త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నేరాల‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌.. సీపీ సుమ‌తి ఆప‌రేష‌నే నిద‌ర్శ‌నం: హ‌రీశ్‌రావు

Harish Rao | రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు (Law and Orders) పూర్తిగా దిగ‌జారాయ‌ని, ఇటీవ‌ల‌ సీపీ సుమ‌తి (CP Sumathi) నిర్వ‌హించిన ఆప‌రేష‌నే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. అంద‌రూ చూస్తుండ‌గానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యాల‌పై దాడులు, నేడు ఐఏఎస్ క్వార్ట‌ర్స్‌లో ఏకంగా ఐపీఎస్ అధికారి భార్య హ‌త్య ఉదంతాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌న్నారు.

S

News | Published On May 8, 2026, 2.57 pm IST

Harish Rao | నేరాల‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌.. సీపీ సుమ‌తి ఆప‌రేష‌నే నిద‌ర్శ‌నం: హ‌రీశ్‌రావు
Advertisement
  • అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే క్యాంపు దాడి చేశారు
  • నేడు ఐఏఎస్ క్వార్టర్స్ లో ఐపీఎస్ అధికారి భార్య హత్య జ‌రిగింది
  • కరీంనగర్ నగల దుకాణం దొంగలను పట్టుకోలేక సాకులు
  • సీపీ సుమతి ఆపరేషన్ తో మహిళల భద్రత బ‌ట్ట‌బ‌య‌లు
  • ఎన్‌సీఆర్‌బీ గణాంకాల్లోనూ తేట‌తెల్లం
  • ముఖ్యమంత్రిగా, హోమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్
  • మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు (Law and Orders) పూర్తిగా దిగ‌జారాయ‌ని, ఇటీవ‌ల‌ సీపీ సుమ‌తి (CP Sumathi) నిర్వ‌హించిన ఆప‌రేష‌నే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయ‌ని, NCRB గణాంకాలతో తెలంగాణలో నేరాల భయానక పరిస్థితి ఏంటో తెలుస్తుందన్నారు. అంద‌రూ చూస్తుండ‌గానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యాల‌పై దాడులు, నేడు ఐఏఎస్ క్వార్ట‌ర్స్‌లో ఏకంగా ఐపీఎస్ అధికారి భార్య హ‌త్య ఉదంతాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌న్నారు.

 సైబ‌ర్ నేరాలు 49 శాతం పెరిగాయి..

ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. 2024 ఎన్‌సీఆర్‌బీ (NCRB) గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బయటపెట్టాయి. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం అత్యంత ఆందోళనకరం. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో గణనీయమైన శాతం. 2023తో పోలిస్తే సైబర్ నేరాలు దాదాపు 49 శాతం పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

అధిక శాతం బాలిక‌లే..

దేశంలోనే హైదరాబాద్ అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న నగరాల్లో ఒకటిగా మారింది. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు కూడా భయానకంగా పెరిగాయి. 2024లో తెలంగాణలో 25,500 మంది మిస్సింగ్ కేసులు నమోదవగా, వారిలో వేలాదిమంది ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ప్రతి రోజు సగటున ఆరుగురు చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి నెలకొంది. చిన్నారులపై నేరాలు కూడా భారీగా పెరిగాయి. 2024లో రాష్ట్రంలో చిన్నారులపై 6,767 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్‌కు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలేనని అని ఆయ‌న వివ‌రించారు.

మాన‌వ అక్ర‌మ ర‌వాణాలో అగ్ర‌స్థానం..

మహిళలపై నేరాలు పెరిగాయి. 2022లో 22,066 కేసులు ఉండగా 2024లో అవి 24,495కు పెరిగాయని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 2024లో 423 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు కావడం అత్యంత ఆందోళనకరమన్నారు. రాష్ట్రంలో మొత్తం కాగ్నిజబుల్ నేరాలు కూడా భారీగా పెరిగాయని తెలిపారు. 2022లో 1,65,830 కేసులు ఉండగా, 2024 నాటికి అవి 2,17,976కు చేరుకున్నాయని అన్నారు.

ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో నేరాల రేటు 568.9గా ఉండగా, దేశ సగటు 418.9 మాత్రమే ఉండటం రాష్ట్ర పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు పెరగడం, మహిళలు, చిన్నారుల భద్రత క్షీణించడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు. వేలాది సైబర్ నేరాల కేసులు, మిస్సింగ్ కేసులు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన కేసులను వేగంగా చేధించేవారని, కానీ ప్రస్తుతం కరీంనగర్‌లో జరిగిన పట్టపగలు నగల దుకాణం దోపిడీ ఘటనలో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు. పట్టపగలు, ప్రజల ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఐఏఎస్ క్వార్టర్స్‌లో ఐపీఎస్ అధికారిణి భార్య హత్య వంటి ఘటనలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రలకు నిదర్శనం అన్నారు. సీపీ సుమతి నిర్వహించిన ఆపరేషన్‌తో హైదరాబాద్‌లో మహిళల భద్రత ఎంత డొల్లగా మారిందో బయటపడింద‌న్నారు.

రాజ‌కీయ ప్ర‌చారం కోసం బ‌లి చేయొద్దు...

జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షలు నిర్వహించడం మాత్రమే కాకుండా, క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్ రావు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం, రాజకీయ కక్షసాధింపు, మీడియా మేనేజ్‌మెంట్‌పైనే దృష్టి పెట్టి ప్రజల భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, మహిళలు, చిన్నారులకు మెరుగైన భద్రత కల్పించాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ప్రజల భద్రతను రాజకీయ ప్రచారం కోసం బలి చేయొద్దని హరీశ్ రావు హెచ్చరించారు.

Advertisement
Advertisement