Minister Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన నివేదిక ఇంకా రాలే.. డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: అసెంబ్లీలో మంత్రి పొన్నం
Assembly sessions | ఆర్టీసీ (RTC) విలీనంపై నివేదిక రావాల్సి ఉందని.. డిపోల ప్రైవేటీకరణ(Privatization)లో వాస్తవం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఆర్టీసీ సంస్థ 2025-26 సంవత్సరంలో (ఫిబ్రవరి-2026 వరకు) రూ.954.86 కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని ఆర్జించిందన్నారు. శనివారం ఆయన ఆర్టీసీ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ (Budget) పై అసెంబ్లీ(Assembly) లో చర్చ సందర్భంగా పలు వివరాలను వెల్లడించారు.
త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ (RTC) విలీనంపై నివేదిక రావాల్సి ఉందని.. డిపోల ప్రైవేటీకరణ(Privatization)లో వాస్తవం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఆర్టీసీ సంస్థ 2025-26 సంవత్సరంలో (ఫిబ్రవరి-2026 వరకు) రూ.954.86 కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని ఆర్జించిందన్నారు. శనివారం ఆయన ఆర్టీసీ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ (Budget) పై అసెంబ్లీ(Assembly) లో చర్చ సందర్భంగా పలు వివరాలను వెల్లడించారు. బడ్జెట్లో ఆర్టీసీకి రూ.4305.49కోట్లు కేటాయించినందుకు ఉద్యోగుల తరఫున, తన తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీ లో 11 రీజియన్స్, 97 డిపోల ద్వారా రవాణా సేవల్ని అందిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 10081 బస్సులను కలిగి ఉండి రోజుకు దాదాపు 35.19 లక్షల కిలోమీటర్లు బస్సులు నడుస్తున్నాయన్నారు. 98% ఆక్యుపెన్సీతో రోజుకు సగటున 62.34 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి వివిధ కేడర్లలో 38,292 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు (ఫిబ్రవరి 2026) సంస్థ మొత్తం నష్టాలు రూ.12750.48 కోట్లుగా ఉందన్నారు.
ఆర్టీసీ విలీనంపై నివేదిక రావాల్సి ఉంది...
ఆర్టీసీ విలీనంపై కమిటీ నివేదిక రావాల్సి ఉందని.. ఆనాడు ఆదరాబాదరగా విలీన ప్రక్రియ ప్రారంభించారని బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదన్నారు. విధుల్లో నుంచి వెళ్లిన 250 మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 1500 కోట్లు ప్రకటించి 10 ఏళ్లలో 7 వేల కోట్లు కూడా ఇవ్వలేదని.. తాము రెండు సంవత్సరాల్లోనే 7800 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు.
డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం..
కేంద్ర ప్రభుత్వ PM e- డ్రైవ్ కింద గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్ పై వచ్చే 2027, డిసెంబరు నాటికి రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం అన్ని డీజిల్ బస్సుల స్థానంలో భర్తీ చేయడానికి ఎలక్ట్రికల్ బస్సులను హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టనున్నాం. ఈ పథకం కింద టెండర్-1లో హైదరాబాద్ కు 2000 ఎలక్ట్రిక్ బస్సులు, టెండర్-11లో 200 బస్సులు కేటాయించాం. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా డిపోలు ప్రైవేటీకరిస్తున్నారనే వార్తల్లో వాస్తవం లేదు. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించం. ఎలక్ట్రిక్ బస్సులు సహా అన్ని బస్సుల కార్యకలాపాలు, నిర్వహణ పూర్తిగా టీజీఆర్టీసీ నియంత్రణలోనే ఉంటుంది. టిక్కెట్ల ఆదాయం సంస్థకు చెందుతుంది అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
‘మహాలక్ష్మి’ తర్వాత లాభం..
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత సంస్థ లాభాలను ఆర్జించింది. 2023-24 సంవత్సరంలో రూ.104.10 కోట్ల లాభాన్ని సాధించగా, 2024-25లో రూ.2848.25 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రధానంగా RPS 2017 బకాయిలకు రూ.3438.55 కోట్ల కేటాయింపులు చేయడం వల్ల ఈ నష్టం జరిగింది. గత ఫిబ్రవరి 28 నాటికి సంస్థ లయబిలిటీ మొత్తం రూ.9722.42 కోట్లు. ఇందులో బ్యాంకు రుణాలు రూ.2,791.15 కోట్లు కాగా PF, CCS, ఉద్యోగుల ఇతర బకాయిల మొత్తం రూ.6931.27 కోట్లు. 2023, నవంబర్ నాటికి PF బకాయిలు (అసలు) రూ.1205 కోట్లు ఉండగా అవి ఇప్పుడు రూ.680 కోట్లకు తగ్గాయి. CCS బకాయిలు (అసలు) రూ.690 కోట్ల నుంచి రూ.345 కోట్లకు తగ్గాయని పొన్నం పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం పల్లెవెలుగు (3278), డిస్ట్రిక్ట్ ఎక్స్ ప్రెస్ (2039), సిటీ ఆర్డినరీ (1829), సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ (1044) వంటి మొత్తం బస్సులలో 81% వర్తిస్తుంది. గత మార్చి 18 వరకు 286.60 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి మహిళా ప్రయాణికులు రూ.9871.32 కోట్ల రవాణా ఛార్జీలను ఆదా చేసుకున్నారు. 09.12.2023 నుంచి 18.03.2026 వరకు బస్ పాస్ హోల్డర్లతో సహా రోజుకు ప్రయాణించిన మొత్తం ప్రయాణికులు సగటు 60.41 లక్షలు. మహాలక్ష్మి రాకముందు రోజుకు మొత్తం ప్రయాణికులు 45.49 లక్షలు. రోజుకు మొత్తం ప్రయాణికుల్లో 14.92 లక్షలు (33%) పెరుగుదల ఉంది.
ఈ పథకం అమలుకు ముందు సుమారు 40% ఉన్న మహిళా ప్రయాణికుల శాతం ఇప్పుడు మహాలక్ష్మి బస్సులలో మొత్తం ప్రయాణికులలో 67.72%కి పెరిగింది.
బస్సుల కొనుగోలుకు సెర్ప్ రుణాలు..
'SERP-మహిళా శక్తిస కింద 152 మండల మహిళా సమాఖ్యలకు 152 బస్సులను కొనుగోలు చేయడానికి సంస్థ రూ.54.72 కోట్ల రుణాన్ని పొందింది. ఈ బస్సులను 2025 మార్చి 8న ప్రారంభించాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, మరో 312 బస్సుల కొనుగోలు నిమిత్తం మండల మహిళా సమాఖ్యల నుంచి రూ.123.12 కోట్ల మొత్తాన్ని సంస్థ స్వీకరించింది. మరో 106 కొత్త బస్సుల కొనుగోలుకు 2026, ఏప్రిల్ లో రుణాన్ని స్వీకరించనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 415 రీప్లేస్మెంట్, 267 అగ్మెంటేషన్ కోసం కొత్త బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం అని ఆయన వెల్లడించారు.
నగరంలో 401 ఎలక్ట్రిక్ బస్సులు..
హైదరాబాద్ నగరంలో 401 ఎలక్ట్రికల్ బస్సులు రవాణా సేవలు అందిస్తున్నాయి. 2026, మే నాటి 99 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకున్నాం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 40 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ కు 510 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయి.
4,538 పోస్టుల భర్తీకి అనుమతి..
సంస్థలో 4,538 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల్లో డ్రైవర్లు- 2000, శ్రామిక్-743, కండక్టర్-1500, ఇతర పోస్టులు -295 ఉన్నాయి. ఏడు మెడికల్ ఆఫీసర్లు (జనరల్) నియామకాలు పూర్తయ్యాయి. తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మొదటి దశలో 1000 డ్రైవర్ పోస్టుల భర్తీకి, 713 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు ఈనెల 29న రాత పరీక్ష జరగనుంది అని వివరించారు.
కారుణ్య నియామకాలు ఇలా..
మృతి చెందిన ఉద్యోగులపై ఆధారపడిన 829 మందికి బ్రెడ్ విన్నర్ పథకం కింద 2023, డిసెంబర్ నుంచి ఉద్యోగాలు కల్పించాం. మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 305 మందిని తీసుకున్నం. తార్నాక ఆసుపత్రిని రూ.17.29 కోట్ల ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశాం. వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. కోటి చెల్లిస్తుందని పొన్నం పేర్కొన్నారు.
బస్సు డిపోల నిర్మాణం..
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, పెద్దపల్లి వద్ద కొత్త బస్సు డిపోల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మార్గాల్లోని కీలక కూడళ్ల వద్ద ఇప్పటివరకు 364 బస్సు స్టేషన్లను నిర్మించినట్లు తెలిపారు. జనగామ బస్ స్టేషన్ విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మంథని బస్ స్టేషన్ విస్తరణ, ఆధునీకరణ పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని చెప్పారు. హుజూర్ నగర్, కోదాడ, కాళేశ్వరం వద్ద కొత్త బస్సు స్టేషన్ల నిర్మాణాలు ఈ ఏడాది చేపడతామని మంత్రి వెల్లడించారు.
రాయితీ బస్సు పాసులకు రూ.265.06 కోట్లు...
2025-26 లో (ఫిబ్రవరి 26 వరకు) విద్యార్థులు, దివ్యాంగులు, జర్నలిస్టులు, స్వాతంత్య్ర సమరయోధులు, పోలీసు అమరవీరుల కుటుంబాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, స్వచ్ఛంద సంస్థల (NGOs) సభ్యుల తదితర వర్గాలకు రూ. 265.06 కోట్ల రాయితీతో 13,08,343 బస్సు పాసులను జారీ చేసినట్లు తెలిపారు. 25% లావాదేవీలు UPI చెల్లింపుల ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహన ట్రాకింగ్, ప్రయాణికుల సమాచార వ్యవస్థ (VTPIS)తో కూడిన గమ్యం యాప్ ను దాదాపు 57.21 లక్షల మంది ప్రయాణికులు డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు.
పేద వర్గాలకు ఆర్టీసీ లైఫ్ లైన్..
ప్రజా పాలన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను అక్కున చేర్చుకున్నామని చెప్పారు. బస్ క పయ్యా నై చెలేగా అని ఉద్యోగులు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆర్టీసీలో సంస్థ ప్రభుత్వ విలీనం, యూనియన్ల పునః నిర్మాణం పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో 60 వేలకు పైగా ఆటోలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ లో రవాణా కనెక్టివిటీ పెంచడానికి మెట్రో, ఎంఎంటీఎస్‌తో కలిసి ఆర్టీసీ ముందుకెళ్తోందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



