త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్‌కు దేవుడంటే లెక్క‌లేదు.. గుప్త నిధుల కోసం కాక‌తీయుల గుడుల మీద ప‌డ్డ‌డు: హ‌రీశ్‌రావు

Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) త‌న‌ అనుయాయులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం వెతికాడని, అక్కడ దొరక్క‌పోయే సరికి ఇప్పుడు కాకతీయుల గుడుల (Kakatiya temple) మీద పడ్డాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

S

News | Published On May 11, 2026, 6.41 pm IST

Harish Rao | రేవంత్‌కు దేవుడంటే లెక్క‌లేదు.. గుప్త నిధుల కోసం కాక‌తీయుల గుడుల మీద ప‌డ్డ‌డు: హ‌రీశ్‌రావు
Advertisement
  • అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్రక శివాలయం కూల్చివేత
  • బడి పేరుతో గుడిని కూల్చిన రేవంత్.. లంకె బిందెల వేటలో 24 అడుగుల తవ్వకాలు
  • బీఆర్ఎస్ హయాంలో ధరణిలో ఇది దేవాలయ భూమిగా ఉంటే.. కాంగ్రెస్ రాగానే భూభారతిలో ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది?
  • ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో రూ. 500 కోట్ల భారీ కుంభకోణం.. అన్నీ ఎక్సెస్ టెండర్లే
  • బాధ్యులను అరెస్ట్ చేసి మిషనరీని సీజ్ చేయాలి
  • ఆల‌యాన్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పున‌రుద్ధ‌రించాలి
  • అశోక్ నగర్ మట్టికోట శివాలయ సంద‌ర్శ‌న‌లో మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) త‌న‌ అనుయాయులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం వెతికాడని, అక్కడ దొరక్క‌పోయే సరికి ఇప్పుడు కాకతీయుల గుడుల (Kakatiya temple) మీద పడ్డాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. అశోక్ నగర్ లో కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన 800 ఏళ్ల నాటి అద్భుతమైన శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని ఆరోపించారు. వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని ఆయ‌న సోమ‌వారం సందర్శించి, కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట త‌ప్పిన‌ సీఎం రేవంత్‌..

ఆలయ రక్షణ కోసం ఉన్న అతిపెద్ద మట్టి ఆనకట్టను తొలుచుకుంటూ వెళ్లి మరీ గర్భగుడిని ధ్వంసం చేశారు. రాత్రి 12 నుంచి 1 గంట మధ్య చీకట్లో గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారు. రేవంత్ రెడ్డి పాలనలో బడులు ఆగమే కాదు.. ఏకంగా గుడుల విధ్వంసం కూడా జరుగుతోంది. ఆనాడు కేసీఆర్ మన ఊరు-మన బడి పెడితే రేవంత్ రెడ్డి దాన్ని అర్ధాంతరంగా నిలిపేశారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి వంద శాతం రుణమాఫీ చేయకుండా మాట తప్పిన భారతదేశ తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు దేవుడంటే భయం లేదు, భక్తీ లేదు అని మాజీ మంత్రి విమ‌ర్శించారు.

స్కూల్ కోస‌మైతే ప‌గ‌లు ప‌నులు చేయొచ్చు క‌దా?

కేసీఆర్ యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాలను నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చీలు, ఇప్పుడు ఏకంగా గుడులు కూలగొడుతున్నాడు. విశాఖ పీఠం కూలుస్తా అని మొన్న అధికారులను పంపాడు. సీఎం అయిన కొత్తలో సెక్రటేరియట్ కు పోతే లంకె బిందెలు దొరుకుతాయనుకున్నా అని అన్నాడు. స్కూల్ కట్టే పనైతే పగలు చేయొచ్చు కదా? అర్ధరాత్రి ఎందుకు తవ్వారు? గుప్త నిధుల వేటలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ కుట్ర జరిగింది అని హ‌రీశ్‌రావు ఆరోపించారు.

ప్ర‌భుత్వ పెద్ద‌ల హ‌స్తం ఉంది..

ఇది గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకమే అని పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి ఈ నెల 7వ తేదీన కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆర్కియాలజీ అధికారి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదు. మిషనరీ సీజ్ చేయలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. అంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది స్పష్టం. బీఆర్ఎస్ హయాంలో ధరణిలో ఇది దేవాలయ భూమిగా ఉంటే.. కాంగ్రెస్ రాగానే భూభారతిలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? స్కూల్ కట్టడానికి చుట్టూ కావలసినంత స్థలం ఉంది. అసలు ఈ నియోజకవర్గంలో వేరే చోట జీవో వచ్చిన స్కూల్ ను ఇక్కడికి ఎందుకు మార్చారు అని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు.

యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ శివాల‌యాన్ని పున‌రుద్ధ‌రించాలి..

గుడి ఉన్నకాడ బడి కట్టొచ్చు, కానీ పోయిపోయి గుడినే కూలగొట్టడం ఎందుకు? పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధ్యులను అరెస్ట్ చేసి మిషనరీని సీజ్ చేయాలి. యుద్ధప్రాతిపదికన ఈ చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలి. 1958 చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించాలి. అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంకె బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు పోయాయో సమగ్ర విచారణ జరగాలి అని ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

రూ.500 కోట్ల దోపిడీకి తెర తీశారు..

సీవీసీకి, విజిలెన్స్ కు సైతం ఫిర్యాదు చేస్తాం. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పిలిస్తే.. అన్నీ 4.86%, 4.96%, 4.99% ఎక్సెస్ కే ఇచ్చారు. ఒక్క టెండర్ కూడా మైనస్ కు పోకుండా అన్నీ ఎక్సెస్ కే ఎట్లా పోయాయి. ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా 494 కోట్ల ఒక లక్ష రూపాయల ఎక్సెస్ అమౌంట్ ద్వారా ప్రజాధనం లూటీ అయ్యింది. నర్సంపేట ప్యాకేజ్-8 కింద రూ.136 కోట్లకు టెండర్ ఉంటే అది రూ.142 కోట్లకు (4.86% ఎక్సెస్) ఇచ్చారు. తమకు అనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజినీర్ గా పెట్టుకుని ఈ రూ. 500 కోట్ల దోపిడీకి తెర తీశారు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ఆరోపించారు.

నా మ‌నుషులైతే టెండ‌ర్లు ర‌ద్దు చెయ్‌..

కాంట్రాక్టర్లు నా మనుషులైతే టెండర్లు రద్దు చేయి. టెండర్లు దక్కించుకున్న వాళ్లు హరీశ్ రావు మనుషులే అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. వాళ్లు నా మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయి. నేనే కదా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నది. మొన్న HAM రోడ్ల పేరుతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో 25% ఎక్సెస్ తో జరిగిన రూ.5000 కోట్ల కుంభకోణాన్ని అసెంబ్లీలో బయటపెట్టి పోరాడింది నేనే. నీ మనుషులా? నా మనుషులా? అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయం. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5% కి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి, వెంటనే ఈ ప్రజాధనం లూటీని ఆపాలి అని మాజీ మంత్రి హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement