త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Condolence | ఉస్మానియాకు కేటీఆర్‌.. ఓఆర్ఆర్ ప్ర‌మాద మృతుల‌కు నివాళి

KTR Condolence | ఓఆర్ఆర్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళుల‌ర్పించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతదేహాలను సిరిసిల్లకు తరలించేందుకు 2 అంబులెన్సులు ఏర్పాటు చేశారు.

S

News | Published On May 2, 2026, 11.50 am IST

KTR Condolence | ఉస్మానియాకు కేటీఆర్‌.. ఓఆర్ఆర్ ప్ర‌మాద మృతుల‌కు నివాళి
Advertisement
  • బాధిత కుటుంబాల‌ను ఓదార్చి, ధైర్యం చెప్పిన కేటీఆర్‌

KTR Condolence | త్రినేత్ర‌.న్యూస్‌: ఓఆర్ఆర్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళుల‌ర్పించారు. శుక్రవారం శంషాబాద్ వద్ద ఓఆర్‌ఆర్‌పై జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల (Siricilla) కు చెందిన బీఆర్‌ఎస్‌ (BRS) నేతలు ఇద్దరు, వారి భార్యాపిల్లలు మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఉద‌యం కేటీఆర్‌ ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) కి వెళ్లారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతదేహాలను సిరిసిల్లకు తరలించేందుకు 2 అంబులెన్సులు ఏర్పాటు చేశారు.

ప్రమాదానికి గల కారణాలను పోలీసులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం తమ కుటుంబంలో తీరని లోటు మిగిల్చిందని మృతుడి బాబాయ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో అటు సిరిసిల్ల నియోజకవర్గంలోనూ, ఇటు ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మృతులు వీరే..

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బొల్లి రాజుకు ఇద్దరు కుమారులు, కుమార్తె శ్వేత సంతానం. ఆమె భర్త కోడం శ్రీనివాస్ (40) సిరిసిల్లలోని ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. వీరికి కుమారులు కృష్ణచంద్ర (13), మాధవ్ (10) ఉన్నారు. శ్వేత సోదరుడు బొల్లి శివకుమార్ (37) హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య రాజేశ్వరి అలియాస్‌ లాస్య (35) పౌరసరఫరాల విభాగంలో ఉద్యోగిని. వీరికి కుమార్తె రిషిత (7) ఉంది.

శుక్రవారం తెల్లవారుజామున ఇరు కుటుంబాల్లోని ఏడుగురు సభ్యులు కారులో యాదగిరిగుట్టకు వెళ్లి అనంత‌రం చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు ఔటర్ ఎక్కారు. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌ శివారు తొండుపల్లి ప‌రిధిలోని ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ 16 వద్ద నిలిపి ఉన్న లారీని వీరి కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు శివకుమార్, ఆయన భార్య రాజేశ్వరి, కుమార్తె రిషిత, శ్రీనివాస్, ఆయన కుమారులు కృష్ణచంద్ర, మాధవ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్వేతకు తీవ్రగాయాలు కాగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఫ్యూచర్‌సిటీ జాయింట్‌ సీపీ చందనాదీప్తి, డీసీపీ యోగేశ్ గౌతమ్, శంషాబాద్‌ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement