త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran vs Belgium | బెల్జియాన్ని నిలువరించిన ఇరాన్..

Iran vs Belgium | ఫిఫా ప్రపంచకప్-2026లో మ‌రో కీల‌క మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. గ్రూప్-జీ మ్యాచ్‌లో బలమైన బెల్జియాన్ని గోల్స్ చేయ‌కుండా నిలువ‌రించి నాకౌట్ అవ‌కాశాల‌ను పెంచుకుంది. మ్యాచ్ మొత్తం బెల్జియం ఆధిప్యం చూపినా.. ఇరాన్ గోల్‌కీపర్ అలిరెజా బీరన్‌వాండ్ అద్భుతంగా అడ్డుకొని జ‌ట్టుకు కీల‌క‌మైన పాయింట్‌ను అందించాడు.

P

Sports | Published On Jun 22, 2026, 10.24 am IST

Iran vs Belgium | బెల్జియాన్ని నిలువరించిన ఇరాన్..
Advertisement
  • గోల్‌కీప‌ర్ అలిరెజా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌
  • సేవ్స్‌తో జ‌ట్టును కాపాడిన బీర‌న్‌వాండ్‌
  • 0-0 తేడాతో మ్యాచ్ డ్రా

Iran vs Belgium | ఫిఫా ప్రపంచకప్-2026లో మ‌రో కీల‌క మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. గ్రూప్-జీ మ్యాచ్‌లో బలమైన బెల్జియాన్ని గోల్స్ చేయ‌కుండా నిలువ‌రించి నాకౌట్ అవ‌కాశాల‌ను పెంచుకుంది. మ్యాచ్ మొత్తం బెల్జియం ఆధిప్యం చూపినా.. ఇరాన్ గోల్‌కీపర్ అలిరెజా బీరన్‌వాండ్ అద్భుతంగా అడ్డుకొని జ‌ట్టుకు కీల‌క‌మైన పాయింట్‌ను అందించాడు. లాస్ ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో ఇరాన్ జాతీయ గీతం సందర్భంగా ప్రేక్షకుల నుంచి వ్యతిరేక నినాదాలు వినిపించాయి. అయితే, మ్యాచ్ ముగిసే సమయానికి మాత్రం స్టేడియం అంతా ఇరాన్ పేరుతో మార్మోగింది. అందుకు ప్రధాన కారణం బీరన్‌వాండ్ ప్రదర్శనే.

గోల్ సాధించ‌డంలో విఫ‌లం..

మ్యాచ్‌లో బెల్జియం 22 ప్ర‌య‌త్నాలు చేయ‌గా.. ఇందులో ఏడుసార్లు మాత్ర‌మే బంతి గోల్‌పోస్ట్ వైపు వెళ్లింది. బంతి ఎక్కువసేపు బెల్జియం నియంత్ర‌ణ‌లో ఉంది. అయినా గోల్ సాధించడంలో రెడ్ డెవిల్స్ పూర్తిగా విఫలమయ్యారు. బీరన్‌వాండ్‌తో పాటు డిఫెన్స్ ఇరాన్ జ‌ట్టుకు గోడలా నిలవడంతో బెల్జియం ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ఇరాన్ ఫుట్‌బాల్‌లో ఇప్పటికే హీరోగా గుర్తింపు పొందిన బీరన్‌వాండ్.. 2018 ప్రపంచకప్‌లో క్రిస్టియానో రొనాల్డో పెనాల్టీని అడ్డుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇది ఇరాన్ ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో ప్ర‌త్యేకంగా నిలిచింది. దీని ఆధారంగా చేసుకుని రెండు టెలివిజన్ సిరీస్‌లు సైతం రూపొందించ‌డం విశేషం.

బెల్జియం దూకుడు..

మ్యాచ్ ఆరంభం నుంచే బెల్జియం దూకుడుగా ఆడింది. కెవిన్ డీ బ్రుయ్నే ఇచ్చిన క్రాస్‌ను అడ్డుకునే ప్రయత్నంలో రొమెలు లుకాకు బీరన్‌వాండ్‌ను ఢీకొట్టాడు. అయినా ఇరాన్ గోల్‌కీపర్ తేరుకుని తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. 10వ నిమిషంలో మరో కీలక సేవ్ చేసి జట్టును కాపాడాడు. ఇరాన్ కేవలం డిఫెన్స్‌కే ప‌రిమితం కాకుండా.. 14వ నిమిషంలో హొస్సేన్ కనానిజాదెగాన్ కొట్టిన షాట్‌ను అడ్డుకునేందుకు బెల్జియం గోల్‌కీపర్ థిబాట్ కుర్టువా శ్రమించాల్సి వచ్చింది. 26వ నిమిషంలో మెహ్దీ తరేమీ అద్భుత ఫ్రీకిక్ వ్యూహాన్ని గోల్‌గా మలిచినట్లు కనిపించినా.. రిఫరీ ఆ గోల్‌ను అనుమతించకపోవడంతో ఇరాన్ ఆధిక్యం సాధించే అవకాశం చేజారింది. రెండో అర్ధభాగంలో కూడా బెల్జియం వరుస వ‌చ్చినా గోల్‌గా మ‌ల‌చ‌లేక‌పోయింది. ఒక దశలో కెవిన్ డి బ్రుయ్నే ఇచ్చిన అద్భుతమైన బంతితో ఇరాన్ పెనాల్టీ బాక్స్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. వరుసగా వచ్చిన మూడు ప్రయత్నాలను ఇరాన్ ఆటగాళ్లు అడ్డుకోగా.. చివరకు బీరన్‌వాండ్ బంతిని తన ఆధీనంలోకి తీసుకుని ప్రమాదాన్ని తప్పించాడు. మ్యాచ్‌లోనే ఇదే హైలెట్‌. విజయం కోసం బెల్జియం కోచ్ తిమోతి కస్టాన్యే.. డోడి లుకెబాకియో, హాన్స్ వనాకెన్‌లను రంగంలోకి దింపాడు. అయితే, జట్టు పుంజుకుంటున్న సమయంలో నాథన్ ఎన్‌గోయ్ రెడ్ కార్డు కారణంగా మైదానం వీడాల్సి వ‌చ్చింది. ఇదే బెల్జియం జ‌ట్టుకు ఎదురుదెబ్బ‌.

ప‌ది మందితోనే..

పది మంది ఆటగాళ్లతో మిగిలినా బెల్జియం ఇరాన్‌పై ఎటాకింగ్‌కు దిగింది. బీరన్‌వాండ్ మరోసారి అద్భుత సేవ్‌లు చేస్తూ క్లీన్ షీట్‌ను కాపాడుకున్నాడు. ఇరాన్ డిఫెన్స్ క్రమశిక్షణతో ఆడి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వలేదు. మరోవైపు బెల్జియం ఎటాకింగ్ మరోసారి నిరాశపరిచింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రమాదకర జట్లలో ఒకటిగా పేరొందిన బెల్జియం.. గోల్స్ సాధించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రొమెలు లుకాకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోగా.. కెవిన్ డి బ్రుయ్నే నిరాశ ప‌రిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచకప్‌లో బెల్జియం చివరిసారిగా 2022లో కెనడాపై మిచీ బట్షువాయి చేసిన గోల్ ద్వారానే స్కోర్ చేసింది. అప్పటి నుంచి ప్రపంచకప్ వేదికపై 69 షాట్లు కొట్టినా ఒక్కటి కూడా గోల్‌గా మారలేదు. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ విలువైన డ్రాతో నాకౌట్ రేసులో నిలిచింది.

Advertisement
Advertisement