త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake Notes | మార్కెట్లోకి 500 రూపాయల నకిలీ నోట్లొచ్చేశాయ్.. బీ కేర్ ఫుల్

Fake Notes | హైద‌రాబాద్ నగరంలో నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి కలకలం రేపుతోంది. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లతో చిన్న వ్యాపారులను మోసం చేస్తున్న ముఠా గుట్టును గోషామహల్‌ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి రూ.8 వేల విలువైన 16 నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

P

Hyderabad | Published On Sep 27, 2026, 8.47 pm IST

Fake Notes | మార్కెట్లోకి 500 రూపాయల నకిలీ నోట్లొచ్చేశాయ్.. బీ కేర్ ఫుల్
Advertisement

Fake Notes | హైద‌రాబాద్ నగరంలో నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి కలకలం రేపుతోంది. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లతో చిన్న వ్యాపారులను మోసం చేస్తున్న ముఠా గుట్టును గోషామహల్‌ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి రూ.8 వేల విలువైన 16 నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గోషామ‌హ‌ల్ మ‌హ‌ల్ సీఐ శ్రావ‌ణ్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ నెల 25న రాత్రి బేగం బజార్‌ ఛత్రీ ప్రాంతంలో ఏఎస్సై జనార్దన్‌ నాయక్‌, హెచ్‌సీ 3649 సంజయ్‌కుమార్‌ శర్మ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన విక్రమ్‌ (21)ను అదుపులోకి తీసుకుని విచారించారు. తనిఖీ చేయగా అతడి వద్ద 16 నకిలీ రూ.500 నోట్లు బయటపడ్డాయి.

ఒక్కో నోటుకు రూ.400 అసలు నగదు

విచారణలో విక్రమ్‌ నకిలీ నోట్లను చిన్న వ్యాపారులకు ఇచ్చి.. ఒక్కో నోటుకు రూ.400 చొప్పున అసలు నగదు తీసుకుంటున్నట్లు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ నోట్లను తన స్నేహితుడు అశోక్‌ వద్ద నుంచి తీసుకున్నట్లు చెప్పినట్లు పేర్కొన్నారు. విక్రమ్‌ బేగం బజార్‌లోని ఓ డెకరేషన్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడిని ఈ నెల 25న రాత్రి 11.30 గంటలకు అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. అశోక్‌తో పాటు మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ నోట్ల నెట్‌వర్క్‌ వెనుక ఉన్న వ్యక్తులు, వాటి సరఫరా మార్గాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రూ.500 నోట్లను స్వీకరించే సమయంలో వ్యాపారులు, వీధి వ్యాపారులు, దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలని గోషామహల్‌ పోలీసులు సూచించారు. రద్దీ సమయాల్లోనూ నోట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీసుకోవాలని కోరారు. నకిలీ నోట్లపై అనుమానం వస్తే వాటిని స్వీకరించవద్దని సూచించారు. ఎవరైనా నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తిస్తే.. వారితో వాగ్వాదానికి దిగకుండా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు లేదంటే డయల్‌-100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement