త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | పాతబస్తీలో ఏడెక‌రాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

HYDRAA | గజం భూమి కూడా ల‌భించ‌డం క‌ష్ట‌మైన పాత‌బ‌స్తీ (Old City)లో ఏడెక‌రాల ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసిన వ్య‌క్తి చెర నుంచి హైడ్రా (HYDRAA) విడిపించింది. దీని విలువ రూ.400 కోట్లు ఉండ‌డం విశేషం. ఫెన్సింగ్ (Fencing) తో పాటు ఆ భూమిని ప్ర‌భుత్వ భూమిగా పేర్కొటూ బోర్డులు సైతం ఏర్పాటు చేసింది

A

News | Published On Dec 19, 2025, 4.26 pm IST

HYDRAA | పాతబస్తీలో ఏడెక‌రాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
Advertisement

రూ. 400 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు

HYDRAA | సాధార‌ణంగా పాత‌బ‌స్తీ (Old City) లో ఒక గ‌జం జాగా దొర‌క‌డం కూడా గ‌గ‌నం. గ‌జం ఖాళీ స్థ‌లం కూడా లేకుండా ల‌క్ష‌లాది నివాసాలు అక్క‌డ ఉంటాయి. అలాంటి చోట ఏకంగా ఓ వ్య‌క్తి ఏడు ఎక‌రాల ప్ర‌భుత్వ స్థ‌లాన్ని క‌బ్జా చేశాడు. ఆ భూమిని హైడ్రా (HYDRAA) శుక్ర‌వారం కాపాడింది. పోలీసు స్టేష‌న్ (Police Station) కేసుల‌కు వెర‌వ‌కుండా.. కోర్టు (Court) ఫైన్లు కూడా ప‌ట్టించుకోకుండా.. చుట్టూ ఇనుప రేకుల‌తో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ప్ర‌హ‌రీ (Compound Wall) నిర్మించిన ఆ స‌ద‌రు వ్య‌క్తి భూమిని త‌మ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ ప‌రిస్థితుల్లో హైడ్రా రంగంలోకి దిగింది. రెవెన్యూ (Revenue) అధికారుల స‌మ‌క్షంలో, పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఇనుప రేకుల ప్ర‌హారీని తొల‌గించి, హైడ్రా ఫెన్సింగ్ (Fencing) ఏర్పాటు చేసింది. ఆ భూమిని ప్ర‌భుత్వ భూమిగా పేర్కొటూ బోర్డులు సైతం ఏర్పాటు చేసింది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు. హైడ్రా కాపాడిన 7 ఎక‌రాల భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. క‌బ్జాదారులు మాయం చేసిన చెరువుతో పాటు.. నాలాల‌ను పున‌రుద్ధ‌రిస్తే బ‌మ్ రుక్న్ ఉద్ దౌలా మాదిరి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

కేసులున్నా వెర‌వ‌ని క‌బ్జాదారులు..

హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలోని మొహమ్మద్‌నగర్ – లలితాబాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్:ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా అయి.. నివాసాలు వచ్చేశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్క‌డ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కాని ఆ చెరువు ఆన‌వాళ్లు ఎక్క‌డా లేకుండా మ‌ట్టితో క‌బ్జాదారులు క‌ప్పేశారు. ఈ భూమిని కబ్జా చేసి తనదంటూ ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ఇతరులు న్యాయ‌స్థానంలో పోరాడుతున్నారు. వీరిపై భవానిపురం పోలీసు స్టేష‌న్‌లో రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఒక ప‌క్క‌న ఈ భూమి త‌మ‌దంటూ చెబుతుండ‌గా.. వారి వ‌ద్ద నుంచి ప‌ట్టాభి రామిరెడ్డి కొన్నానంటూ మ‌రోవైపు క‌బ్జాలో భాగ‌స్వామ్యం అయ్యాడు. ఈ మేర‌కు కోర్టులో కేసు కూడా వేశాడు. అయితే ప్ర‌భుత్వ భూమిని ఏ ప్రాతిప‌దిక‌న త‌న‌దిగా చెప్పుకుంటార‌ని.. కోర్టు స‌మ‌యం వృథా చేసినందుకు కోటి రూపాయ‌లు ఫైన్ కూడా వేసింది. అయినా క‌బ్జాదారులు ఖాళీ చేయ‌కుండా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.

ఆనందం వ్య‌క్తం చేస్తున్న స్థానికులు

మొహమ్మద్‌నగర్ – లలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలో ప్రభుత్వ భూమితో పాటు నాలా, కుంటను క‌బ్జా దారుల చెర‌ నుంచి విముక్తి క‌ల్పించిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే.. స్థానికంగా విచారించి.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్ర‌తినిధులు ప్ర‌శంసించారు. రెండు కమ్యూనిటీల మధ్య ఉన్న సున్నితమైన ప్రాంతంలో క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదంగా మారింది. వీరి వెనుక బ‌డాబాబులున్నారంటూ ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ అక్రమ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేయ‌డం.. కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాదారులు ఖాళీ చేయ‌కుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అటువైపు ఎవ‌రూ వెళ్ల‌డానికి వీలు లేకుండా చేశారంటూ వాపోయారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఆక్రమణదారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, అక్క‌డ నాలాతో పాటు, చెరువును పున‌రుద్ధ‌రిస్తే పాత‌బ‌స్తీలో చాలా ప్రాంతాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంద‌ని స్థానికులు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement