త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | కేఎల్ రాహుల్ విధ్వంసం.. 152 ర‌న్స్ చేసిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్.. పంజాబ్ టార్గెట్ 265..!

కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. నితీష్ రాణాతో కలిసి 220 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పంజాబ్‌కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

P

Sports | Published On Apr 25, 2026, 5.45 pm IST

IPL 2026 | కేఎల్ రాహుల్ విధ్వంసం.. 152 ర‌న్స్ చేసిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్.. పంజాబ్ టార్గెట్ 265..!
Advertisement

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా శ‌నివారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట‌ర్స్ విరుచుకుప‌డ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 264 ప‌రుగులు చేసింది. పంజాబ్‌కు 265 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. మ్యాచ్‌లో బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 67 బంతుల్లోనే 16 ఫోర్లు, తొమ్మిది సిక్స‌ర్ల స‌హాయంతో అజేయంగా 152 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌కు కేఎల్ రాహుల్ ఇది ఆరో సెంచ‌రీ.

ఐపీఎల్‌లో ఇదే మూడో అత్య‌ధిక స్కోర్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఇదే మూడో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ కావ‌డం విశేషం. గ‌తంలో మాస్ కా బాస్ క్రిస్ గేల్ (బెంగ‌ళూరు) 2013 పుణే వారియ‌ర్స్ జ‌ట్టుపై అజేయంగా 175 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆ త‌ర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ ఉన్నాడు. 2008లో కేకేఆర్ త‌ర‌ఫు ఆడుతూ.. బెంగ‌ళూరుపై 158 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ తొలి సీజ‌న్‌లో మెక్‌క‌ల్ల‌మ్ ఈ ఘ‌న‌త సాధించాడు. తాజాగా కేఎల్ రాహుల్ మూడోస్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శ‌ర్మ ఉన్నాడు. గ‌తేడాది పంజాబ్ కింగ్స్‌పై 141 ప‌రుగులు చేశాడు.

ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో నితీశ్ రాణా కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేసి సెంచరీకి దగ్గరలోనే ఔటయ్యాడు. జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. రాహుల్–రాణా జోడీ రెండో వికెట్‌కు 220 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి పంజాబ్ బౌలర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ఈ భాగస్వామ్యమే ఢిల్లీకి భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో పాథుమ్ నిస్సంక‌తో క‌లిసి రాహుల్ ఓపెనింగ్స్‌కు దిగ‌గా.. రాహుల్–రాణా జోడీ మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపుకు తిప్పుకుంది.

Advertisement
Advertisement