త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

White Dwarf | అరుదైన ఆవిష్కరణ.. ఆకుపచ్చ రంగులో మెరిసే నక్షత్రం!

White Dwarf | విశ్వంలో నక్షత్రాలు అంటే తెలుపు, నీలం, పసుపు, నారింజ రంగుల్లో కనిపిస్తాయని తెలుసు. కానీ ఓ మరుగుజ్జు నక్షత్రం మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు.. మరో నక్షత్రం సాల్మన్‌ పింక్‌ రంగులో కనిపించవచ్చని అంచనా వేశారు. నక్షత్రాల నుంచి వెలువడే కాంతిని విశ్లేషిస్తూ చేసిన ఈ పరిశోధన ఖగోళ శాస్త్రంలో ఆసక్తికర అంశంగా మారింది.

P

Science | Published On Oct 18, 2026, 9.10 pm IST

White Dwarf | అరుదైన ఆవిష్కరణ.. ఆకుపచ్చ రంగులో మెరిసే నక్షత్రం!
Advertisement

White Dwarf | విశ్వంలో నక్షత్రాలు అంటే తెలుపు, నీలం, పసుపు, నారింజ రంగుల్లో కనిపిస్తాయని తెలుసు. కానీ ఓ మరుగుజ్జు నక్షత్రం మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు.. మరో నక్షత్రం సాల్మన్‌ పింక్‌ రంగులో కనిపించవచ్చని అంచనా వేశారు. నక్షత్రాల నుంచి వెలువడే కాంతిని విశ్లేషిస్తూ చేసిన ఈ పరిశోధన ఖగోళ శాస్త్రంలో ఆసక్తికర అంశంగా మారింది.

151 నక్షత్రాలపై పరిశోధన

యూకేలోని వార్విక్‌ యూనివర్సిటీకి చెందిన మార్క్‌ హోలాండ్స్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం 151 తెల్ల మరుగుజ్జు నక్షత్రాల కాంతి లక్షణాలను విశ్లేషించింది. ఈ నక్షత్రాలు భూమికి సుమారు 65 కాంతి సంవత్సరాల పరిధిలో ఉన్నాయని అధ్యయనంలో పేర్కొన్నారు. వాటి నుంచి వెలువడే కాంతి వర్ణపటాలను (స్పెక్ట్రా) పరిశీలించి.. మానవ కంటికి అవి ఏ రంగులో కనిపించే అవకాశం ఉందో అంచనా వేశారు. ఈ విశ్లేషణలో ఓ నక్షత్రం ఆకుపచ్చ ఛాయలో కనిపించే అవకాశమున్నట్లు గుర్తించారు. దాని వాతావరణంలో కాల్షియం, సోడియం, లిథియం వంటి మూలకాల ప్రభావం ఇందుకు కారణమని భావిస్తున్నారు. మరోవైపు, కార్బన్‌ అధికంగా ఉన్న నక్షత్రం సాల్మన్‌ పింక్‌ రంగులో కనిపించవచ్చని అంచనా వేశారు.

గ్రహశకలాలే కారణమా?

సూర్యుడి వంటి నక్షత్రాలు తమ జీవితకాలం చివరి దశకు చేరుకున్నప్పుడు తెల్ల మరుగుజ్జు నక్షత్రాలుగా మారుతాయి. ఇవి చిన్న పరిమాణంలో అత్యంత సాంద్రత కలిగిన నక్షత్ర అవశేషాలు. వీటి చుట్టూ గతంలో ఉన్న గ్రహాలు, గ్రహశకలాల శకలాలు నక్షత్రంపై పడినప్పుడు వాటిలోని వివిధ మూలకాలు నక్షత్ర వాతావరణంలోకి చేరవచ్చు. ఈ మూలకాల ఆనవాళ్లను పరిశీలించడం ద్వారా నక్షత్రాల రంగుల్లో తేడాలను శాస్త్రవేత్తలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ నక్షత్రాలు నిజంగా ఆకుపచ్చగా కనిపిస్తున్నాయని నేరుగా టెలిస్కోప్‌తో గుర్తించడం కంటే.. వాటి కాంతి వర్ణపటాన్ని విశ్లేషించి రంగును అంచనా వేయడం ఈ పరిశోధనలో కీలకమైన అంశం. నక్షత్రం నుంచి వెలువడే కాంతిలో ఏ తరంగదైర్ఘ్యాలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించి, మానవ కన్ను వాటిని ఏ రంగుగా గుర్తించగలదో లెక్కిస్తారు.

గ్రహాల పుట్టుకపై కొత్త ఆధారాలు

తెల్ల మరుగుజ్జు నక్షత్రాల వాతావరణంలో కనిపించే మూలకాలు వాటి చుట్టూ గతంలో ఉన్న గ్రహశకలాలు, గ్రహాల రసాయన కూర్పుపై కీలక ఆధారాలను అందిస్తాయి. దీంతో ఇతర నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? వాటి నిర్మాణంలో ఎలాంటి పదార్థాలు ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకవచ్చు. నక్షత్రాల కాంతిని విశ్లేషించి వాటి రంగులను అంచనా వేసే ఈ విధానం భవిష్యత్తులో ఖగోళ పరిశోధనలకు మరింత ఉపయోగపడే అవకాశం ఉంది.

Advertisement
Advertisement