త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viking Row | నాకౌట్‌లోకి నార్వే.. వైకింగ్ రోతో టీమ్ సంబ‌రాలు.. అల‌రించిన ఓడెగార్డ్‌

Martin Ødegaard Leads Norway’s Viking Row Celebration After Historic World Cup Knockout Qualification

P

Sports | Published On Jun 23, 2026, 2.37 pm IST

Viking Row | నాకౌట్‌లోకి నార్వే.. వైకింగ్ రోతో టీమ్ సంబ‌రాలు.. అల‌రించిన ఓడెగార్డ్‌
Advertisement

Viking Row | ఫిఫా ప్రపంచకప్ 2026లో నాకౌట్‌లోకి ప్ర‌వేశించింది. సెనెగ‌ల్‌పై 3-2 తేడాతో విజ‌యం సాధించి రౌండ్ ఆఫ్ 32లోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్భంగా జ‌ట్టు కెప్టెన్ మార్టిన్ ఓడెగార్డ్ ప్ర‌త్యేకంగా అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత సహచర ఆటగాళ్లతో కలిసి ‘వైకింగ్ రో’ (Viking Row) సంప్రదాయ వేడుకలో ఓడెగార్డ్ పాల్గొన‌గా.. స్టేడియంలోని నార్వే అభిమానుల భారీ స్పంద‌న ల‌భించింది. వరుసగా రెండు విజయాలతో ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన కనబర్చిన నార్వే జట్టు ప్రస్తుతం పూర్తి ఆత్మవిశ్వాసంతో టోర్నీలో ముందుకు సాగుతోంది. స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ గోల్స్ వర్షం కురిపిస్తుండగా.. ఓడెగార్డ్ నాయకత్వం జట్టుకు మరింత బ‌లాన్ని ఇచ్చిన‌ట్ల‌య్యింది. నాకౌట్ బెర్త్ ఖరారైన ఆనందంలో ఆటగాళ్లు అభిమానులతో కలిసి చేసిన ‘వైకింగ్ రో’ వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రపంచకప్‌లో కొత్త సంచలనంగా నిలిచిన నార్వే.. ఇప్పుడు గ్రూప్ అగ్రస్థానం కోసం ఫ్రాన్స్‌తో జరిగే కీలక పోరుకు సిద్ధమవుతోంది.

ఏమిటి ‘వైకింగ్ రో’ అంటే..

నార్వే ఫుట్‌బాల్ అభిమానుల ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన సంప్రదాయ వేడుకే ‘వైకింగ్ రో. ప్రాచీన కాలంలో సముద్రాలను శాసించిన వైకింగ్ యోధుల వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఈ వేడుకను నిర్వహిస్తారు. వైకింగ్ ఓడల్లో తెడ్లు వేస్తూ ముందుకు సాగే కదలికలను అనుకరిస్తూ ఆటగాళ్లు, అభిమానులు ఒకే తీరులో కూర్చొని చేతులు ఊపడం ఈ సంబరాల ప్రత్యేకత. అంతర్జాతీయ టోర్నమెంట్లలో నార్వే జట్టు విజయాలు సాధించినప్పుడు, కీల‌క టోర్నీల్లో త‌ర్వాతి రౌండ్‌కు అర్హ‌త సాధించిన స‌మ‌యంలో ఈ సంప్రదాయం క‌ల‌ను అనుక‌రిస్తారు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు అభిమానుల ముందు వరుసగా కూర్చొని, వైకింగ్ పడవలో ప్రయాణిస్తున్నట్లుగా రోయింగ్ కదలికలు చేస్తారు. దీన్ని అభిమానులు డ్రమ్‌ల మోత, నినాదాలతో మరింత ఉత్సాహభరితంగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తారు. సెనెగల్‌పై 3-2 విజయం సాధించి ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకున్న తర్వాత కెప్టెన్ మార్టిన్ ఓడెగార్డ్ నాయ‌క‌త్వంలో నార్వే ఆటగాళ్లు చేసిన ‘వైకింగ్ రో’ వేడుక మరోసారి ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం సంబరం మాత్రమే కాకుండా, నార్వే చరిత్ర, సంస్కృతి, జాతీయ గర్వానికి ప్రతీకగా భావిస్తున్నారు.

ప్రపంచకప్‌లో నార్వే చరిత్ర..

ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే కొత్త చరిత్ర సృష్టించింది. గ్రూప్-ఐలో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సెనెగల్‌ను 3-2 తేడాతో ఓడించిన నార్వే, ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఘనతను అందుకుంది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో నార్వే పెద్ద‌గా రాణించ‌లేక‌పోయింది. 1938లో ఆడిన తొలి ప్రపంచకప్‌లో ఓటమితో నిష్క్రమించిన నార్వే.. 1994 ప్రపంచకప్‌లో ఒక విజయం, ఒక డ్రా, ఒక ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. 1998 టోర్నీలోనూ ఒక విజయం, రెండు డ్రాలుల‌తో టోర్నీని వీడింది. ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌లో మాత్రం ఆ జట్టు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఇరాక్‌పై విజయం సాధించిన నార్వే, తాజాగా సెనెగల్‌ను కూడా ఓడించి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో నాకౌట్ దశకు అర్హత సాధించడమే కాకుండా గ్రూప్ అగ్రస్థానంపై కూడా కన్నేసింది. టీమ్‌లో స్టార్ స్ట్రైక‌ర్ ఎర్లింగ్ హాలాండ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డ‌బుల్ గోల్స్ సాధించి.. గోల్డెన్ బూట్ రేస్ దిశ‌గా సాగుతున్నాడు.

Advertisement
Advertisement