్ వేగాన్ని వినియోగిస్తూ కౌంటర్ దాడులు చేయాలనేది ప్రణాళిక. కాగితంపై అది సరైన వ్యూహంగానే కనిపించినా, మైదానంలో మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

దూకుడు పెంచాల్సిన చోట‌..

బ్రూనో గిమారేస్‌కు తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని నార్వే గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. గాబ్రియెల్ మార్టినెల్లీ ప్రయత్నాన్ని కూడా నిలువరించాడు. రెండో అర్ధభాగంలో ఎండ్రిక్‌కు వినీసియస్ ఇచ్చిన చక్కటి అవకాశాన్ని కూడా బ్రెజిల్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 68వ నిమిషంలో నెయ్‌మ‌ర్‌ బరిలోకి దిగినా జట్టు ఆట‌తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. దూకుడు పెంచాల్సిన చోట నార్వే మరింత ప్రశాంతంగా బంతిని కంట్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేసింది.

మ్యాచ్‌ను మ‌లుపు తిప్పింది అదే..

దాదాపు 80 నిమిషాల పాటు హాలాండ్‌ను బ్రెజిల్ డిఫెండర్ గాబ్రియెల్ సమర్థంగా అడ్డుకున్నాడు. నార్వే స్టార్ స్ట్రైకర్ ప్రభావం చూపలేకపోయాడు. కానీ, ఒక్క అవకాశమే మ్యాచ్‌ను మార్చేసింది. షెల్డెరప్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌పై గాబ్రియెల్‌ను త‌ప్పించుకొని హాలాండ్ ప‌వ‌ర్‌ఫుల్ హెడ్డర్‌తో అలిసన్‌ను మట్టికరిపించి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఆ తర్వాత కూడా బ్రెజిల్ నుంచి ఊహించిన తీవ్ర దాడులు కనిపించలేదు. ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టు.. క్వార్ట‌ర్స్‌లోకి వెళ్లాలంటే ఏ స్థాయిలో ఆడాలో ఆ స్థాయిలో ఆడ‌లేక‌పోయింది. 90వ నిమిషంలో బ్రెజిల్ ఎక్కువ మంది ఆటగాళ్లను ముందుకు పంపింది. ఈ స‌మయంలో ఏర్ప‌డిన ఖాళీల‌ను హాలాండ్ చాక‌చ‌క్యంగా ఉప‌యోగించుకున్నాడు. పెనాల్టీ బాక్స్ బయట బంతిని అందుకొని ప‌వ‌ర్‌ఫుల్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. టోర్నీలో హాలాండ్‌కు ఇది ఏడో గోల్. దీంతో గోల్డెన్ బూట్ రేసులో లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాప్పేతో సమానంగా నిలిచాడు. అంతేకాదు, నార్వే చరిత్రలో తొలిసారి ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.

నెయ్‌మ‌ర్ గోల్ చేసినా..

ఇంజ్యూరీ టైమ్‌లో నెయ్‌మ‌ర్ పెనాల్టీతో ఒక గోల్ చేసినా ఫ‌లితాన్ని మాత్రం మార్చ‌లేక‌పోయింది. ఈ ప్రపంచకప్ మ్యాచ్ చేదు జ్ఞాపకంగానే మిగిలింది. చివరి విజిల్ అనంతరం నెయ్‌మ‌ర్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. మ‌రో వైపు హాలాండ్ సంతోషంతో మైదానంలోనే కూలిపోయాడు. మెట్లైఫ్ స్టేడియం మొత్తం నార్వే అభిమానుల సంబరాలతో మార్మోగిపోయింది.

అన్సెలోట్టి వ్యూహంపై ప్రశ్నలు

బ్రెజిల్‌ను మరింత స్థిరంగా, ఫలితాలపై దృష్టి పెట్టే జట్టుగా తీర్చిదిద్దాలన్న అన్సెలోట్టి ప్రయత్నం గ్రూప్ దశ వరకు సఫలమైంది. కానీ, నాకౌట్ మ్యాచ్‌లో అవసరమైన వేగం, దూకుడు మాత్రం కనిపించలేదు. తరతరాలుగా బ్రెజిల్ ఆటకు గుర్తింపుగా నిలిచిన ఎటాకింగ్ స్వభావం పూర్తిగా కనుమరుగైంది. బ్రెజిల్ ఇప్పటివరకు నార్వేపై ఐదు మ్యాచ్‌లు ఆడినా ఒక్క విజ‌యం సాధించ‌లేదు. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. రెండు డ్రాగా ముగిశాయి. అలాగే ప్రపంచకప్ నాకౌట్ దశలో యూరోపియన్ జట్టుపై బ్రెజిల్ చివరిసారిగా 2002 ఫైనల్లో జర్మనీని ఓడించింది. అప్పటి నుంచి యూరప్ జట్లను నాకౌట్ దశలో అధిగమించలేకపోతోంది. అయితే, ఈ ఓటమి కేవలం గణాంకాల పరాజయం కాదు. అందమైన ఆట కంటే ఫలితాలకే ప్రాధాన్యం ఇచ్చిన అన్సెలోట్టి విధానం కీలక సమయంలో బ్రెజిల్ సహజ స్వభావాన్ని దూరం చేసింది. కీల‌క స‌మ‌యంలో కూడా అవ‌కాశాల‌ను సృష్టించుకోకుండా.. ఎదురుచూస్తూ ఉండ‌డం జ‌ట్టు విజ‌యంపై ప్ర‌భావం చూపింది. బ్రెజిల్‌కు భిన్నంగా ఆడిన నార్వే విజ‌యం సాధించింది. ఓట‌మితో బ్రెజిల్ ఇంటిబాట ప‌ట్ట‌గా.. నార్వే ఆత్మ‌విశ్వాసంతో క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోకి దూసుకెళ్లింది.

Advertisement
Advertisement