త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee Video Message | సూర్యాస్తమయం తర్వాత గెలిచేది మనమే.. పులి బిడ్డల్లా పోరాడుదాం: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతున్న ఈ టైమ్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంల లెక్కింపులో బీజేపీ కుట్రలు పన్నుతోందని, టీఎంసీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాలు వీడి వెళ్లొద్దని ఆమె పిలుపునిచ్చారు.

J

National | Published On May 4, 2026, 2.34 pm IST

Mamata Banerjee Video Message | సూర్యాస్తమయం తర్వాత గెలిచేది మనమే.. పులి బిడ్డల్లా పోరాడుదాం: మమతా బెనర్జీ
Advertisement

Mamata Banerjee Video Message | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తున్న ఈ టైమ్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కార్యకర్తలకు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసిన ఆమె, కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎవరూ బయటకు రావొద్దని కోరారు. ఇదంతా బీజేపీ పన్నుతున్న వ్యూహం అని దీదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తొలి రెండు, మూడు రౌండ్లలో కేవలం బీజేపీ ఫలితాలను మాత్రమే చూపిస్తూ, టీఎంసీ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా తర్వాత వెల్లడిస్తున్నారని ఆమె ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు వందకు పైగా ప్రాంతాల్లో రెండు, మూడు రౌండ్ల తర్వాత కౌంటింగ్ నిలిపివేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. కల్యాణిలో ఏడు ఈవీఎం మిషన్లలో తేడాలు కనిపించాయని ఆమె ఉదహరించారు. కేంద్ర బలగాలను అడ్డుపెట్టుకుని టీఎంసీ కార్యకర్తలను అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసి బలవంతంగా ఆక్రమిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మధ్యాహ్నం సమయానికి వెలువడిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఎంసీ 98 స్థానాల్లో మాత్రమే ముందుంది. ఈ గణాంకాలపై స్పందించిన మమతా బెనర్జీ, బీజేపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. గెలవగలిగే స్థానాల్లో వారు ఓట్లను ఎలా లూటీ చేశారో అందరూ చూశారని ఆమె అన్నారు. తాము ఇంకా 70 నుంచి 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ సమాచారాన్ని ఎన్నికల అధికారులు బయటకు వెల్లడించడం లేదని ఆమె ఆరోపించారు.

కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా తమ ఇష్టానుసారం, కేంద్ర బలగాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని దీదీ దుయ్యబట్టారు. రాష్ట్ర పోలీసులు సైతం కేంద్ర బలగాలకు పూర్తి స్థాయిలో లొంగిపోయి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలతో పార్టీ కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరూ నిరాశ చెందవద్దని ఆమె ధైర్యం చెప్పారు.

సూర్యాస్తమయం తర్వాత కచ్చితంగా టీఎంసీ విజయం సాధిస్తుందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. కేవలం మూడు, నాలుగు రౌండ్ల లెక్కింపు మాత్రమే పూర్తయిందని, ఇంకా 14 నుంచి 18 రౌండ్ల లెక్కింపు మిగిలి ఉందని ఆమె గుర్తు చేశారు. అంతిమ విజయం మనదేనని, వేచి చూడాలని సూచించారు. తాము కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ భయపడవద్దని, పులి బిడ్డల్లా పోరాడుదామని మమతా బెనర్జీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

Advertisement
Advertisement