త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | ఆర్‌సీబీ వుమెన్స్‌కు వ‌రుస‌గా నాలుగో విజ‌యం.. నిరాశ‌లో క్యాపిటల్స్‌..

WPL 2026 | వుమెన్స్‌ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానా అద్భుతమైన అర్ధసెంచరీతో జట్టును ముందుండి నడిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

S

Sports | Published On Jan 18, 2026, 7.10 am IST

WPL 2026 | ఆర్‌సీబీ వుమెన్స్‌కు వ‌రుస‌గా నాలుగో విజ‌యం.. నిరాశ‌లో క్యాపిటల్స్‌..
Advertisement

WPL 2026 | వుమెన్స్‌ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానా అద్భుతమైన అర్ధసెంచరీతో జట్టును ముందుండి నడిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో WPL పాయింట్ల పట్టికలో RCB అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌ల్లో 3 ఓటములతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే త‌డ‌బ‌డింది. లిజెల్ లీ, లారా వోల్వార్ట్‌ తొలి ఓవర్‌లోనే ఔటవడంతో జట్టుపై ఒత్తిడి పడింది. ఆ తర్వాత కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, నికీ ప్రసాద్, మిన్ను మణి కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 8.1 ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 74/6గా మారింది.

మంధానా దూకుడు..

ఈ దశలో ష‌ఫాలి వర్మ ఒంటరి పోరాటం చేసింది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 41 బంతుల్లో 62 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించింది. నికీ ప్రసాద్‌తో కలిసి 59 పరుగుల భాగస్వామ్యం, స్నేహ్ రాణాతో 34 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును నిలబెట్టింది. చివరికి లారెన్ బెల్ బౌలింగ్‌లో ఔటైన ష‌ఫాలి ఇన్నింగ్స్ ముగిసే సరికి ఢిల్లీ 166 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో లూసీ హామిల్టన్ ( 19 బంతుల్లో 36 పరుగులు) వేగంగా ఆడింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCBకి శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న గ్రేస్ హారిస్ మూడో ఓవర్‌లోనే ఔటైంది. కానీ ఆ తర్వాత స్మృతి మంధానా, జార్జియా వోల్ కలిసి మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపుకు తిప్పారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 142 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంధానా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 61 బంతుల్లో 96 పరుగులు (13 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించింది. శతకానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఉండగా, నందిని శర్మ బౌలింగ్‌లో లూసీ హామిల్టన్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఆమె ఔటైంది.

ఇంకోవైపు జార్జియా వోల్ తొలుత నిదానంగా ఆడి, తర్వాత వేగం పెంచి 42 బంతుల్లో 54 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచింది. ఈ క్ర‌మంలో ఆర్‌సీబీ జ‌ట్టు 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని 10 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ష‌ఫాలి వర్మ పోరాటం చేసినప్పటికీ, స్మృతి మంధానా అద్భుత ఇన్నింగ్స్ ముందు అది మసకబారింది. మంధానా నాయకత్వంలో ఆర్‌సీబీ అద్భుత ఫామ్‌లో కొనసాగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం వెనుక‌బ‌డింది.

Advertisement

తాజావార్తలు

Advertisement