త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGNREGA | ఉపాధి హామీ ప‌థ‌కంలో ‘గాంధీ’ పోయి ‘రామ్‌’ వ‌చ్చె…

MGNREGA | మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ‌ ఉపాధి హామీ ప‌థ‌కం (MGNREGA) పేరులో గాంధీ (Gandhi) పోయి రామ్ (Ram) వ‌చ్చి చేరాడు. ఇప్ప‌టికే ప‌లు పేర్లు మార్చిన కేంద్రప్ర‌భుత్వం తాజాగా ఎంజీఎన్‌ఆర్ఈజీఏ ప‌థ‌కం స్థానంలో మ‌రో ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెడుతోంది. ఆ ప‌థ‌కం పేరులో ఇంగ్లీష్ పొడి అక్ష‌రాల‌లో ఆర్ఏఎం (రామ్‌) ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన బిల్లును ప్ర‌స్తుత పార్ల‌మెంటు (Parliament) స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.

A

News | Published On Dec 15, 2025, 7.01 pm IST

MGNREGA | ఉపాధి హామీ ప‌థ‌కంలో ‘గాంధీ’ పోయి ‘రామ్‌’ వ‌చ్చె…
Advertisement

MGNREGA | గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని రూపుమాప‌డంతో పాటు ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం అమ‌లు చేస్తున్న మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ‌ ఉపాధి హామీ ప‌థ‌కం (MGNREGA) పేరులో గాంధీ (Gandhi) పోయి రామ్ (Ram) వ‌చ్చి చేరాడు. ఇప్ప‌టికే ప‌లు పేర్లు మార్చిన కేంద్రప్ర‌భుత్వం తాజాగా ఎంజీఎన్‌ఆర్ఈజీఏ ప‌థ‌కం స్థానంలో మ‌రో ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెడుతోంది. ఆ ప‌థ‌కం పేరులో ఇంగ్లీష్ పొడి అక్ష‌రాల‌లో 'ఆర్ఏఎం' (రామ్‌) ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన బిల్లును ప్ర‌స్తుత పార్ల‌మెంటు (Parliament) స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. నూత‌న ప‌థ‌కం పేరు 'విక‌సిత్ భార‌త్ - గ్యారెంటీ ఫ‌ర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిష‌న్ (గ్రామీణ్‌)' (వీబీ - జీ ఆర్ఏఎం జీ) (VB - G RAM G).  'వీబీ - జీ ఆర్ఏఎం జీ బిల్లు 2025' పేరుతో నూత‌న బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.

పాత ప‌థ‌కంలో ప‌లు మార్పులు

ప్ర‌స్తుత ఉపాధి హామీ ప‌థ‌కంలో క‌నీస ప‌నిదినాల సంఖ్య‌ను 100 నుంచి 125కు పెంచింది. దీంతో పాటు క‌నీస వేత‌నాన్ని రూ.240కి స‌వ‌రించింది. ప‌థ‌కం అమ‌లులో నిధుల స‌మీక‌ర‌ణ‌కు రాష్ట్రాల‌పై ఆర్థిక భారం మోపింది. నూత‌న బిల్లు ప్ర‌కారం నిధుల్లో కేంద్ర ప్ర‌భుత్వం 60 శాతం వాటా, రాష్ట్ర ప్ర‌భుత్వం 40 శాతం వాటా స‌మ‌కూర్చాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాల‌య ప‌ర్వ‌త ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో అక్క‌డి ప్ర‌భుత్వాల వాటాను ప‌ది శాతంగా నిర్ణ‌యించారు. నిధుల వ్య‌యం, ప‌నులు ప‌ర్య‌వేక్షించేందుకు కేంద్ర స్థాయిలో సెంట్ర‌ల్ గ్రామీణ్ రోజ్‌గార్ గ్యారెంటీ కౌన్సిల్‌, రాష్ట్ర స్థాయిలో స్టేట్ గ్రామీణ్ రోజ్‌గార్ గ్యారెంటీ కౌన్సిల్ ఏర్పాటు కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల‌లో వ్య‌వ‌సాయ కూలీల కొర‌తను అధిగ‌మించేందుకు వ్య‌వ‌సాయ ప‌నులు ఎక్కువ‌గా జ‌రిగే స‌మ‌యంలో ఉపాధి హామీ ప‌నుల‌ను నిలిపివేస్తారు. ఇది ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ణ‌యం మేర‌కు తేదీల‌ను ముంద‌స్తుగా ప్ర‌క‌టిస్తారు. మ‌హిళ‌లు, వృద్ధులు, దివ్యాంగులు, ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్నవారికి ప్ర‌త్యేక కూలీ రేట్ల‌ను చెల్లించ‌నున్నారు. ఉపాధి హామీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారికి ప‌దిహేను రోజుల్లో ఉపాధి క‌ల్పించ‌నిప‌క్షంలో భ‌త్యం చెల్లించాల్సి ఉంటుంది. ప‌నులు చేసిన వారికి ప‌దిహేను రోజుల్లో కూలీ డ‌బ్బులు చెల్లించ‌న‌ట్ల‌యితే 0.05 శాతం అప‌రాధ రుసుముతో క‌లిపి చెల్లించాల్సి ఉంటుంది.

పేరు మార్పు స‌రికాద‌న్న ప్రియాంక గాంధీ

ఉపాధి హామీ ప‌థ‌కం పేరులో నుంచి మ‌హాత్మాగాంధీ పేరును ఎందుకు తొల‌గిస్తున్నార‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత ప్రియాంక గాంధీ ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో విలేక‌రుల‌తో మాట్లాడుతూ మ‌హాత్మాగాంధీని దేశంలోనే కాకుండా ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మైన నాయ‌కుడిగా ప‌రిగ‌ణిస్తార‌ని ఆమె గుర్తు చేశారు. ఆయ‌న పేరును తొల‌గించ‌డం వెనుక ఉన్న లోగుట్టు అర్థం కావ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ప‌థ‌కం పేరు మార్చిన‌పుడు కార్యాల‌యాలు, స్టేష‌న‌రీలో మార్పుల‌కు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. ఇదంతా వృథా ఖ‌ర్చేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement