త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Muzarabani | ఐపీఎప్‌లోకి జింబాబ్వే పేసర్‌.. ముస్తాఫిజుర్‌ స్థానంలో ముజరబాని..!

Muzarabani | ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానిని జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

P

Sports | Published On Mar 13, 2026, 8.40 pm IST

Muzarabani | ఐపీఎప్‌లోకి జింబాబ్వే పేసర్‌.. ముస్తాఫిజుర్‌ స్థానంలో ముజరబాని..!
Advertisement

Muzarabani | ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానిని జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్‌లో ఆడేందుకు నిర్ణయించుకున్న కారణంగా ముజరబాని పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడలేనని సమాచారం. ఈ నిర్ణయాన్ని ఇస్లామాబాద్ ఫ్రాంచైజీకి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. కేకేఆర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బేస్‌ప్రైజ్‌ రూ.2కోట్లు కాగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడి చివరకు రూ.9.20 కోట్లకు కేకే దక్కించుకుంది. అయితే, ఈ నిర్ణయంపై పలు వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌కి సైతం విమర్శలు తప్పలేదు.

2016 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న ముస్తాఫిజూర్ రహ్మాన్ ఎనిమిది సీజన్లలో పాల్గొన్నాడు. 2019, 2020 సీజన్లలో మాత్రమే టోర్నీకి దూరమయ్యారు. ఈ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మూడు సార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ మొదట ఆయనను జట్టులో చేర్చుకున్నప్పటికీ, బీసీసీఐ సూచనల మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గత ఏడాది మినీ వేలంలో ముస్తాఫిజూర్‌ను కేకేఆర్ దక్కించుకోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ జోక్యం చేసుకొని ఆయనను విడుదల చేయాలని సూచించింది. అనంతరం ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం కేకేఆర్‌కు ఇచ్చింది. దీంతో జింబాబ్వే పేసర్ ముజరబానిని జట్టు ఎంపిక చేసింది.

ఇంతకుముందు ముజరబాని పీఎస్ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 11న జరిగిన పీఎస్ఎల్ వేలంలో అమ్ముడుపోకపోయిన ఆయనను తర్వాత వెస్టిండీస్ పేసర్ షమార్ జోసెఫ్‌కు బదులుగా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు తీసుకుంది. అయితే, కేకేఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఐపీఎల్‌లోనే ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా ముజరబాని నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. గత ఏడాది లుంగీ ఎన్గిడి గాయపడడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ప్రత్యామ్నాయంగా చేరినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 29 ఏళ్ల ముజరబాని మార్చి 17న కోల్‌కతాకు చేరుకునే అవకాశం ఉంది.

https://x.com/KKRiders/status/2032449155931779305

Advertisement
Advertisement