త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weather Report | దేశ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణ మార్పులు

Weather Report | దేశంలో నైరుతి రుతుప‌వ‌నాలు మంద‌గించినా వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. జమ్ముకశ్మీర్, ఈశాన్య హిమాలయ ప్రాంతాలు, తూర్పు–దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు న‌మోద‌వుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వాన‌లు కురుస్తున్నాయి.

P

National | Published On Jun 23, 2026, 9.39 am IST

Weather Report | దేశ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణ మార్పులు
Advertisement
  • ప‌లుచోట్ల ఎండ‌లు
  • మ‌రికొన్ని చోట్ల వాన‌లు
  • ప్ర‌యాగ్‌రాజ్‌లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త రికార్డు
  • రాజ‌స్థాన్‌లో ఇసుక తుఫాన్లు
  • రుతుప‌వ‌నాలు పుంజుకుంటున్నాయ‌న్న ఐఎండీ

Weather Report | దేశంలో నైరుతి రుతుప‌వ‌నాలు మంద‌గించినా వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. జమ్ముకశ్మీర్, ఈశాన్య హిమాలయ ప్రాంతాలు, తూర్పు–దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు న‌మోద‌వుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వాన‌లు కురుస్తున్నాయి. అదే సమయంలో తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్నాయి. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ దేశంలోనే అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న‌మోదైంది. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులు ఇదే తరహా ప‌రిస్థితులు ఉండొచ్చ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా వేసింది.

హిమాచల్‌లో వ‌ర్షాలు..

హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తంగ్ పాస్, పంగి ఎత్తయిన ప్రాంతాల్లో సోమవారం మంచు కురిసింది. కులూ, చంబా జిల్లాల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడగా.. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. చంబా, కాంగ్రా, కులూ, మండి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు, మంచుతో రాష్ట్రంలో వాతావరణం కొంత చల్లబడింది. అయితే ఉనా జిల్లాలో 35.4 డిగ్రీలతో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలోని కండి ప్రాంతంలో క్ల‌డ్ బ‌ర‌స్ట్ కార‌ణంగా వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ప‌లు ప్రాంతాలు నీట‌మునిగాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ఉదయం ఎండ కాస్త కనిపించగా, మధ్యాహ్నానికి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని భారీ వర్షాలు కురిశాయి. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. శ్రీనగర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలుగా నమోదైంది.

ఉరుములు, మెరుపులు.. 11 మంది మృతి

గత 24 గంటల్లో పంజాబ్‌లో అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసింది. పశ్చిమ బెంగాల్ సబ్హిమాలయ ప్రాంతాలు, మేఘాలయలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఒడిశా, బీహార్, మధ్య మహారాష్ట్ర, తీర కర్ణాటక, తమిళనాడు, కేరళ, త్రిపుర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో గంటకు 40 నుంచి 81 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన వాన‌లు కురిశాయి. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్య మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతున్నాయి. పిడుగుపాటు పాటుకు ఝార్ఖండ్‌లో 11 మంది మృతి చెందారు. ఖుంటి జిల్లాలో నాలుగు న‌లుగురు, రామ్‌ఘర్‌లో రెండు, లోహర్దగా, దేవఘర్, జామ్‌తారా, సాహెబ్‌గంజ్, గిరిదిహ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్‌లో ఇసుక తుఫాను..

పశ్చిమ రాజస్థాన్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, కొన్ని చోట్ల 80 కిలోమీటర్ల వేగంతో ఇసుక తుఫానులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ప్రజలు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మ‌రో వైపు బీహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎవ‌రూ చెట్ల కింద ఉండొద్ద‌ని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని హెచ్చరించింది.

విస్త‌రిస్తున్న రుతుప‌వ‌నాలు..

రెండు వారాలుగా మందగించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. మధ్య భారతం వైపు వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమివ్వనుంద‌ని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, క‌ర్నాట‌క‌లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్త‌రించాయ‌ని పేర్కొంది. వచ్చే 48 గంటల్లో ముంబయి సహా మహారాష్ట్ర, మిగతా తెలంగాణ, ఒడిశా, బీహార్, ఝార్ఖండ్‌లోని మరిన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉండ‌గా.. ప్రయాగ్‌రాజ్‌లో 43.3 డిగ్రీలతో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్ర వార్ధాలో 43 డిగ్రీలు, మధ్యప్రదేశ్ దాతియా, తెలంగాణ ఆదిలాబాద్, మహారాష్ట్ర అమరావతి, ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్, కాన్పూర్, వారణాసి, ఓరై ప్రాంతాల్లో 42.2 నుంచి 41.2 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement
Advertisement