త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ర్సెస్ టాలీవుడ్ నిర్మాతలు – ప‌ర్సెంటేజ్ లొల్లి – నైజాంలో థియేట‌ర్ల బంద్?

నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల యాజ‌మాన్యాలు బంద్‌కు పిలుపునివ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ర్సెంటేజీ విధానం అమ‌లుపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్‌కు టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ల‌కు మొద‌లైన వివాద‌మే ఇందుకు కార‌ణం. ఛాంబ‌ర్ నిర్ణ‌యించిన ప‌ర్సెంటేజీ సిస్ట‌మ్‌ను ప్రొడ్యూస‌ర్ గిల్డ్ అంగీక‌రించ‌లేదు.

N

News | Published On Apr 9, 2026, 12.28 pm IST

Tollywood | తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ర్సెస్ టాలీవుడ్ నిర్మాతలు – ప‌ర్సెంటేజ్ లొల్లి – నైజాంలో థియేట‌ర్ల బంద్?
Advertisement

Tollywood | టాలీవుడ్‌లో మ‌రో కొత్త వివాదం మొద‌లైంది. హైద‌రాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ఏప్రిల్ 3 నుంచి రెంట‌ల్ సిస్ట‌మ్‌లో కాకుండా ప‌ర్సెంటేజీ విధానంలో సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసింది. ప‌ర్సెంటేజీ విధానంలో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు టాలీవుడ్ నిర్మాత‌లు అంగీక‌రించ‌లేదు. ఆ 23 థియేట‌ర్ల‌లో త‌మ సినిమాల‌ను రిలీజ్ చేసేదిలేదంటూ యాక్టివ్ ప్రొడ్యూస‌ర్ గిల్డ్ తీర్మానించింది.  నిర్మాత‌ల నిర్ణ‌యంపై ఎగ్జిబిట‌ర్లు ఫైర్ అవుతున్నారు. నిర్మాత‌ల తీరుకు వ్య‌తిరేకంగా నైజాంలో థియేట‌ర్ల బంద్‌కు ఎగ్జిబిట‌ర్లు పిలుపునివ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బంద్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఈ వారంలోనే రానున్న‌ట్లు స‌మాచారం. అదే జ‌రిగితే ఈ వారం రిలీజ‌య్యే సినిమాలు భారీగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

రెంట‌ల్ సిస్ట‌మ్‌లోనే....

ప‌ర్సెంటేజీ విధానంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ తీసుకున్న నిర్ణ‌యం ఏక‌ప‌క్షంగా ఉంద‌ని, త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే రెవెన్యూ  షేరింగ్ ఎంత ఉండాలన్నది కూడా ప్ర‌క‌టించార‌ని ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ఆరోపిస్తుంది. పాత పద్దతుల ప్రకారం రెంట‌ల్ సిస్ట‌మ్‌లోనే సినిమాల‌ను స్క్రీనింగ్ చేయాల‌ని, లేదంటే తెలంగాణ ఛాంబ‌ర్ ప్ర‌క‌టించిన ఆ థియేట‌ర్ల‌లో త‌మ సినిమాను స్క్రీనింగ్ చేయ‌మ‌ని ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ఓ లేఖ‌ను రిలీజ్ చేశారు.
ఈ ప్రొడ్యూస‌ర్ గిల్డ్‌లో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సుధాక‌ర్ చెరుకూరి, స్వ‌ప్న‌ద‌త్‌, దిల్‌రాజుతో పాటు ప‌లువురు అగ్ర నిర్మాత‌లు స‌భ్యులుగా కొన‌సాగుతోన్నారు.

అత్య‌వస‌ర స‌మావేశం...

గిల్డ్ నిర్ణ‌యంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ గురువారం అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మీటింగ్‌లో త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌తో పాటు థియేట‌ర్ల బంద్‌పై కూడా చ‌ర్చించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

 రిస్క్ త‌క్కువ‌....

సాధార‌ణంగా ప‌ర్సెంటేజ్ తో పోలిస్తే రెంట‌ల్ విధానంలోనే ఎగ్జిబిట‌ర్ల‌కు రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది. కానీ పెద్ద సినిమాల రిలీజ్ టైమ్‌లో మాత్రం ప‌ర్సెంటేజ్ విధానంలో వారికి ఎక్కువ‌గా లాభాలు వ‌స్తాయి. చిన్న సినిమాల విష‌యంలో రెంట‌ల్ సిస్ట‌మే బెట‌ర్‌.

