త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Reservations | బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించండి: వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

BC Reservations | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) పెంచుతూ చేసిన చట్టాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే ఆమోదించాలని బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) డిమాండ్ చేశారు. ఈ మేర‌కు బీసీ నాయ‌కుల‌తో క‌లిసి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు.

A

News | Published On Dec 17, 2025, 5.09 pm IST

BC Reservations | బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించండి: వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌
Advertisement

బీసీల ఆకాంక్షలను గౌరవించి బీసీ రిజర్వేషన్లుపెరిగేలా చర్యలు తీసుకోవాలి
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్‌కు విన‌తిప‌త్రం అంద‌జేసిన బీసీ నాయ‌కులు

BC Reservations | తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీల ఆకాంక్షలను గౌరవించి, బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ప్రస్తుతం జరిగే పార్లమెంటు సమావేశాలలోనే ఆమోదించాలని బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) డిమాండ్ చేశారు. బీసీల ఆకాంక్ష‌ల‌ను గౌర‌వించి, రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ మేర‌కు ర‌విచంద్ర ఆధ్వ‌ర్యంలో పార్ల‌మెంట్‌లోని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్‌ కార్యాల‌యంలో ఆయ‌న‌తో బీసీ జేఏసీ నాయ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఆయ‌నకు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక శాతం బీసీ జనాభా ఉన్నప్ప‌టికీ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో తీరని అన్యాయం జరుగుతోంద‌ని అన్నారు. అందుకే ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టానికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపిందని చెప్పారు. అసెంబ్లీలో చేసిన చట్టం ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఆమోదం పొందడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే ప్ర‌స్తుత‌ పార్లమెంటు సమావేశాల్లోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టామని వివ‌రించారు. తాను ప్ర‌వేశ‌ పెట్టిన ప్రైవేటు బిల్లుకు కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపి బీసీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని కోరారు.

రాజ్యాంగాన్ని స‌వరించాలి: జాజుల శ్రీ‌నివాస్‌గౌడ్‌

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకు బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిద‌వ షెడ్యూల్‌లో చేర్చాల‌ని బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మెన్ జాజుల శ్రీ‌నివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన చేప‌ట్టామ‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మొదటిసారి సమగ్ర కులగణ‌న చేపట్టారని చెప్పారు. తదుపరి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిజెపి, బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం టీజేఎస్ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించి ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు చెల్లదని న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీలులేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము తక్షణమే జోక్యం చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాలలోనే రాజ్యాంగాన్ని సవరించి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు.

బీసీ బిల్లుపై ప్ర‌ధానితో చ‌ర్చిస్తామ‌ని హామీ ఇచ్చిన మంత్రి

బీసీ నాయ‌కుల స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్న మంత్రి వీరేంద్ర క‌పూర్‌... బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని అన్నారు. ఇందిరా స‌హానీ కేసులో సామాజిక రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించొద్దని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు ఇచ్చింద‌ని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచాలని వచ్చిన విజ్ఞప్తులను ప‌రిశీలిస్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశంలో అందరికీ సమన్యాయం జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, వచ్చే ఏడాది నుండి దేశవ్యాప్తంగా జనగణలో కూడా కులగణన‌ చేపడుతున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చిస్తానని ఆయన బీసీ నేతలకు హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రం గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement