త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ఎట్ట‌కేల‌కు కోల్‌క‌తాకు తొలి విజ‌యం.. హాఫ్ సెంచ‌రీతో రాణించిన రింకు.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపు

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 సీజ‌న్‌లో ఎట్ట‌కేల‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు తొలి విజ‌యం ద‌క్కింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈడెన్‌గార్డెన్స్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్దేశించిన 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌రో రెండు బంతులు ఉండ‌గానే 161 ప‌రుగులు చేసి గెలుపొందింది.

P

Sports | Published On Apr 19, 2026, 7.41 pm IST

IPL 2026 | ఎట్ట‌కేల‌కు కోల్‌క‌తాకు తొలి విజ‌యం.. హాఫ్ సెంచ‌రీతో రాణించిన రింకు.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపు
Advertisement

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 సీజ‌న్‌లో ఎట్ట‌కేల‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు తొలి విజ‌యం ద‌క్కింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈడెన్‌గార్డెన్స్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్దేశించిన 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌రో రెండు బంతులు ఉండ‌గానే 161 ప‌రుగులు చేసి గెలుపొందింది. అంత‌కు ముందు టాస్ గెలిచిన రాజ‌స్థాన్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. కేకేఆర్ స్పిన్ ద్వ‌యం వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఒక దశలో బలంగా కనిపించిన 155 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (39), వైభవ్ సూర్యవంశీ (46) మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 81 పరుగుల భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు. సూర్యవంశీ అవుట్ అయ్యాక ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో రాజస్థాన్ బ్యాటింగ్ క్రమంగా ఒత్తిడిలో పడింది. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను పూర్తిగా కష్టాల్లోకి నెట్టాడు. ఒక దశలో 81/0గా ఉన్న రాజస్థాన్.. ఆ తర్వాత కేవలం 65 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. చివర్లో కార్తిక్ త్యాగి సైతం 3 వికెట్లతో ప్రభావం చూపడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. మిగతా బ్యాటర్లు ఎవరూ నిలదొక్కుకోలేకపోవడంతో జట్టు 155 పరుగులకే పరిమితమైంది.

రింకు సింగ్ పోరాటంతో..

రాజ‌స్థాన్ నిర్దేశించిన 156 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్లు టిమ్ సీఫెర్ట్‌, కెప్టెన్ అజింక్యా ర‌హానే ఇద్ద‌రూ ఖాతా తెరువ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరారు. ఆ త‌ర్వాత ర‌ఘువంశీతో క‌లిసి కామెరాన్ గ్రీన్ (22) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌య‌త్నించాడు. వేగంగా ఆడే క్ర‌మంలో వికెట్ ప‌డింది. అనంత‌రం ర‌ఘువంశీ (10) సైతం త‌క్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. 52 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న జ‌ట్టును రింకు సింగ్ హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. రోమెన్‌పావెల్ (23)తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగెత్తించాడు. పావెల్ అవుట్ అయినా అనుకుల్ రాయ్‌తో క‌లిసి ఏడో వికెట్‌కు 76 ప‌రుగులు జోడించి జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించాడు. రింకు సింగ్ రెండు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 53 ప‌రుగులు చేయ‌గా.. అనుకుల్ రాయ్ 16 బంతుల్లో రెండు సిక్స‌ర్లు, ఒక ఫోర్ స‌హాయంతో 29 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజాకు రెండు వికెట్లు, జోప్రా ఆర్చ‌ర్‌, బ‌ర్గ‌ర్‌, ర‌వి బిష్ణోయ్‌, య‌శ్‌రాజ్ పుంజాకు త‌లా ఒక వికెట్ ద‌క్కింది. ఈ విజ‌యంతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మూడు పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక తొమ్మిది స్థానానికి చేరింది. రాజ‌స్థాన్‌కు ఇది రెండో ఓట‌మి కాగా.. ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు విజ‌యాలు.. రెండు ఓట‌ముల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడోస్థానంలో ఉంది.

Advertisement
Advertisement