రెంట‌ల్ విధానంలో సినిమా హిట్లు, ఫ్లాప్‌ల‌తో ఎగ్జిబిట‌ర్‌కు సంబంధం ఉండ‌దు. ఫిక్స్‌డ్ రెంట్‌కు త‌మ థియేట‌ర్ల‌ను డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌ల‌కు.. ఎగ్జిబిట‌ర్లు ఇస్తుంటారు. సినిమా ఆడిన ఆడ‌క‌పోయినా ఒప్పుకున్న అద్దెను ఎగ్జిబిట‌ర్ల‌కు నిర్మాత‌లు చెల్లించాల్సిందే.

అయితే రెంట‌ల్ సిస్ట‌మ్ నిర్మాత‌ల‌కు ఎక్కువ‌గా లాభ‌దాయ‌కంగా ఉంటుంద‌నే వాద‌న‌లు కాలా కాలంగా వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల విష‌యంలో ఓపెనింగ్ భారీగా వ‌స్తున్నాయ‌ని, నిర్మాత‌లు  పెద్ద మొత్తాల్లో లాభాలు గ‌డిస్తూ ఎగ్జిబిట‌ర్ల‌కు మాత్రం త‌క్కువ రెంట్‌ చెల్లిస్తున్నార‌ని అంటున్నారు. కానీ  అద్దె ప్రతిపాదికన నిర్మాత‌ల‌కు రిస్క్ కూడా ఉంది. ఒప్పుకున్న రెంట్‌కు స‌రిప‌డా క‌లెక్ష‌న్స్ రానీ సంద‌ర్భాలు చాలానే ఉంటాయ‌నే నిర్మాత‌లు చెబుతున్నారు.

పర్సెంటేజ్ సిస్ట‌మ్‌...

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌ల‌తో ప‌ర్సెంటేజ్ సిస్ట‌మ్ అమ‌లు అవుతోంది. మొదటి వారం 50%, రెండో వారం 42%, మూడో వారం 37% ... రెవెన్యూలో షేరింగ్ ఇస్తూ త‌మ సినిమాల‌ను మ‌ల్టీప్లెక్స్‌ల‌లో నిర్మాత‌లు రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌తి సినిమాకు వేర్వేరుగా రెవెన్యూ షేరింగ్ అమ‌లు అవుతుంది. డిజిటల్ ప్రొజెక్షన్ ఖర్చులు, మెయింటెనెన్స్ వ్య‌యాలు రానురాను పెరుగుతండ‌టంతో సింగిల్ స్క్రీన్స్‌లోనూ ఈ ప‌ర్సెంటేజ్ విధానం అమ‌లు చేయాల‌ని ఎగ్జిబిట‌ర్లు కోరుతున్నారు.

ప‌ర్సెంటేజ్ సిస్ట‌మ్ లో సినిమా స్క్రీనింగ్ చేయ‌డానికి నిర్మాత అంగీక‌రిస్తే థియేట‌ర్ల‌కు అద్దెలు కట్టాల్సిన అవ‌స‌రం ఉండదు. వచ్చిన రెవెన్యూలో ఎగ్జిబిట‌ర్ల‌కు వాటా ఇస్తే సరిపోతుంది. ఇది చిన్న సినిమాల విష‌యంలో న‌ష్టాల‌ రిస్క్ తగ్గించుకోవ‌డానికి ప‌ర్సెంటేజ్ విధానం నిర్మాతలకు మేలు చేస్తుంది.

ప్ర‌భాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు ఓపెనింగ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ప‌ర్సెంటేజ్ విధానం వ‌ల్ల ఎగ్జిబిటర్‌కు అద్దె కంటే ఎక్కువ రెవెన్యూ వ‌స్తుంది. సినిమా డిజాస్ట‌ర్ అయితే మాత్రం థియేటర్ కనీస ఖర్చులు కూడా రాక ఎగ్జిబిటర్ నష్టపోతారు. రెండు విధానాల్లో నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లకు లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి.

Advertisement
Advertisement