త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asian Games 2026 | అథ్లెటిక్స్‌లో ఒకే రోజు భారత్‌కు ఐదు పతకాలు

Asian Games 2026 | ఆసియా క్రీడలు–2026లో అథ్లెటిక్స్‌లో ఆదివారం భారత్‌ అదరగొట్టింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లలో ఏకంగా ఐదు పతకాలు సాధించింది. హరీతా భద్ర మహిళల 200 మీటర్లలో కాంస్యం గెలవగా.. తేజస్విన్‌ శంకర్‌ డెకాథ్లాన్‌లో కాంస్యం సాధించాడు.

P

Sports | Published On Sep 27, 2026, 7.47 pm IST

Asian Games 2026 | అథ్లెటిక్స్‌లో ఒకే రోజు భారత్‌కు ఐదు పతకాలు
Advertisement

Asian Games 2026 | ఆసియా క్రీడలు–2026లో అథ్లెటిక్స్‌లో ఆదివారం భారత్‌ అదరగొట్టింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లలో ఏకంగా ఐదు పతకాలు సాధించింది. హరీతా భద్ర మహిళల 200 మీటర్లలో కాంస్యం గెలవగా.. తేజస్విన్‌ శంకర్‌ డెకాథ్లాన్‌లో కాంస్యం సాధించాడు. పారుల్‌ చౌదరి 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల లాంగ్‌జంప్‌లో యాన్సీ సోజన్‌ రజతం, పురుషుల హైజంప్‌లో సర్వేశ్‌ కుషారే రజత పతకాలు అందుకున్నారు.

200 మీటర్లలో హరీతాకు కాంస్యం..

మహిళల 200 మీటర్లలో హరీతా భద్ర 23.20 సెకన్లలో రేసును ముగించి కాంస్య పతకం గెలిచింది. జపాన్‌ అథ్లెట్‌ను కేవలం 0.01 సెకన్ల తేడాతో వెనక్కి నెట్టింది. సింగపూర్‌కు చెందిన వెరోనికా శాంతి పెరెరా (22.78 సె) స్వర్ణం, చైనాకు చెందిన చెన్‌ యుజీ (22.93 సె.) రజతం సాధించారు. మరో భారత అథ్లెట్‌ ఉన్నతి అయ్యప్ప బోలాండ్‌ 23.46 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచింది. మహిళల 200 మీటర్లలో భారత్‌కు పతకం దక్కి చాలా కాలమైంది. 2018 ఆసియా క్రీడల్లో ద్యూతీ చంద్‌ కాంస్యం గెలిచిన తర్వాత ఈ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. 23 ఏళ్ల హరీతా ఆసియా క్రీడలకు ముందు జరిగిన 65వ నేషనల్‌ ఇంటర్‌-స్టేట్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 23.14 సెకన్లతో వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేసి జాతీయ టైటిల్‌ సాధించింది.

వరుసగా రెండోసారి తేజస్విన్‌కు పతకం

పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సాధించాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ కఠినమైన ఈవెంట్‌లో మొత్తం 7,934 పాయింట్లు సాధించాడు. తొలి రోజు 100 మీటర్లు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, హైజంప్‌, 400 మీటర్ల తర్వాత 4,338 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో రోజు పోటీ తీవ్రంగా సాగినా.. చివరి ఈవెంట్‌ 1500 మీటర్లను 4:33.09లో పూర్తి చేసి కాంస్యం ఖాయం చేసుకున్నాడు. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్‌లో రజతం గెలిచిన తేజస్విన్‌కు ఇది వరుసగా రెండో ఆసియా క్రీడల పతకం.

లాంగ్‌జంప్‌లో యాన్సీకి రజతం

మహిళల లాంగ్‌జంప్‌లో యాన్సీ సోజన్‌ 6.53 మీటర్ల అత్యుత్తమ జంప్‌తో రజత పతకం గెలిచింది. పోటీలో ఎక్కువసేపు ఆధిక్యంలో ఉన్న యాన్సీకి చివరి ప్రయత్నంలో చైనాకు చెందిన హువాంగ్‌ యింగ్‌యింగ్‌ షాక్‌ ఇచ్చింది. హువాంగ్‌ 6.55 మీటర్లు దూకి స్వర్ణం సాధించింది. దీంతో యాన్సీ కేవలం రెండు సెంటీమీటర్ల తేడాతో రజతానికి పరిమితమైంది. ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన షైలీ సింగ్‌ 6.42 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన టాన్‌ మెంగ్యీ 6.46 మీటర్లతో కాంస్యం సాధించింది.

స్టీపుల్‌చేజ్‌లో పారుల్‌కు కాంస్యం

మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్‌ చౌదరి 9:08.67 సెకన్లలో రేసు పూర్తి చేసి కాంస్యం సాధించింది. ఇది ఆమె వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్‌ యావి (9:04.36) స్వర్ణం, కజకిస్థాన్‌కు చెందిన నోరా జెరుటో తనుయి (9:06.82) రజతం గెలిచారు. మరో భారత అథ్లెట్‌ అంకిత కూడా ఆకట్టుకుంది. 9:19.24 సెకన్లతో నాలుగో స్థానంలో నిలిచి వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేసింది.

హైజంప్‌లో సర్వేశ్‌కు రజతం

వర్షం మధ్య జరిగిన పురుషుల హైజంప్‌లో సర్వేశ్‌ కుషారే 2.25 మీటర్ల ఎత్తును అధిగమించి రజత పతకం గెలిచాడు. చైనీస్‌ తైపీకి చెందిన చావో‌ షువాన్‌-ఫు కూడా 2.25 మీటర్లు దూకాడు. అయితే అతను ఈ ఎత్తును తొలి ప్రయత్నంలోనే అందుకోగా.. సర్వేశ్‌ రెండో ప్రయత్నంలో అధిగమించాడు. దీంతో స్వర్ణం చావోకు, రజతం సర్వేశ్‌కు దక్కింది.

200 మీటర్లలో అనిమేశ్‌కు ఐదో స్థానం

పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్‌ అనిమేశ్‌ కుజుర్‌ 20.80 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచాడు. హీట్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరినప్పటికీ పతకం సాధించలేకపోయాడు. థాయ్‌లాండ్‌కు చెందిన పురిపోల్‌ బూన్‌సన్‌ 19.88 సెకన్లతో స్వర్ణం గెలిచాడు. 100 మీటర్లతో పాటు 200 మీటర్లలోనూ స్వర్ణం సాధించి స్ప్రింట్‌ డబుల్‌ పూర్తి చేశాడు.

4×100 మీటర్ల ఫైనల్‌కు భారత్‌..

మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత బృందం ఫైనల్‌కు చేరింది. అభినయ రాజరాజన్‌, స్నేహ శానువల్లి, శివంకర సుదేశ్న, తమన్నాలతో కూడిన భారత జట్టు హీట్‌-1లో 43.65 సెకన్ల సీజన్‌ బెస్ట్‌ టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా చైనా, థాయ్‌లాండ్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. సోమవారం సాయంత్రం 6.34 గంటలకు ఫైనల్‌ జరగనుంది.

Advertisement
Advertisement