త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA 2026 | బ్రెజిల్‌ చేతిలో ఓటమి.. తలవంచి అభిమానులకు క్షమాపణలు చెప్పిన జపాన్‌ కోచ్‌ హజిమే

P

Sports | Published On Jun 30, 2026, 8.23 am IST

FIFA 2026 | బ్రెజిల్‌ చేతిలో ఓటమి.. తలవంచి అభిమానులకు క్షమాపణలు చెప్పిన జపాన్‌ కోచ్‌ హజిమే
Advertisement

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ 2026లో జపాన్ ప్రయాణం హృదయవిదారకంగా ముగిసింది. రౌండ్ ఆఫ్-32లో బ్రెజిల్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 2-1తో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ హెడ్‌ కోచ్ హజిమే మోరియాసు, ఆటగాళ్లు అభిమానులకు క్షమాపణలు చెప్పిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల మనసులను హత్తుకున్నాయి. మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే.. తొలుత కైషు సానో గోల్‌తో జపాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగంలో సమష్టి ఆటతో బ్రెజిల్‌ను కట్టడి చేసిన జపాన్.. గెలుపు దిశగా అడుగులు వేసింది. అయితే, ద్వితీయార్థంలో సీనియర్‌ కాసెమిరో హెడ్డర్‌తో సమం చేయగా.. అదనపు సమయం చివరి క్షణాల్లో గాబ్రియెల్ మార్టినెల్లి గోల్ చేయడంతో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ 2-1తో విజయాన్ని అందుకుని ప్రీక్వార్టర్స్‌ (రౌండ్ ఆఫ్-16)లోకి ప్రవేశించింది.

మ్యాచ్ ముగిసిన వెంటనే కోచ్ మోరియాసు ఆటగాళ్లందరినీ మైదానం మధ్యలో ఒకచోట చేర్చి భావోద్వేగ ప్రసంగం చేశారు. అనంతరం జట్టుతో కలిసి స్టేడియానికి వచ్చిన జపాన్ అభిమానుల వద్దకు వెళ్లారు. కంటతడి పెట్టుకున్న మోరియాసు అభిమానుల ముందు తలవంచి క్షమాపణలు చెప్పారు. ఆటగాళ్లందరూ అదే విధంగా తలవంచి క్షమాపణలు చెప్పారు. టోర్నీ మొత్తం జట్టుకు అండగా నిలిచిన అభిమానులు చప్పట్లతో ఆటగాళ్లను అభినందించారు. ఓటమి ఎదురైనా చివరి వరకు పోరాడిన జపాన్ జట్టుపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రశ్రేణి జట్టైన బ్రెజిల్‌ను జపాన్ చాలా సేపు నిలువరించింది. కట్టుదిట్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా ఆడిన జపాన్.. తొలి అర్ధభాగంలో సానో గోల్‌తో ఆధిక్యం సాధించింది. కానీ ద్వితీయార్థంలో కాసెమిరో సమం చేయడంతో మ్యాచ్ ఉత్కంఠకు చేరుకుంది. అదనపు సమయం ఖాయమవుతుందనుకున్న తరుణంలో ఇంజ్యూరీ టైమ్‌ ఐదో నిమిషంలో మార్టినెల్లి అద్భుతమైన గోల్‌తో బ్రెజిల్‌కు విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్ నాకౌట్ దశలో తొలి విజయాన్ని నమోదు చేయాలన్న జపాన్ కల మరోసారి నెరవేరకుండా పోయింది. ఓటమి బాధ ఉన్నప్పటికీ అభిమానులకు క్షమాపణలు చెప్పడంతో పాటు ధన్యవాదాలు తెలుపుతూ క్రీడాస్ఫూర్తిని ప్రపంచానికి చాటింది. ఫలితం తమకు అనుకూలంగా రాకపోయినా.. ప్రత్యర్థిని చివరి వరకు ధైర్యంగా ఎదుర్కొన్న తీరు, మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు ప్రదర్శించిన వినమ్రత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Advertisement
Advertisement