త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Male baldness | మగాళ్లకు గుడ్‌న్యూస్.. బట్టతల మీద మళ్లీ వెంట్రుకలు వస్తాయట.. కొత్త ఆశలు రేకెత్తిస్తున్న పరిశోధనలు

Male baldness | మగాళ్లకు గుడ్‌న్యూస్.. ఇకపై జుట్టు రాలిపోయి, బట్టతల వస్తుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మగవారిలో జుట్టు రాలకుండా (Male Pattern Baldness) చికిత్సలో కీలక మార్పు రానున్నట్లు కనిపిస్తోంది.

S

Science | Published On Dec 30, 2025, 9.15 am IST

Male baldness | మగాళ్లకు గుడ్‌న్యూస్.. బట్టతల మీద మళ్లీ వెంట్రుకలు వస్తాయట.. కొత్త ఆశలు రేకెత్తిస్తున్న పరిశోధనలు
Advertisement

Male baldness | మగాళ్లకు గుడ్‌న్యూస్.. ఇకపై జుట్టు రాలిపోయి, బట్టతల వస్తుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మగవారిలో జుట్టు రాలకుండా (Male Pattern Baldness) చికిత్సలో కీలక మార్పు రానున్నట్లు కనిపిస్తోంది. జుట్టు రాలకుండా నిరోధించేందుకు కాస్మో ఫార్మాసూటికల్స్ తాజాగా నిర్వహించిన ఫేజ్ 3 పరిశోధనల్లో ఆశాజనక ఫలితాలు కనిపించాయి. ఒకవేళ ఈ మందుకు ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభిస్తే.. రానున్న 30 ఏండ్లలో బట్టతల మీద కూడా వెంట్రుకలు మొలిపించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్లకు పైగా మగవారిని ప్రభావితం చేస్తున్న ఆండ్రోజెనెటిక్ అలోపేసియా (AGA) సమస్యకు ఇది కీలక పరిష్కారంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం

సాధారణంగా మగవారిలో ఆండ్రోజెనెటిక్ అలోపేసియా (AGA) సమస్య కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం డైహైడ్రోటెస్టోస్టిరోన్ (DHT) అనే హార్మోన్‌. ఇది క్రమంగా జుట్టు వేర్లను చిన్నవిగా మార్చి, జుట్టు పెరుగుదల చక్రాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా జుట్టు పలచబడి చివరకు ఊడిపోతుంది. ఈ సమస్యను తగ్గించడానికి ఇప్పటివరకు పలు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటితో పెద్దగా ఫలితాలైతే ఏమీ లేవు. ప్రస్తుతం ఉన్న 5- ఆల్ఫా రిడక్టేజ్ ఇన్‌హిబిటర్లను నోటితో తీసుకుంటాం. ఇవి శరీరమంతటా డీహెచ్‌టీ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే టాపికల్ మినాక్సిడిల్ వేరే విధానంలో జుట్టు పెరుగుదల కాలాన్ని పెంచుతుంది. అయితే ఈ రెండు చికిత్సలకు దుష్ప్రభావాలు ఉన్నాయి. పైగా స్థిరమైన ఫలితాలు కూడా రాలేదు. వీటిని దీర్ఘకాలం వాడాల్సి వస్తుంది.

కొత్త మందు ఎలా పనిచేస్తుంది?

అదే కాస్మో ఫార్మాసూటికల్స్ రూపొందించిన క్లాస్కోటెరోన్ 5 శాతం సొల్యూషన్.. ఇప్పుడున్న వాటికి పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. ఇది శరీరం మొత్తంలోని డీహెచ్‌టీ హార్మోన్ స్థాయిలను మార్చకుండా.. నేరుగా తల చర్మంలోని జుట్టు వేర్ల వద్ద మాత్రమే పనిచేస్తుంది. ఆండ్రోజెన్ రిసెప్టర్లను నిరోధించి, డీహెచ్‌టీ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో శరీరంపై ఈ హార్మన్ల ప్రభావం లేకుండా జుట్టు పెరుగుదల సాధ్యమవుతుంది.

ఫేజ్ 3 ట్రయల్స్ ఎలా పనిచేసింది?

అమెరికా, యూరప్‌లోని అనేక కేంద్రాల్లో నిర్వహించిన ఫేజ్ 3 అధ్యయనాల్లో 18 ఏళ్లు పైబడిన 1465 మంది మగవారు పాల్గొన్నారు. వీరిని SCALP-1, SCALP-2 పేర్లతో విభజించి ఆరు నెలల పాటు వారికి డబుల్ బ్లైండ్ విధానంలో క్లాస్కోటెరోన్ లేదా ప్లేసిబో ఇచ్చారు. అనంతరం మరో ఆరు నెలలు సింగిల్ బ్లైండ్ ఫాలో అప్ నిర్వహించారు. జుట్టు సాంద్రతను కొలిచే టార్గెట్ ఏరియా హెయిర్ కౌంట్ (TAHC)తోపాటు పరిశోధనల్లో పాల్గొన్న వారి స్వీయ అభిప్రాయలను కూడా ప్రమాణికంగా తీసుకున్నారు. రెండు అధ్యయనాలను పరిశీలించగా ప్లేసీబోతో పోలిస్తే బ్లైండ్ విధానంలో జుట్టు పెరుగుదల ఆశాజనకంగా కనిపించింది. ఒక ట్రయల్‌లో TAHC 5.39 రెట్లు మెరుగుపడగా.. మరో ట్రయల్‌లో 1.68 రెట్ల వృద్ధి నమోదైంది. ఇలాంటి వ్యత్యాసాలు జుట్టు ఊడిపోవడం మీద చేసే పరిశోధనల్లో సాధరణమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగులు స్వయంగా తెలిపిన ఫలితాలు కూడా ఈ గణాంకాలకు అనుగుణంగా ఉన్నాయి. ఇక క్లాస్కోటెరోన్ వాడిన వారిలోనూ, ప్లేసీబో వాడిన గ్రూప్‌లోనూ దుష్ప్రభావాల రేటు దాదాపు సమానంగా ఉంది.

వచ్చే ఏడాది మే నాటికి 12 నెలల భద్రతను ఫాలోఅప్ చేయాలని కాస్మో ఫార్మాసూటికల్స్ సంస్థ భావిస్తుంది. ఆ తర్వాత అమెరికా, యూరప్ దేశాల్లో నియంత్రణ సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేయనుంది. ఆ అనుమతులు వస్తే ఏజీఏ చికిత్స కోసం ప్రత్యేకంగా లైసెన్స్ పొందిన తొలి టాపికల్ ఆండ్రోజెన్ రిసెప్టర్ బ్లాకర్‌గా క్లాస్కోటెరోన్ నిలవనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement