త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

ఇరుకు సందుల నుంచి ఐటీ కారిడార్ల వరకు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ విన్నా '22A' నిషేధిత భూముల గురించే హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఏళ్ల తరబడి అన్ని అనుమతులతో ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న సామాన్య పౌరుల ఆస్తులు సైతం రాత్రికి రాత్రి 'ప్రొహిబిటెడ్' జాబితాలోకి వెళ్లిపోవడంతో వేలాది మంది తలలు పట్టుకుంటున్నారు. అసలు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ఈ చట్టం ఎందుకంత వివాదాస్పదమైంది? రికార్డుల్లో పట్టా భూములు ఎలా లాకైపోయాయి?

S

News | Published On Aug 17, 2026, 9.13 pm IST

22A చిక్కుముడి:  అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి  !

సంక్షిప్త సారాంశం

డిజిటలైజేషన్ లోపాల వల్ల ప్రైవేటు పట్టా భూములు సైతం 22A నిషేధిత జాబితాలో చేరిపోవడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సర్వే నంబర్ల మొత్తం లాకింగ్ కారణంగా ఆస్తులను అమ్ముకోలేక, లోన్లు పొందలేక వేలాది మంది సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రికార్డుల ప్రక్షాళన ఇంకా పూర్తికాకపోవడంతో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.

Advertisement

                    రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న జనం.. అసలేంటీ 22A భూముల రగడ?

 

"సొంత జాగా ఉంది.. అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు.. బ్యాంకులో లోన్ అడిగితే మీ భూమి 22A లిస్టులో ఉందంటున్నారు.." — ఇరుకు సందుల నుంచి ఐటీ కారిడార్ల వరకు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ విన్నా ఇదే గోల. అపార్ట్‌మెంట్లు కట్టుకుని ఏళ్ల తరబడి ఉంటున్న ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు సైతం ఒక్కసారిగా 'ప్రొహిబిటెడ్' జాబితాలోకి చేరిపోవడంతో వేలాది మంది సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ఈ చట్టం ఎందుకంత వివాదాస్పదమైంది? రాత్రికి రాత్రి రికార్డుల్లో పట్టా భూములు ఎలా మారిపోయాయి?

అసలేంటీ '22A' కథ...........

సాధారణంగా ప్రజల మధ్య జరిగే ఆస్తి లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. కానీ, కొన్ని భూములు మాత్రం అత్యంత సున్నితమైనవి. ప్రభుత్వం చేతిలో ఉండాల్సినవి లేదా వివాదాల్లో నలుగుతున్నవి. ఇలాంటి ఆస్తులను ఎవరూ ఇష్టానుసారంగా విక్రయించకుండా, అన్యాక్రాంతం కాకుండా 1908 నాటి భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం ఒక అస్త్రం ఇచ్చింది. అదే సెక్షన్ 22A.

ఈ సెక్షన్ కింద ప్రభుత్వం ఏయే భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదో స్పష్టమైన జాబితా (POB List) తయారుచేస్తుంది.

* సర్కారు పోరంబోకు భూములు, పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు

* మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంస్థల స్థలాలు

* దేవాదాయ (ఆలయాలు) మరియు వక్ఫ్ బోర్డు ఆస్తులు

* అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) మిగులు భూములు, అటవీ స్థలాలు

* గిరిజన ప్రాంతాల రక్షణ కోసం తెచ్చిన 1/70 చట్టం (Regulation 1 of 1970) పరిధిలోని ఏజెన్సీ భూములు

* కోర్టుల స్టే ఉన్న వివాదాస్పద ఆస్తులు

ఈ జాబితాలో ఏ సర్వే నంబర్ అయితే ఉంటుందో, ఆ భూమిని ఏ ఒక్కరూ కొనుగోలు చేయడానికి లేదా రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్‌రిజిస్ట్రార్లు అంగీకరించరు.

సమస్య ఎంత పెద్దది? కారణం ఏంటి?

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే సుమారు 93 లక్షల ఎకరాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నట్లు అంచనా. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే 50 శాతానికి పైగా సమస్య కేంద్రీకృతమై ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, నిజాంపేట్ వంటి ప్రముఖ ప్రాంతాల్లోని వందలాది ఆస్తులు ఈ జాబితాలో చిక్కుకున్నాయి.

చట్టం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, గతంలో రెవెన్యూ రికార్డులను ఆన్‌లైన్ చేసే క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదు. అధికారుల యాంత్రికమైన లోపాల వల్ల అసలైన ముప్పు వచ్చిపడింది. ఉదాహరణకు, ఒక భారీ సర్వే నంబర్‌లో మొత్తం 100 ఎకరాల భూమి ఉందనుకుందాం. అందులో కేవలం 2 ఎకరాలు మాత్రమే ప్రభుత్వానిదో లేక ULC కింద కోర్టు కేసులో ఉన్నదో అనుకుందాం. కానీ రికార్డులు ఎక్కించే సమయంలో అధికారులు ఆ చిన్న భాగాన్ని విడదీయడం మానేసి, ఆ మొత్తం 100 ఎకరాల సర్వే నంబర్‌ను గుడ్డిగా 22A నిషేధిత జాబితాలో లాక్ చేసేశారు.

దీనివల్ల మిగతా 98 ఎకరాల్లో దశాబ్దాల క్రితమే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న వందలాది మంది ప్రైవేటు పట్టాదారుల ఆస్తులు కూడా ఒక్కసారిగా 'లాకైపోయాయి'. అలాగే, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు వర్తించే 1/70 చట్టం నిబంధనలు కూడా కొన్నిచోట్ల సాధారణ పట్టా భూములకు అడ్డగా మారి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆస్తి వారి పేరు మీదే ఉన్నప్పటికీ, దాన్ని అమ్ముకోవడానికి లేదా అత్యవసరానికి బ్యాంకు రుణం తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది.

ప్రభుత్వం ఏమంటోంది? మంత్రులు, సీఎం రియాక్షన్ ఇదీ..

ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి స్పష్టమైన భరోసా ఇస్తూ, "నిజమైన హక్కుదారుల భూమి ఒక్క అంగుళం కూడా పోదు. పొరపాటున పడిన ఆస్తులను డినోటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తాం. సర్వే నంబర్లకు సబ్-నంబర్లు కేటాయించి వివాదాస్పద భాగాలను వేరు చేస్తాం" అని స్పష్టం చేశారు.

ఇక రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆగస్టు 17న జరిగిన సమీక్షలో కీలక ప్రకటన చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రైవేటు ఆస్తులు 22Aలోకి వచ్చాయని బహిరంగంగా అంగీకరించి బాధితులకు క్షమాపణ చెప్పారు.

* ఆగస్టు 17 నాటికి కేవలం ఈ నాలుగు జిల్లాల నుంచే 757 దరఖాస్తులు రాగా, వాటిని వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

* ప్రభుత్వ, దేవదాయ, వక్ఫ్ భూములను అలాగే ఏజెన్సీ చట్టాలను ఆక్రమణదారుల నుంచి కాపాడుకోవడంలో ఎలాంటి వెనకంజ వేసేది లేదని, అదే సమయంలో అధికారుల తప్పు వల్ల ఇబ్బంది పడుతున్న నిజమైన పట్టాదారులకు మాత్రం న్యాయం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు.

* పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా **1800-599-4788** టోల్-ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

బాధితులు ఏం చేయాలి?

మీ ఆస్తి నిజంగానే 22A లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి [తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్‌సైట్](https://registration.telangana.gov.in/) ద్వారా సర్వే నంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో ఈ 22A డేటా “రివ్యూ కింద” కొనసాగుతోంది. ఒకవేళ పొరపాటున ఆ జాబితాలో పడి ఉంటే, మీ దగ్గరున్న పాత సేల్ డీడ్స్, లింక్ డాక్యుమెంట్స్, నిర్మాణ అనుమతుల పత్రాలతో పాటు స్థానిక కలెక్టర్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వం చేపడుతున్న ఈ రికార్డుల ప్రక్షాళన కొలిక్కి వస్తేనే, దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సామాన్యులకు అసలైన విముక్తి లభిస్తుంది.

Advertisement
Advertisement