త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బాయ్‌కాట్ ఎఫెక్ట్‌.. బంగ్లాపై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు..?

ICC | త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న 2026 టీ20 ప్రపంచకప్‌కు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా స్పష్టం చేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వైఖరిపై ఐసీసీ తీవ్ర అసంతృప్తితో ఉందని, అవసరమైతే శిక్షా చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

S

Sports | Published On Jan 24, 2026, 8.51 am IST

ICC | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బాయ్‌కాట్ ఎఫెక్ట్‌.. బంగ్లాపై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు..?
Advertisement

ICC | త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న 2026 టీ20 ప్రపంచకప్‌కు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా స్పష్టం చేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వైఖరిపై ఐసీసీ తీవ్ర అసంతృప్తితో ఉందని, అవసరమైతే శిక్షా చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజూర్ రెహ్మాన్‌ను అనూహ్యంగా తొలగించడంతో బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో భద్రతా పరిస్థితులు అనుకూలంగా లేవని సాకులు చూపుతూ తమ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరింది. అయితే ఐసీసీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. భారత్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి తీవ్రమైన భద్రతా ముప్పు లేదని స్వతంత్ర సంస్థల నివేదికల ఆధారంగా ఐసీసీ తేల్చి చెప్పింది.

బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ, తమ జట్టు ప్రపంచకప్ ఆడాలని కోరుకుంటోందని, అయితే ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు మారే వరకు భారత్‌కు వెళ్లే అంశంపై పునరాలోచన చేయబోమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ లాంటి ప్రధాన టోర్నమెంట్ నుంచి ఏ దేశమైనా తప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జై షా ప్రస్తుతం దుబాయ్‌లో కీలక సమావేశాలు నిర్వహిస్తూ, బంగ్లాదేశ్ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బంగ్లాదేశ్ అధికారికంగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, జరిమానాలు, ఐసీసీ ఈవెంట్లలో నిషేధం లేదా పాయింట్ల కోత వంటి శిక్షలు విధించే అవకాశముందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ వివాదం అంతర్జాతీయ క్రికెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మ‌రి ఇప్ప‌టికైనా బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేక ఐసీసీ కఠిన చర్యలకు దిగుతుందా? అన్నది మ‌రో రెండు మూడు రోజుల్లో తేల‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement