త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brazil Vs Haiti | బ్రెజిల్‌కు తొలి విజయం.. హైతీపై 3-0 తేడాతో గెలుపు

Brazil Vs Haiti | ఫిఫా ప్రపంచకప్ 2026లో బ్రెజిల్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. మాథ్యూస్ కున్హా డబుల్‌ గోల్‌, వినీషియస్ జూనియర్ గోల్‌తో హైతీపై 3-0 తేడాతో విజయం సాధించిన బ్రెజిల్ గ్రూప్-సీలో అగ్రస్థానానికి చేరుకుంది. వరుసగా రెండో ఓటమి చవిచూసిన హైతీ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.

P

Sports | Published On Jun 20, 2026, 8.52 am IST

Brazil Vs Haiti | బ్రెజిల్‌కు తొలి విజయం.. హైతీపై 3-0 తేడాతో గెలుపు
Advertisement
  • ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా హైతీ
  • మాథ్యూస్‌ కున్హా డబుల్‌ గోల్‌
  • వినీషియస్‌ జూనియర్‌ మరో గోల్‌

Brazil Vs Haiti | ఫిఫా ప్రపంచకప్ 2026లో బ్రెజిల్ తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఫిలడెల్ఫియా వేదికగా జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‌లో హైతీని 3-0 తేడాతో చిత్తు చేసింది. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మాథ్యూస్ కున్హా రెండు గోల్స్ చేయగా, వినీషియస్ జూనియర్ మరో గోల్‌తో మెరిశాడు. తొలి మ్యాచ్‌లో మొరాకోతో 1-1తో డ్రా అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ బ్రెజిల్‌కు కీలకంగా మారింది. ఆ ఒత్తిడిని తట్టుకొని ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రెజిల్‌ ఫస్ట్‌ హాప్‌లో మూడు గోల్స్‌ వేసి మ్యాచ్‌ను తన వైపు తిప్పుకుంది. ఈ విజయంతో బ్రెజిల్ నాలుగు పాయింట్లతో మొరాకో సరసన నిలిచినా.. మెరుగైన గోల్ తేడాతో గ్రూప్-సీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు వరుసగా రెండో ఓటమి చవిచూసిన హైతీ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. మ్యాచ్‌ 23వ నిమిషంలో బ్రెజిల్ ఖాతా తెరిచింది. వినీషియస్ జూనియర్ కొట్టిన షాట్‌ను హైతీ గోల్‌కీపర్ జానీ ప్లాసిడ్ అడ్డుకున్నప్పటికీ.. డిఫెండర్ హానెస్ డెల్‌క్రోయిక్స్ క్లియర్ చేసే ప్రయత్నంలో బంతి కున్హాను తాకి గోల్‌లైన్ దాటింది.

దీంతో బ్రెజిల్‌కు 1-0 ఆధిక్యం లభించింది. ఈ గోల్‌తో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బ్రెజిల్‌ అటాక్‌ను మరింత ముమ్మరం చేసింది. 36వ నిమిషంలో వినీషియస్ అందించిన అద్భుతమైన త్రూ బాల్‌ను అందుకున్న కున్హా వేగంగా ముందుకు దూసుకెళ్లి బలమైన షాట్‌తో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపగా.. బ్రెజిల్ ఆధిక్యం 2-0కి పెరిగింది. ఇంజ్యూరీ టైమ్‌లో బ్రెజిల్ మూడో గోల్ సాధించింది. లూకాస్ పాక్వెటా ఇచ్చిన అద్భుతమైన లాంగ్ పాస్‌ను అందుకున్న వినీషియస్ జూనియర్ బంతిని నియంత్రించి ప్రశాంతంగా గోల్‌గా మలిచాడు. దీంతో హాఫ్‌టైమ్ సమయానికి బ్రెజిల్ 3-0తో పటిష్ట ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో కోచ్ కార్లో అన్సెలోట్టి వ్యూహాలకు అనుగుణంగా బంతిపై ఆధిపత్యం కొనసాగించినా.. మరిన్ని అవకాశాలను గోల్స్‌గా మలచలేకపోయింది. హైతీ నుంచి చివరకు మ్యాచ్‌ను కాపాడుకుంది. అయితే, రెండో అర్ధభాగంలో హైతీ మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. 4-4-2 ఫార్మేషన్‌కు మారిన తర్వాత మధ్యమైదానంలో కొంత ఆధిపత్యం సాధించిన హైతీ.. బ్రెజిల్‌ను గోల్స్ చేయకుండా అడ్డుకోగలిగింది. అయితే, మ్యాచ్ ఫలితాన్ని మార్చేలా ప్రభావం చూపలేకపోయింది. గ్రూప్‌ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌ను స్కాట్లాండ్‌తో బ్రెజిల్‌ తలపడనుంది.

Advertisement
Advertisement