త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. యూరియా అమ్మకాలపై నిషేధమెందుకు?: హ‌రీశ్‌రావు

Harish Rao | ఓవైపు ధాన్యం కొనుగోళ్లు కూడా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడు ఏకంగా యూరియా (urea) అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గమ‌మ‌ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందన్నారు.

S

News | Published On May 5, 2026, 3.21 pm IST

Harish Rao | మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. యూరియా అమ్మకాలపై నిషేధమెందుకు?: హ‌రీశ్‌రావు
Advertisement
  • రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే
  • యూరియా స్టాక్ ఉన్నా అమ్మకాలు నిలిపేయడం దుర్మార్గం
  • రైతులు అరిగోస పడుతుంటే ఏం ముఖం పెట్టుకొని వారోత్సవాలు చేస్త‌రు
  • రైతు సంక్షోభం విషయంలో రెండు పార్టీలదీ ఒకే సిద్దాంతం
  • రేవంత్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఓవైపు ధాన్యం కొనుగోళ్లు కూడా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడు ఏకంగా యూరియా (urea) అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గమ‌మ‌ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాలు లేవన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందన్నారు. ఈ నిషేధం ఎందుకు విధించారో చెప్పాల‌ని నిల‌దీశారు.

మౌఖిక ఆదేశాలివ్వ‌డం రైతు వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం..

యూరియా అమ్మకాలు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. యూరియా అమ్మకాలపై బ్యాన్.. రైతు వ్యతిరేక చర్య. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలి.
స్టాక్ ఉన్నా.. డీలర్లు, అగ్రో సెంటర్లు, సొసైటీల్లో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదు? యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్న‌ది అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రైతులు ఉక్కిరి బిక్కిరి..

యూరియా అమ్మకాలు నిలిపివేయడంతో చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి, ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్‌ రైతుల పాలిట శాపంగా మారింది. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు, మరోవైపు యూరియాపై ప్రభుత్వ అనధికారిక బ్యాన్ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అని హ‌రీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేసారు.

యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి, యూరియా వినియోగం తగ్గించాలంటూ రైతులకు చెప్పడం, డబ్బులు వెచ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదం. ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఒకవైపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండటం వారిని అవమానించడమే అన్నారు.

ఒక‌టా రెండా.. అన్నింట్లో ఫెయిల్‌..

రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, బోనస్ చెల్లించడంలో ఫెయిల్, పంట బీమా పథకం అమలులో ఫెయిల్
రుణమాఫీ చేయడంలో ఫెయిల్, యూరియా సరఫరాలో ఫెయిల్, పంట కొనుగోళ్లు చేయడంలో ఫెయిల్, కొన్న పంటకు బోనస్ పైసలు ఇవ్వడంలో ఫెయిల్, ఈ వైఫ‌ల్యాల‌ను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసురు తీసుకుంటున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకుండా పోదు అని శాస‌న‌ర్థాలు పెట్టారు.

నిరంత‌ర అమ్మ‌కాలు జ‌ర‌గాలి..

రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రైతుల‌ నిలదీతకు బయపడి అధికారులు రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావడం మీ పాలనా వైఫల్యానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వలే నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని, అనధికారిక బ్యాన్ ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేసారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement